ఆరోగ్య తెలంగాణగా మార్చాలి

ABN , First Publish Date - 2021-11-28T08:42:59+05:30 IST

ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

ఆరోగ్య తెలంగాణగా మార్చాలి

  • ఆరోగ్యసూచీల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలి.. 
  • రక్తహీనత సమస్యను రాష్ట్రంలో బాగా తగ్గించాలి
  • ప్రతినెలా విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తా
  • పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రోత్సాహకాలు
  • వైద్యాధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

 

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించే దిశగా, ‘ఆరోగ్య తెలంగాణ’ కల సాకారమయ్యే దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని, పనితీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని అన్నారు. పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటురాయి అవుతుందని తెలిపారు. శనివారం జాతీయ ఆరోగ్య మిషన్‌పై కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందని, అధికారులు కూడా ఆరోగ్య కార్యక్రమాల అమలులో అదే స్థాయిలో శ్రద్ధ చూపించాలని అన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉండాలన్నారు. మలేరియా, డెంగ్యూ పరిస్థితుల గురించి ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ చర్యలు చేపట్టాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. 


ఆస్పత్రి ప్రసవాలను వంద శాతానికి పెంచాలి..

ప్రసూతి మరణాలు తగ్గించే విషయంలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు దానిని మొదటి స్థానానికి తీసుకురావాలన్నారు. ఆస్పత్రి ప్రసవాలను 97 శాతం నుంచి వందశాతానికి పెంచడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రెండు వారాల్లో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో క్యాథ్‌ లాబ్స్‌ సిద్ధం కావాలని, డిసెంబరు రెండో వారంలోగా ఖమ్మంలోని క్యాథ్‌ ల్యాబ్‌ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య ేసవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలన్నారు.  ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఆశ, మెటర్నల్‌ హెల్త్‌, చైల్డ్‌ హెల్త్‌, మిడ్‌ వైఫరీ, ఆర్‌బీఎస్‌కే, హెచ్‌ఎంఐఎస్‌, టీబీ, టీ- డయాగ్నస్టిక్స్‌, 108, 104, యూపీహెచ్‌సీ, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు, పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలు, వాక్సినేషన్‌ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T08:42:59+05:30 IST