ఆరోగ్య ఉపకేంద్రాలు అవుట్‌

ABN , First Publish Date - 2022-08-08T06:07:19+05:30 IST

ఆరోగ్య ఉపకేంద్రాలు గ్రా మ ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ వస్తున్నాయి.

ఆరోగ్య ఉపకేంద్రాలు అవుట్‌
సర్దుబాటు చేస్తే కౌన్సెలింగ్‌ అడ్డుకుంటామని డీఎంహెచఓకు వినతి పత్రం అందజేస్తున్న ఎన్జీఓ నాయకులు, ఏఎనఎంలు

సచివాలయాలకు ఏఎనఎంలసర్దుబాటు

జిల్లాలో 247 మందికి స్థానచలనం

నేడు కౌన్సెలింగ్‌... అడ్డుకుంటామంటున్న ఏఎనఎంలు

అనంతపురం టౌన ఆగస్టు7: ఆరోగ్య ఉపకేంద్రాలు గ్రా మ ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ వస్తున్నాయి. ఉపకేంద్రాలకు ప్రత్యేక ఏఎనఎంలు ఉంటూ ఆయా పంచాయతీలు పరిధిలో పర్యటిస్తూ ఏళ్ళుగా వైద్యసేవలు అందించేవారు. అయితే ప్రస్తుతం ఉపకేంద్రాల సేవలకు ప్రభుత్వం కటీఫ్‌ ఇచ్చేసింది. ఇక నుంచి కేవలం సచివాలయాల ఏఎనఎంలు మాత్రమే సేవలు అందించేలా నిర్ణయించారు. అందులో భాగంగా ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ఏఎనఎంలను సచివాలయాలకు సర్దుబాటు చేయనున్నారు. ఖాళీగా ఉన్న సచివాలయాలకు నియమించేందుకు రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా వైద్యశాఖ ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలను సచివాలయాలకు నియమించేందుకు సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 247 మంది ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలు ఉన్నట్లు జిల్లా ఇంచార్జ్‌  వైద్యాధికారి డాక్టర్‌ యుగంధర్‌ తెలిపారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 232 సచివాలయాల్లో ఏఎనఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఉన్న 247 మంది ఏఎనఎంలను సీనియారిటీ ఆధారంగా కౌన్సిలింగ్‌ నిర్వహించి సచివాలయాలకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అది కూడా సోమవారం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ మిగులు ఏఎనఎంలు సచివాలయాల ఖాళీల వివరాలను ప్రకటించింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్‌ నిర్వహించి ప్లేస్‌లు కేటాయించనున్నారు. అయితే ఈ సర్దుబాటుపై ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలు మండిపడుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాం. అది కూడా గ్రేడ్‌-2 ఏఎనఎంలుగా విధులు నిర్వర్తిస్తూ వేతనాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు గ్రేడ్‌-3 కేడర్‌లో సచివాలయాలకు ఎలా నియమిస్తారని మండి పడుతున్నారు. అందుకే సర్దుబాటు వద్దని అవసరమైతే కౌన్సెలింగ్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారు. వీరికి ఎనజీఓ నేతలు మద్దతు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సర్దుబాటు చేస్తున్నామని డీఎంహెచఓ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఎనఎంల సర్దుబాటుపై ఏం జరుగుతుందో చూడాలి మరి. 

Updated Date - 2022-08-08T06:07:19+05:30 IST