హెల్త్‌ సెంటర్లు హైజాక్‌!

ABN , First Publish Date - 2022-08-12T06:37:51+05:30 IST

కొన్నాళ్లు కిందటి వరకూ ఆయన ఒక మంత్రి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్కరే మంత్రి కావడంతో కార్యక్రమాలన్నీ ఆయన చేతులమీదుగానే జరిగేవి.

హెల్త్‌ సెంటర్లు హైజాక్‌!
మారికవలసలో నిర్మించిన వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

నగరంలో పలు ప్రాంతాలకు మంజూరైన యూపీహెచ్‌సీలు భీమిలి నియోజవర్గానికి తరలింపు

పిఠాపురం కాలనీలో స్థలం ఉన్నా మారికవలస భవన నిర్మాణం

దండుబజార్‌ హెల్త్‌ సెంటర్‌...చేపలుప్పాడకు స్థలాలు లేకపోవడమే కారణమని సమర్థించుకుంటున్న అధికారులు

మాజీ మంత్రి ఒత్తిడే కారణమని ఆరోపణలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొన్నాళ్లు కిందటి వరకూ ఆయన ఒక మంత్రి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్కరే మంత్రి కావడంతో కార్యక్రమాలన్నీ ఆయన చేతులమీదుగానే జరిగేవి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికి ఎక్కువ నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండబోదు. కానీ ఆయన జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలకు మంజూరైన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు(యూపీహెచ్‌సీ)ల్లో కొన్నింటిని తన నియోజకవర్గానికి తరలించుకుపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. భవన నిర్మాణానికి తగిన స్థలాలు లేవంటూ అధికారులు కొన్ని ప్రాంతాలకు మంజూరైన యూపీహెచ్‌సీలను మాజీ మంత్రి నియోజకవర్గానికి తరలించి నిర్మాణాలు పూర్తిచేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట జీవీఎంసీకి 42 యూపీహెచ్‌సీలను మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.80 లక్షలు చొప్పున ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులను కేటాయించింది. భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించడంతోపాటు వాటిని నిర్మించి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించే బాధ్యతను జీవీఎంసీకి అప్పగించింది. జీవీఎంసీలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 42 భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి ఇంజనీరింగ్‌ విభాగానికి నివేదిక సమర్పించారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఆయా స్థలాల్లో భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. భవన నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత పూర్తిచేయడానికి రూ.80 లక్షలు సరిపోవని రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌ ఇవ్వడంతో జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి రూ.20 లక్షలు నుంచి రూ.50 లక్షలు వరకూ కేటాయించింది. అయితే జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీకి కేటాయించిన యూపీహెచ్‌సీ భవనాన్ని భీమిలి నియోజకవర్గ పరిధిలోని మారికవలసలో నిర్మించారు. అలాగే 29వ వార్డు పరిధి దండుబజార్‌కు కేటాయించిన హెల్త్‌ సెంటర్‌ను భీమిలి నియోజకవర్గం పరిధిలోని చేపలుప్పాడలో నిర్మించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంబంధిత కార్పొరేటర్లు జీవీఎంసీ అధికారులను ప్రశ్నించారు. స్థలాల సమస్య వున్నందున జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారి సూచన మేరకు ప్రత్యామ్నాయ స్థలాల్లో భవనాలు నిర్మించామని సమాధానమివ్వడంతో కార్పొరేటర్లు విస్తుబోయారు. తమ వార్డు ప్రజలు అనారోగ్యానికి గురైతే భీమిలి నియోజకవర్గంలోని హెల్త్‌ సెంటర్‌లకు వెళ్లి వైద్యం చేయించుకోవాలా?...అని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువైందని చెబుతున్నారు. ఇప్పటికి రెండు మాత్రమే బయటకు వచ్చినప్పటికీ మరికొన్ని ఇలాంటివి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మాజీ మంత్రి ఒత్తిడితోనే తరలింపు

జీవీఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాలకు మంజూరైన కొన్ని యూపీహెచ్‌సీ భవనాలు భీమిలి నియోజకవర్గం పరిధిలో నిర్మించడం వెనుక మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రమేయం వుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం కాలనీకి మంజూరైన భవనాన్ని నిర్మించేందుకు 22వ వార్డు పరిధిలోనే శివానందపురంలో తగిన స్థలం ఉంది. అధికారులు అక్కడ భవనం నిర్మించాలని స్థలాన్ని శుభ్రం చేశారు కూడా. తర్వాత ఏమైందో గానీ మారికవలస మార్చేశారు. అలాగే 29వ వార్డు పరిధి దండుబజార్‌లో నిర్మించాల్సిన యూపీహెచ్‌సీ భవనం నిర్మాణానికి జిల్లా గ్రంథాలయం భవనం వెనుక, రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ భవనం వెనుక జీవీఎంసీకి చెందిన స్థలాలు ఉన్నాయి. ఆ రెండింట్లో ఎక్కడో ఒకచోట నిర్మిస్తే ఆ ప్రాంత వాసులకు మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ, స్థలం లేదనే సాకుతో చేపలుప్పాడ తరలించి నిర్మాణం పూర్తిచేశారు. దీనివెనుక అప్పట్లో మంత్రిగా పనిచేసిన నేత ఒత్తిడి ఉందని పలువురు పేర్కొంటున్నారు. 


ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడే నిర్మించాం

రవికృష్ణరాజు, జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌

యూపీహెచ్‌సీల నిర్మాణం వరకూ మా బాధ్యత. స్థలం ఎక్కడ చూపిస్తే అక్కడే భవనం నిర్మించాం. నగరంలో 42 యూపీహెచ్‌సీలకుగాను ఎనిమిది భవనాలకు స్థలం సమస్య ఎదురైంది. అందులో మూడు కోర్టు కేసులు ఉండగా...మరో మూడింటిని స్థానికులు అడ్డుకున్నారు. మిగిలిన రెండింట్లో కూడా ఇతర సమస్యలు ఉన్నాయి. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారు ప్రత్యమ్నాయంగా చూపించిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తిచేశాం.


వార్డు సచివాలయాల ప్రాతిపదికనే యూపీహెచ్‌సీల నిర్మాణం:

శశిభూషణ్‌రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రాజెక్టు సమన్వయకర్త

నగరంలో వార్డు సచివాలయాల ప్రాతిపదికగానే యూపీహెచ్‌సీల నిర్మాణం జరిగింది. ఎనిమిది, పది వార్డులకు ఒక్కొక్క యూపీహెచ్‌సీ నిర్మిస్తున్నాం. పిఠాపురం కాలనీకి సమీపంలోని రేసపువానిపాలెం, చినవాల్తేరులో యూపీహెచ్‌సీలు ఉన్నాయి. అలాగే దండుబజార్‌కు సమీపంలోనే రెల్లివీధి, రంగ్రీజువీధిలో యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఇటీవల జీవీఎంసీలో విలీనమైన గ్రామాల ప్రజలకు అనువుగా ఉంటుందనే కాపులుప్పాడలో హెల్త్‌ సెంటర్‌ నిర్మించాం. 



Updated Date - 2022-08-12T06:37:51+05:30 IST