అండకణాల అమ్మకం వ్యవహారం.. ఆస్పత్రులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-07-15T14:23:56+05:30 IST

ఈరోడ్‌ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించిన అండకణాల విక్రయం వ్యవహారానికి సంబంధించి నాలుగు ప్రైవేటు ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేసేలా

అండకణాల అమ్మకం వ్యవహారం.. ఆస్పత్రులపై కఠిన చర్యలు

                           - ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం 


చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఈరోడ్‌ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించిన అండకణాల విక్రయం వ్యవహారానికి సంబంధించి నాలుగు ప్రైవేటు ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేసేలా కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. గురువారం ఆయన చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ వ్యవహారంలో తిరుపతి, తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రులపై కూడా చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనున్నామని తెలిపారు. పదహారేళ్ల బాలికపై ఆమె పెంపుడు తండ్రి అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిందని, ఆ సమయంలో ఆమె నుంచి అండకణాలు తీసి ఆరు ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న బాలిక తల్లి, పెంపుడు తండ్రి, మరో మహిళ వద్ద విచారణ పూర్తయ్యిందని, త్వరలో ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక సమర్పించనున్నారని చెప్పారు. ఈ కేసులో అండకణాలను కొనుగోలు చేసిన ఈరోడ్‌, సేలం నగరాల్లో ఉన్న సుధా ఆస్పత్రులు, పెరుందురైలోని రామ్‌ప్రసాద్‌ ఆస్పత్రి, హోసూరులోని విజయ్‌ ఆస్పత్రి శాశ్వతంగా మూతపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నాలుగు ఆస్పత్రులను ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం నుంచి తొలగించామన్నారు. ఈ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని 15 రోజుల్లోగా డిశ్చార్జ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు వైద్యచట్టాల ప్రకారం ఈ నాలుగు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు రూ.50లక్షల వరకు జరిమానా విధించడంతోపాటు పదేళ్ల జైలు శిక్షకూడా విధించే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా తిరువనంతపురంలోని కృష్ణా ఆసుపత్రి, తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు లేఖలు రాశారని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-15T14:23:56+05:30 IST