అలా అయితే పాప ఎదుగుదలకు ఇబ్బందా..?

ABN , First Publish Date - 2020-07-14T20:40:01+05:30 IST

పాపకు మూడేళ్లు. బరువు పది కేజీలు మాత్రమే ఉంది. అన్నం సరిగా తినదు. అయినా చలాకీగానే ఉంటుంది. పాప ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందా?

అలా అయితే పాప ఎదుగుదలకు ఇబ్బందా..?

ఆంధ్రజ్యోతి(14-07-2020)

ప్రశ్న: పాపకు మూడేళ్లు. బరువు పది కేజీలు మాత్రమే ఉంది. అన్నం సరిగా తినదు. అయినా చలాకీగానే ఉంటుంది. పాప ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందా?


- సయీద్‌, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: మీ పాప వయసు పిల్లలు 88 - 102 సెంటీమీటర్ల ఎత్తు, 12 -15 కేజీల బరువు ఉండాలి. కాబట్టి మీ పాప రెండు కేజీల బరువు తక్కువగా ఉందని తెలుస్తోంది. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అత్యవసరం. అన్నం సరిగా తినదు, పండ్లూ  తీసుకోదు కాబట్టి ఆమెకు పోషకాహార లోపం ఉండే అవకాశం ఉంది. బాదం, జీడిపప్పు, పుచ్చ గింజల్ని పొడి చేసి చపాతీ, పరాఠాల పిండిలో కలిపి చేసి తినిపించండి. అన్నం బదులుగా అవి పెట్టవచ్చు. పాలల్లో శక్తినిచ్చే పొడులు కలపవచ్చు. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు కూడా పెట్టండి.  భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు లాంటివి  పెట్టకూడదు. బయటి కేకులు, చిప్స్‌, చాక్‌లెట్లు, బిస్కెట్లు లాంటి చిరు తిళ్ళు  మాన్పించాలి. ఇంట్లో తయారు చేసిన నువ్వుల బెల్లం ఉండలు, మినప సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వండి. కూరతో అన్నం ఇష్టపడకపోతే పెరుగు అన్నం తినిపించండి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి, గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌ లాగ ఇవ్వవచ్చు. ఇన్ని ప్రయత్నాలు చేసినా పాపకు నాలుగేళ్లు వచ్చిన తరువాత కూడా సమస్య ఉంటే  పిల్లల వైద్యుల సలహా తీసుకోవాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2020-07-14T20:40:01+05:30 IST