ధూమపానంతో హృద్రోగాలు

ABN , First Publish Date - 2022-05-29T09:09:03+05:30 IST

ధూమపానంతో హృద్రోగాలు

ధూమపానంతో హృద్రోగాలు

కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌పై బెజవాడలో నేడు సమ్మిట్‌

రమేశ్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ రమేశ్‌బాబు

విజయవాడ, మే 28 (ఆంధ్రజ్యోతి): పొగ తాగేవారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారని విజయవాడలోని డాక్టర్‌ రమేశ్‌ కార్డియాక్‌ అండ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ (రమేశ్‌ హాస్పిటల్స్‌) ఎండీ డాక్టర్‌ పోతిన రమేశ్‌బాబు తెలిపారు. రమేశ్‌ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన 1996 నుంచి ఇప్పటి వరకు 50 వేల గుండె ఆపరేషన్లు, యాంజియోప్లాస్టీలను విజయవంతంగా నిర్వహించి మరో మైలురాయిని అధిగమించిన సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచి, పద్మశ్రీ అవార్డులు అందుకున్న గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ దాసరి ప్రసాదరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన లేక 30 నుంచి 50 ఏళ్ల వయసువారు ఎక్కువగా చనిపోతున్నారన్నారు. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్‌ సమస్యలున్నవారు అదుపులో ఉంచుకుంటూ ప్రతిరోజూ తగిన వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు గుండె జబ్బులను నివారించవచ్చని చెప్పారు.  గుండె జబ్బుల చికిత్సపై వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్యులకు ఆదివారం విజయవాడలో కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ)పై సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.  సదస్సును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభిస్తారని, వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2000 మంది కార్డియాలజిస్టులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని వివరించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ సోమరాజు, దాసరి ప్రసాదరావు, డాక్టర్‌ ప్రసాద్‌లాల్‌ను  సన్మానించనున్నట్టు డాక్టర్‌ రమేశ్‌బాబు తెలిపారు.

Updated Date - 2022-05-29T09:09:03+05:30 IST