ఆరోగ్యమే పరమావధి

ABN , First Publish Date - 2022-01-22T04:32:11+05:30 IST

కరోనా కేసులు పెరు గుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ముం దుకు వెళుతోంది.

ఆరోగ్యమే పరమావధి
ఏనుగొండలో ఇంటింటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జనవరి 21: కరోనా కేసులు పెరు గుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ముం దుకు వెళుతోంది. అందులో భాగంగా ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఏను గొండలోని పలు ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు డోసులు వేసుకున్నారా, ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో అందరికీ పంపిణీ చేసిన తర్వాత ఇంకా 1 లక్ష వరకు ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఏమాత్రం లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌ కిట్లలోని మాత్రలను వేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఎవరికైనా చికిత్స అవసరం అయితే 08542-241165 అనే ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఉచితంగా ఇంటికి వచ్చి చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేశామన్నారు. అనంతరం కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని అన్నారు. ఐదు రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశిం చారు. సర్వే బృందాలు ప్రతీ రోజు ఉదయం ఏడు గంటలకే గ్రామాలకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కే.సి నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో డా. కృష్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండు లక్షల ఇళ్లలో సర్వే: ఇంటింటా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 లక్షల వరకు ఇండ్లలో సర్వే చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇదివరకు చేసిన సర్వేలో 1,89,319 ఇళ్లు సర్వే చేశారు. అందులో మరికొన్ని మిగిలిపో వడంతో దాదాపు 2 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సర్వేకు 750 బృందాలను ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-01-22T04:32:11+05:30 IST