ఆరోగ్య ‘యోగ’ం

Published: Tue, 21 Jun 2022 00:18:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆరోగ్య యోగం

మానసిక ప్రశాంతతకు తారక మంత్రం
యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు దూరం
పరిపూర్ణ ఆయుష్షుకు చక్కటి మార్గం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక దివ్య ఔషధం. వేల సంవత్సరాల నుంచి యోగా భారతీయ జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది ప్రపంచ దేశాలకు విస్తరించి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. దీని విశిష్టతను గుర్తించి ఏటా జూన్‌ 21న యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరాన్ని, మనస్సు రెండింటినీ సమతుల్యం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉందని యోగా గురువులు చెబుతున్నారు. ‘యోగాతో  రోగనిరోధక శక్తి పెరుగుతుంది... బస్రిక ప్రాణాయామ, కపాలభాతి, భ్రమరి ప్రకియల వల్ల ఊపిరితిత్తులు పనిచేసే శక్తి వృద్ధి చెందుతుంది..  దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, థైరాయిడ్‌ వంటివి దూరం అవుతాయి.. మొండి రోగాలకు సైతం ఉపశమనం లభిస్తుంది..’ అని నిపుణులు పేర్కొంటున్నారు. యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకర, ప్రశాంత జీవనం సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం చలో యోగా!

హనుమకొండ/వర్ధన్నపేట జూన్‌ 20: మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక దివ్య ఔషధం. వేల సంవత్సరాల నుంచి యోగా మన భారతీయ జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది ప్రపంచ దేశాలకు విస్తరించి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. దీని విశిష్టతను గుర్తించి ఏటా జూన్‌ 21న యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరాన్ని, మనస్సు రెండింటినీ సమతుల్యం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉందని యోగా గురువులు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలిక, మొండి రోగాలకు సైతం యోగాతో ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.

మానవ దేహం.. ఇలా నిర్మితం..
మానవదేహం 300 ఎముకల జాయింట్లు.. 700కు పైగా కండరాలు.. వేల కిలోమీటర్ల పొడవు కలిగిన నాడీ తంతువులు, రక్తనాళాలతో నిర్మితమైంది. వీటన్నింటినీ పని చేయించే నాడీ కేంద్రాలు మెదడులో సుమారుగా 20 వేలకు పైగా ఉంటాయి. ఒక్కో నాడీ కేంద్రం శరీరంలో ఒక్కో అవయవానికి నాడీ తంతువు ద్వారా నేరుగా కలపబడి ఉంటుంది. నాడీకేంద్రం సక్రమంగా పనిచేయకపోతే ఆ అవయవం పని చేయదు. కానీ, ఆ నాడీ కేంద్రాన్ని సరిగా పనిచేయించే అద్భుతమైన ప్రక్రియే యోగా.

యోగా అంటే ఏమిటి..

యోగా అనే శబ్దం ‘ఇజ్‌’ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఇజ్‌ అంటే రెండింటి కలయిక అని అర్థం. అంటే పైకి కనిపించే స్థూల శరీరం, కంటికి కనిపించకుండా స్థూల దేహాన్ని నడిపించే సూక్ష్మశరీరం. ఈ రెండు ఒకే చోట కలిసి పనిచేస్తుంటే అదే యోగం లేదా ధ్యానం అంటారు. దీనిని క్రీస్తు పూర్వం 5వేల ఏళ్ల క్రితం భారతదేశానికి చెందిన యోగా పితామహుడు పతంజలి మహర్షి తెలియజేశారు. ఆయన యోగాను ఎనిమిది భాగాలుగా విభజించి దానికి అష్టాంగ యోగమనే పేరు పెట్టారు. ఈ ఎనిమిది అంగాల్లో శారీరక శుద్ధి కోసం ఐదు చెప్పబడినవి. ఒకటి యమ, రెండు నియమ, మూడు ఆసన, నాలుగు ప్రాణాయామ, ఐదు పత్యాహారం. మనసును శుద్ధిచేయడం కోసం మూడు చెప్పబడినవి. ఈ ఎనిమిదింటిలో సమాధి స్థితికి చేరుకోవడం యోగాకు పరాకాష్ట దశగా చెబుతారు.

పనిచేయని అవయవాల్లో మార్పు..

మానవ శరీరంలో వివిధ చోట్ల ఉండే స్వాధీష్టాన (ఎడ్రినల్‌ గ్లాండ్‌), మణిపూరక (ప్యాక్రియాన్‌ గ్లాండ్‌), విశుద్ధ (థైరాయిడ్‌ గ్లాండ్‌), ఆజ్ఞ (పిట్యుటరీ గ్లాండ్‌), సహస్త్రార (పీనియల్‌ గ్లాండ్‌) వంటి గ్రంథులు సక్రమంగా పనిచేయకుంటే అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. తద్వారా జీవితం నరకప్రాయంగా మారుతుంది. వీటిని యోగా సాధనలోని వివిధ పద్ధతుల ద్వారా సక్రమంగా పనిచేయించుకోవచ్చు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు సైతం ఈ మార్గాన్నే సూచిస్తున్నారు. యోగాతో మానసిక ఒత్తిడి, అతి బరువు, దీర్ఘకాలిక రుగ్మతలు తొలుగుతాయి.

