నెయ్యితో ఆరోగ్యమస్తు

ABN , First Publish Date - 2021-09-30T05:30:00+05:30 IST

భారతీయ వంటకాలు, భోజనాల్లో నెయ్యిది ప్రత్యేక స్థానం. పాలు, పాల

నెయ్యితో ఆరోగ్యమస్తు

భారతీయ వంటకాలు, భోజనాల్లో నెయ్యిది ప్రత్యేక స్థానం. పాలు, పాల పదార్థాల నుంచి తీసే నెయ్యిలో స్వచ్ఛమైన కొవ్వు ఉంటుంది. అంతేకాదు... ఇందులో విటమిన్‌ ఎ, ఇ, కె2, డితో పాటు క్యాల్షియం, సీఎల్‌ఏ, ఒమేగా-3 వంటి మినరల్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలం. రోజూ ఓ క్రమ పద్ధతిలో నెయ్యి వాడితే వెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చంటున్నారు న్యూట్రిషనిస్టులు. 


ఇవీ ప్రయోజనాలు: 


 గ్లాసు పాలలో చెంచాడు నెయ్యి, చిటికెడు పసుపు, నల్ల మిరియాల పొడి వేసుకొని తాగితే జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్దకాన్ని నివారించి శరీరానికి అవసరమైన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. 


 పసుపు, మిరియాల పొడితో నెయ్యిని జోడిస్తే కడుపులో మంటను తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేసి సుఖమైన నిద్రనిస్తుంది. 


 నెయ్యికి ఉన్న ఆయుర్వేద ప్రయోజనాల్లో ముఖ్యమైనది జీవక్రియ (మెటబాలిజమ్‌)ను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. మానసికోల్లాసాన్ని, శక్తిని ఇస్తుంది. బరువు తగ్గడంలో సహకరిస్తుంది. 


 ఇందులో బ్యుటిరిక్‌ యాసిడ్‌ అత్యధిక మోతాదులో ఉంటుంది. ఇది గట్‌లోని బ్యాక్టీరియాకు ప్రొబయాటిక్‌గా ఉపయోగపడుతుంది. 


 నెయ్యిలోని విటమిన్‌ కె2 ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి దోహడపడుతుంది. తద్వారా జాయింట్‌ పెయిన్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. 


 దీన్లోని సీఎల్‌ఏ ట్యూమర్స్‌, కొవ్వును తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. 


ఇది గుర్తుపెట్టుకోండి

కూరలు, పప్పు తదితర వంటకాలు నెయ్యితో వండడంవల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అయితే మధుమేహం, అధికబరువు, అధిక కొవ్వు, పీసీఓఎస్‌, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి నెయ్యి వాడకూడదు. అలాంటివారు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.


Updated Date - 2021-09-30T05:30:00+05:30 IST