డోసు పెంచుతాం...

ABN , First Publish Date - 2022-07-16T13:32:25+05:30 IST

ప్రజల సౌకర్యార్ధం ఇక నుంచి నెలకు రెండు మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు.

డోసు పెంచుతాం...

- నెలకు రెండు మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు

- మంత్రి ఎం.సుబ్రమణ్యం

- రాష్ట్రంలో బూస్టర్‌ టీకా పంపిణీ షురూ


పెరంబూర్‌(చెన్నై), జూలై 15: ప్రజల సౌకర్యార్ధం ఇక నుంచి నెలకు రెండు మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 18-59 ఏళ్లలోపున్న వారికి బూస్టర్‌ డోస్‌ ఉచితంగా అందజేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఎగ్మూర్‌లో కుటుంబ సంక్షేమశాఖ శిక్షణా కేంద్రంలో శుక్రవారం బూస్టర్‌ డోస్‌ శిబిరాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోస్‌, 87.35 శాతం మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారన్నారు. రెండో డోస్‌ వేసుకొని బూస్టర్‌ డోస్‌కు అర్హులైన వారు 3,60,60,204 మంది ఉండగా, వారిలో 18,08,669 మంది మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వాసుపత్రుల్లో 60 ఏళ్లు పైబడిన వారు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మాత్రమే బూస్టర్‌ డోస్‌ ఉచితంగా అందిస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.386.25కు వేస్తున్నారని, అందువల్ల ప్రజలు బూస్టర్‌ డోస్‌ వేసుకొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. కొవీషీల్డ్‌, కొవాక్సిన్‌ వేసుకున్న వారికి అదే రకం వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌గా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిల్వవున్న 30 లక్షల డోస్‌లు సెప్టెంబరు 30తో కాలపరిమితి చెందుతాయని, అందువల్ల వాటిని సద్వినియోగం చేయాలని నిర్ణయించామన్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 రోజులు బూస్టర్‌ డోస్‌ ఉచితంగా వేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించిందని, ఆలోగా కాలపరిమితి ముగిసే టీకాలు వినియోగించనున్నామన్నారు. ఇకపై నెలకు రెండు మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 24వ తేది రాష్ట్రవ్యాప్తంగా 50 వేల శిబిరాలు ఏర్పాటుచేయనుండగా, ఈ శిబిరాల్లో ప్రజలు మొదటి, రెండు, బూస్టర్‌ డోస్‌లు వేసుకోవచ్చన్న మంత్రి రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 2,590 టీకా కేంద్రాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు.

Updated Date - 2022-07-16T13:32:25+05:30 IST