జీసీసీలో వార్డుకొక ప్రభుత్వ ఆస్పత్రి

ABN , First Publish Date - 2022-05-11T14:12:11+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో వార్డుకొకటి చొప్పున 200 ప్రభుత్వ ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రకటించారు. మంగళవారం ఉదయం

జీసీసీలో వార్డుకొక ప్రభుత్వ ఆస్పత్రి

చెన్నై: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో వార్డుకొకటి చొప్పున 200 ప్రభుత్వ ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రకటించారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే శాసనసభ్యుడు తాయగం కవి మాట్లాడుతూ... తిరువిక నగర్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి సుబ్రమణ్యం స్పందిస్తూ... సబర్బన్‌ ప్రాంతాల్లో కొత్తగా 708 ఆసుపత్రులు నెలకొల్పనున్నట్లు ఇటీవల శాసనసభలో సభా నిబంధన 110 కింద ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఆ మేరకు నగరంలోని 200 వార్డుల్లో వార్డుకు ఒకటి చొప్పున త్వరలో ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఈ ఆస్పత్రుల్లో నవీన సాంకేతిక వైద్యపరికరాలతో రోగులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా వార్డులకు చెందిన రోగులు తమకు అందుబాటులో ఉండే ఈ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులు ఏర్పాటైతే నగరంలో నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీ గణనీయంగా తగ్గుతుందన్నారు. కాగా ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న నాలుగువేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నామని మంత్రి తెలిపారు.

Read more