భర్త, కూతురి ప్రాణాలను స్వయంగా తీసేయాల్సి వస్తే.. గుండెను పిండేసే ఓ మహిళ కథ ఇది..!

ABN , First Publish Date - 2022-06-30T20:05:40+05:30 IST

కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కూతురి ప్రాణాలను ఓ స్త్రీ స్వయంగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వాళ్లు తన కళ్ల ముందు కనిపించరు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో బాధను పంటిబిగువున భరించి వారిద్దరినీ దూరం చేసుకోవాల్సి వచ్చింది

భర్త, కూతురి ప్రాణాలను స్వయంగా తీసేయాల్సి వస్తే.. గుండెను పిండేసే ఓ మహిళ కథ ఇది..!

కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కూతురి ప్రాణాలను ఓ స్త్రీ స్వయంగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వాళ్లు తన కళ్ల ముందు కనిపించరు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో బాధను పంటిబిగువున భరించి వారిద్దరినీ దూరం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లు లేకున్నా.. వారి అవయవాలు అయినా పది మందికి పనికొస్తే చాలని ఓ మంచి నిర్ణయం కూడా తీసుకుంది. యూకేకు చెందిన ఆ మహిళ.. తన జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాలను ఓ టీవీ షోలో ప్రస్తావించడంతో అది కాస్తా సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది.


కరోలిన్ అనే ఆమెకు భర్త పాల్, ఏడేళ్ల కూతురు నటాషా, రెండేళ్ల వయసున్న కొడుకు ఉన్నారు. 2007వ సంవత్సరంలో వాళ్ళ ఇంటి గ్యారేజీలో జరిగిన ప్రమాదంలో ఏడేళ్ళ నటాషా గాయపడింది. గ్యారేజీలో నటాషా ఓ మినీ మోటర్ బైక్ పైన ఆడుకుంటోంది. అదే సమయంలో తండ్రి పాల్ హెల్మెట్ తీసుకువచ్చేందుకు ఇంట్లోకి వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు ఎలా జరిగిందో ఏమో కానీ పక్కనే ఉన్న అల్మారాకు నటాషా తల ఢీకొని గాయాలయ్యాయి. 


మొదట నటాషాకి ఏం కాలేదనుకున్నారు. చిన్న దెబ్బే కదా అని త్వరగా కోలుకుంటుందిలే అనుకున్నారు. నటాషా కూడా రక్తం కారుతున్న పరిస్థితుల్లో ఉండి కూడా ‘‘ఐ యాం ఓకే డాడీ’’ అంది. కానీ ఆమె పరిస్థితి రెండోరోజుకు క్షీణించింది. ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సర్జన్ నటాషా పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులైన పాల్, కలోలిన్ లకు గుండె పగిలినంత పనయింది. వైద్యులు టెస్టులు అన్నీ చేసి నటాషా లైఫ్ సపోర్ట్ మెషీన్‌ను తీసివేయాల్సిన అవసరం ఉందని తేల్చడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. సరిగ్గా ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత నటాషా లైఫ్ సపోర్ట్‌ను కరోలిన్ తీసేయాల్సి వచ్చింది. అలా కూతురు నటాషా ఆసుపత్రిలోనే మరణించింది. అయితే ఆమె జీవితం ఈ ఒక్క విషాద ఘటనతోనే ఆగిపోలేదు. 


‘కూతురి మరణం తర్వాత నా భర్త పాల్ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. తను సరైన సమయానికి హెల్మెట్ తెచ్చి ఉంటే నటాషాకు ఇంత దారుణం జరిగేది కాదనే అపరాధ భావంతో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. పదే పదే ఏడుస్తూ ఉండేవాడు. మనసులోనే మూగగా బాధపడేవాడు. అదే ఆలోచనతో రోజూ సరిగా నిద్రపోయేవాడు కూడా కాదు. గంటల తరబడి ఆ గ్యారేజీలో కూర్చుని ఆలోచించేవాడు. ఆందోళన, నిద్రలేమి సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 22 సార్లు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. 2016లో పాల్ కు గుండెపోటు వచ్చింది. ఛాతీ నొప్పిగా ఉందంటూ నా కళ్ల ముందే కుర్చీలోంచి కిందకు పడిపోయాడు. పాల్‌ను పది రోజులపాటు లైఫ్ సపోర్ట్ మెషీన్‌లో ఉంచారు. నేను ఏదయితో జరగకూడదు అని కోరుకున్నానో.. అదే జరిగింది. మళ్లీ నా జీవితంలో అలాంటి చేదు అనుభవమే పునరావృతం అయింది. లైఫ్ సపోర్ట్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి రావటంతో నేను మరోసారి నరకం అనుభవించాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో నా భర్తను నేనే ఈ లోకం నుంచి సాగనంపాల్సి వచ్చింది..’ అంటూ కరోలిన్ తన బాధను పంచుకుంది. అయితే వారిద్దరి విషయంలోనూ కరోలిన్ ఓ మంచి పని చేసింది. అవయవ దానం చేసి వారు ఈ లోకంలో లేకున్నా.. వారి వల్ల ఇంకొందరు ప్రాణాలతో బతికి ఉన్నారన్న భావిస్తూ.. కాస్తో కూస్తో సంతోషాన్ని ఆమె మిగుల్చుకోగలిగింది. తనకు ఈ లోకంలో మిగిలిన ఏకైక బంధమైన కుమారుడే లోకంగా కరోలిన్ బతుకుతోంది.

Updated Date - 2022-06-30T20:05:40+05:30 IST