ఎనిమిది అంగాలు..

యమ అంటే : మన గురించి మనం తెలుసుకోవడం.
నియమ : ఏది ధర్మమో తెలుసుకుని ధర్మ పద్ధతిలో జీవించడం.
ఆసన : శరీరాన్ని గంటల కొద్ది కదలకుండా నిశ్చల స్థితిలో ఉంచే ప్రక్రియనే ఆసనాలు అంటారు.
ప్రాణాయామ : నియమబద్ధంగా ప్రాణవాయువును తీసుకుంటూ శరీరంలో ఉన్న 72వేల నాడులను శుద్ధి చేసుకునే పద్ధతి.
పత్యాహార : ఇంద్రియాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం.
ధారణ : మనసులో ఏదైనా ఒక రూపాన్ని ఏర్పరుచుకోవడం.
ధ్యానం : ఆ ఊహాచిత్రంపై మనసును లగ్నం చేసుకుంటూ కొనసాగించే ధ్యానం.

అమృతాహారం .. ఉపయోగాలు

క్యారట్‌ : ఇది 13 రకాల వ్యాధులను నియంత్రిస్తుంది.
బీట్‌రూట్‌ : రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
యాపిల్‌ : గుండెను సక్రమంగా పనిచేయిస్తుంది.  
దానిమ్మ : ఇది లివర్‌కు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
మామిడి : చిక్కుడు : కిడ్నీని బలోపేతం చేస్తుంది.
బొప్పాయి : ఇది కడుపులో ఉన్న దోషాలను తొలగిస్తుంది.
జామ : మెదడును సక్రమంగా పనిచేయిస్తుంది. పరిమితంగా ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
నేరేడు : మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. మధుమేహం, బీపీని అదుపులో ఉంచుతుంది.
రేగి , ఉసిరి : సీ విటమిన్‌ పుష్కలంగా ఉండి రక్తశుద్ధి చేస్తాయి.
ఆకుకూరలు : యథారూపంలో తింటే నాడీ వ్యవస్థను చైతన్య పరుస్తాయి.
తీగకు కాచే కాయలు : వీటిని ఉప్పు ద్రావణంలో కాసేపు నానబెట్టి మంచినీటిలో కడిగి పచ్చిగానే తింటే సత్వగుణం వస్తుంది. తమో, రజో గుణాల తీవ్రత తగ్గి, శరీర ఆరోగ్యంతో పాటు మనసులో ఉన్న కోపం, ఉద్రేకాలు, భయం, పిరికితనం తగ్గుతాయి.  


దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి...
- పోశాల శ్రీనివాస్‌, యోగా గురువు, హనుమకొండ

యోగా గురువుగా నేను గత 23 సంవత్సరాలుగా పని చేస్తున్నాను.  ప్రస్తుతం తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని కాకతీయ హరిత హోటల్‌లో రెండు సంవత్సరాలుగా యోగా తరగతులను నిర్వహిస్తున్నాను. కరోనా లాం టి పరిస్థితుల్లో వేలాది మందికి ప్రాణాయామం నేర్పించి ఎంతో మంది ఆరోగ్యవంతులుగా ఉండడంలో ప్రధాన భూమికను పోషించాను.  కరోనా సమయంలో 2వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చాను. రోజుకు 600 మందికి ఉచితంగా భోజనం అందచేశాను.  యోగాలో భాగమైన ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు చాలా బలంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బస్రిక ప్రాణాయామ, కపాలభాతి, భ్రమరి ప్రకియల వల్ల ఊపిరితిత్తులు పనిచేసే శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, థైరాయిడ్‌ వంటివి దూరం అవుతాయి. ఒక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే కాకుండా పాఠశాలలు, కళాశాలల్లో ప్రతీ రోజు యోగా తరగతులను నిర్వహించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి.


మానసిక ప్రశాంతత చేకూరుతుంది...
- రాజయోగిని బ్రహ్మకుమారి విమల, యోగా గురు, హనుమకొండ

భారతదేశం ప్రాచీన రాజయోగానికి ప్రసిద్ధం. ప్రధాన మంత్రి మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేశారు. యోగా, యోగం-ఈ రెండింట్లో యోగా శరీరానికి, యోగం మనసుకు సంబంధించి చేసేది. ఈ కంప్యూటర్‌ యుగంలో శరీరకదలికలు తగ్గిపోయాయి. అన్ని అవయవాల కదలికకు యోగా అవసరం. ప్రస్తుత కాలంలో అనేక ఒత్తిళ్లవల్ల మానసిక అలజడి పెరుగుతోంది. మానసిక ఒత్తిడి వల్ల మనసు బలహీనమవుతుంది. అది శరీరంపై పడుతుంది. దీని నివారణకు యోగా ఒక్కటే మార్గం.   గత 43 సంవత్సరాలుగా యోగ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాను.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.