ఐపీఎప్ ప్రియులకు హెల్త్ టిప్స్

ABN , First Publish Date - 2021-10-10T00:43:02+05:30 IST

ఐపీఎల్‌ రెండో దశ పోటీలు రంజుగా జరుగుతున్నాయి. తమ అభిమాన జట్లకు మద్దతుగా టీవీల ముందు స్నేహితులతో కలిసి సందడి చేస్తున్న క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే కనబడుతున్నారు.

ఐపీఎప్ ప్రియులకు హెల్త్ టిప్స్

ఐపీఎల్‌ రెండో దశ పోటీలు రంజుగా జరుగుతున్నాయి. తమ అభిమాన జట్లకు మద్దతుగా టీవీల ముందు స్నేహితులతో కలిసి సందడి చేస్తున్న క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే కనబడుతున్నారు. ఇక ఫ్యామిలీలతో సహా టీవీలకు అతుక్కుపోతున్న అభిమానులూ ఫ్యాన్‌వాల్‌పై తరచుగా కనబడుతూనే ఉన్నారు. పోటాపోటీగా ఆడే టీమ్‌ల మధ్య మ్యాచ్‌ అయితే ఆ రోజుకు ఇంటిలో వంటకు రెస్ట్‌ ఇస్తున్న నవతరమూ నగరంలో ఎక్కువగానే కనబడుతుంది. ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన తరువాత రాత్రి 12 గంటల వరకూ బిజీగానే గడుపుతున్నారు. హైదరాబాద్‌లో బిర్యానీకే మొదటి స్థానం అని తెలిసిందే కానీ ఇతర వంటకాలు, మరీ ముఖ్యంగా స్పైసీఫుడ్‌కు కాస్త అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెబుతున్నాయి పలు ఫుడ్‌ యాగ్రిగేటర్ల అధ్యయనాలు. అయితే అర్ధరాత్రులు తీసుకునే ఈ తరహా ఆహారంతో ఆరోగ్య పరంగా చేటే అని అంటున్నారు న్యూట్రిషియనిస్ట్‌లు, డైటీషియన్లు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నంత సేపు చిప్స్‌ లేదంటే పాప్‌కార్న్‌ లాగించడంతో పాటుగా కూల్‌ డ్రింక్స్‌తో ఎంజాయ్‌చేయడం బాగానే ఉంటుంది కానీ, సీజన్‌ ముగిసే సరికి మీ నడుం చుట్టుకొలత పెరగడం మాత్రం తథ్యమంటున్నారు. ఐపీఎల్‌ మజాను ఆస్వాదించాలి కానీ అనారోగ్యం బారిన పడేలా మాత్రం చేసుకోకుండా ఆరోగ్యాన్ని మాత్రం పదిలంగా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి పూట ఆకలి వేస్తే ఏం తినాలనే అంశమై  పలువురు న్యూట్రిషియన్లు, డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే...


టీవీ ముందు అనాలోచితంగా ఏదో ఒకటి తినడం కాకుండా ఆరోగ్యవంతమైనది తినడానికి ప్రయత్నించాలి. చిప్స్‌కు బదులు బాదములు, కూల్‌ డ్రింక్స్‌కు బదులు ప్రోటీన్‌ స్మూతీలు.. ఇలా ఇంకా ఏం తినవచ్చో చెబుతూనే, పరిమిత పరిమాణంలో మాత్రమే వీటిని తీసుకోవాల్సి ఉంటుందనీ చెబుతున్నారు.



అరటిపళ్లు

అరటిపళ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీనికి తోడు ట్రిప్టోఫాన్‌ కూడా అరటిలో ఉంటుంది. నిద్రకు తోడ్పడే మెటలోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ఇవి తోడ్పడతాయి.  అరటిలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉంటాయి. దీనివల్ల ఒకటి తిన్నా కడుపు నిండుగా అనిపించి ఇతర పదార్ధాలు తినకుండా  అడ్డుకుంటుంది.


బాదములు

అరటి లాగానే బాదములలో కూడా మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటుగా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆకలిని తీర్చే గుణాలు కూడా బాదములలో ఎక్కువ. ఒత్తిడిని తగ్గించే లక్షణాలూ బాదములలో అధికంగా ఉండటం వల్ల  సుఖనిద్ర కూడా సాధ్యమవుతుంది.


పాలు

మన పూర్వీకుల కాలం నుంచి చెబుతున్న అంశమిది. ఓ గ్లాసుడు పాలు నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. మానవ శరీరం ఉత్పత్తి చేయలేని అమినోయాసిడ్‌ ట్రిప్టోఫాన్‌ ఈ పాలలో ఉంటుంది.


వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌లో  ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అర్థరాత్రుళ్లు ఆకలి ఎక్కువగా ఉన్నవారికి ఈ వాల్‌ నట్స్‌ కాస్త తిన్నా కూడా  కడుపు నిండిందన్న భావన అందిస్తుంది. వాల్‌నట్స్‌లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో డీహెచ్‌ఏగా మారుతుంది. మెదడులో నిద్రకు తోడ్పడే రసాయనాలను వృద్ధి చేయడంలో ఇది తోడ్పడుతుంది.


ఓట్స్‌

మనం తినే అన్నం లాగానే ఓట్స్‌లోనూ కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. రాత్రిపూట తినడం వల్ల కొంతమందికి  తలతిప్పినట్లు అనిపిస్తుంది కానీ దీనిలో స్లీప్‌ హార్మోన్‌ ప్రేరేపించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.


చెర్రీలు

డిన్నర్‌ తరువాత స్వీట్‌ అనేవారికి అనుకూలంగా ఇవి ఉండటమే కాదు,  సుఖనిద్రకూ తోడ్పడతాయి. ఈ చెర్రీలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. శరీరానికి  అవి బాగా తోడ్పడతాయి.


ప్రొటీన్‌ స్మూతీలు

నిద్రకు ఉపక్రమించే ముందు ప్రొటీన్‌ అధికంగా ఉన్న స్మూతీలు తీసుకోవడం వల్ల కండరాల మరమ్మత్తుకు మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వయసు సంబంధిత కండర నష్టాలూ తగ్గుతాయి.


అర్ధరాత్రి ఆహారంతో అనారోగ్యం

– వి కృష్ణ దీపిక, ఎంఎస్‌సీ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌


ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలు ఆకలి లేకపోయినా తినేందుకు తోడ్పడతాయి. ఇక టీవీ స్ర్కీన్‌ల ముందు కూర్చుంటే ఏం తింటున్నామో కూడా  తెలియకుండానే తింటుంటాం.  అర్థరాత్రి పూట తినడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, గ్యాస్ర్టిక్‌ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు రావొచ్చు. అర్థరాత్రిల్లు మీరు తినే ఆహారం శరీరంలో కొవ్వుగా మారి అది ఊబకాయానికి దారి తీయవచ్చు. నిద్రకు, కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోకపోవడం మంచిది. తినే ప్రతిసారీ అధిక ప్రొటీన్‌, ఫైబర్‌ ఉన్న మీల్స్‌ను  తీసుకోవాలి. నైట్‌ ఈటింగ్‌ సిండ్రోమ్‌ ఉన్న వారికి సైతం ఇవి తోడ్పడతాయి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు ఓ గ్లాసుడు పాలు మేలు చేస్తాయి.

Updated Date - 2021-10-10T00:43:02+05:30 IST