వైద్యశాఖలో బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2022-04-22T17:12:42+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు వైద్యాధికారి నుంచి సిబ్బందిదాకా బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తామని మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌

వైద్యశాఖలో బయోమెట్రిక్‌

- గుణాత్మక మార్పులకు సమూల చర్యలు 

- హాజరు ప్రకారం వేతనాల వ్యవస్థ 

- అటెండర్‌ నుంచి ఆరోగ్యశాఖాధికారి వరకు ..

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ 


బెంగళూరు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు వైద్యాధికారి నుంచి సిబ్బందిదాకా బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తామని మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు. నగరంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ హాజరు ప్రకారం వేతనాలు చెల్లించే వ్యవస్థను తీసుకువస్తామన్నారు. వైద్యులు, అధికారులు, సిబ్బంది కార్యాలయ సమయంలో అందుబాటులో ఉండరనే ప్రజా ప్రతినిధులు తరచూ ఫిర్యాదు చేస్తున్న మేరకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు అనుబంధమైన అన్ని సంస్థలలోనూ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేస్తామన్నారు. రెండు నెలలక్రితమే బయోమెట్రిక్‌ను అమలు చేసేలా ఆదేశించామని ప్రక్రియ సాగుతోందన్నారు. సిబ్బంది, వైద్యుల పర్యవేక్షణ బాధ్యత బీడీఓలదే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఆసుపత్రికి బాధితులు వెళ్లినా వైద్యం అందుబాటులో ఉంటుందనే భరోసా కల్పించదలిచామన్నారు. ప్రతివారం ప్రగతి పరిశీలన జరపదలిచామన్నారు.పేదలకు నిత్యం వైద్యం అందించడమే ధ్యేయంగా విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలనా కేంద్రాలలో ఉదయం 10గంటలకు మధ్యాహ్నం 1 గంటకు సాయంత్రం 5.30 గంటలకు, ఆసుపత్రులలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 1గంటకు, సాయంత్రం 4.30గంటలకు, సెలవురోజులలో  ఉదయం, సాయంత్రం రెండుపూటలా, ఆసుపత్రిలో సిబ్బందికి మొదటి షిఫ్ట్‌లలో పనిచేసేవారు ఉదయం 8 గంటలకు, 11, 2గంటలకు, రెండో షిఫ్ట్‌లలో పనిచేసేవారికి మధ్యాహ్నం 2, సా యంత్రం 5, రాత్రి 8 గంటలకు, మూడో షిఫ్ట్‌వారికి రాత్రి 8గంటలకు, అర్ధరాత్రి 12, ఉదయం 8గంటలకు హాజరు నమోదు ఉండాలన్నారు. హాజరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బయో మెట్రిక్‌ పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 3,230 సంస్థలు కాగా 65,318 మంది సిబ్బంది ఉ న్నారు. అటెండర్‌ నుంచి ఆరోగ్యశాఖాధికారి దాకా అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు, సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు.

Updated Date - 2022-04-22T17:12:42+05:30 IST