గుండెల్లో తుఫాన

ABN , First Publish Date - 2021-12-03T04:43:46+05:30 IST

జవాద్‌ తుఫాన రైతుల్లో అలజడి రేపుతోంది. వరి పంటకు కీలకమైన సమయం కావడంతో వారంతా టెన్షన పడుతున్నారు. పంటను కాపాడుకునే పనిలో పడ్డారు. కోతలు పూర్తయిన చోట్ల పంటను పొలాల్లో కుప్పలుగా వేస్తున్నారు. నూర్పులు పూర్తయిన ప్రాంతాల్లో టార్పాలిన్లు కప్పి భద్రపరుస్తున్నారు.

గుండెల్లో తుఫాన
వరి చేలను కుప్పలుగా వేసిన రైతులు

వాతావరణ హెచ్చరికలతో రైతుల్లో కలవరం

కుప్పలుగా వరి చేలు

 ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నం

రెండు రోజులు పాఠశాలలకు సెలవు 

మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు

 సహాయక చర్యలపై అధికారుల సమీక్షలు

పర్యవేక్షణ అధికారిగా కాంతిలాల్‌దండే నియామకం


 జవాద్‌ తుఫాన రైతుల్లో అలజడి రేపుతోంది. వరి పంటకు కీలకమైన సమయం కావడంతో వారంతా టెన్షన పడుతున్నారు. పంటను కాపాడుకునే పనిలో పడ్డారు. కోతలు పూర్తయిన చోట్ల పంటను పొలాల్లో కుప్పలుగా వేస్తున్నారు. నూర్పులు పూర్తయిన ప్రాంతాల్లో టార్పాలిన్లు కప్పి భద్రపరుస్తున్నారు. ఇటు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అందరినీ అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ సూర్యకుమారి తీరంలో పర్యటించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా చర్యలపై నిర్దేశించారు. అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌/ శృంగవరపుకోట/ గజపతినగరం,  డిసెంబరు 2:

తుఫాన ముప్పు పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రైతులు భయం భయంగా గడుపుతున్నారు. ఈ నెల 3 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతుండడంతో రైతులు  అప్రమత్తమయ్యారు. పంటను రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి కోతలు చేపడితే వర్షానికి ధాన్యం తడిసి పాడయ్యే ప్రమాదం ఉంది. కోయకపోతే గింజ కింద రాలిపడే అవకాశం ఉంది. దీంతో కోతలు పూర్తికాని చోట్ల పంటను ఎలా కాపాడుకోవాలోనని రైతులు మధన పడుతున్నారు. వారికి కంటిమీద కునుకు కరువైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనే తుఫాన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి. మెరకముడిదాం మండలాల్లో అధిక ప్రభావం ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయంటున్నారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 

 తుఫానపై వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం చేరవేస్తోంది. రక్షణ చర్యలపై సూచనలు ఇస్తోంది. ముఖ్యంగా పార్వతీపురం డివిజనలో పంట చేతికి అందడంతో అధికంగా కోతలు పూర్తిచేశారు. పంటను కుప్పలుగా వేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం డివిజన్లోనూ పంటను భద్రపరిచే చర్యలు చేపట్టారు. 

 సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇళ్లకు చేరుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశించారు. ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు. తుఫాన ప్రభావం, గమనాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాలను ఖాళీ చేయాల్సి  రావచ్చునని, ఇళ్ల వద్దనే మత్స్యకారులు వేచి ఉండాలని కలెక్టర్‌ సూచించారు. 

 తుఫాన ప్రభావంతో నదులు, వాగులు పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జలాశయాల వద్ద ఉంటున్న సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవల కడప జిల్లాలో పెను ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని నీటి పారుదల శాఖ అధికారులు వివరిస్తున్నారు. జలాశయాల వద్ద పరిస్థితిని బట్టి వెంటవెంటనే రెగ్యులేటర్‌ గేట్ల ద్వారా నదుల్లోకి నీటిని విడిచి పెట్టాలని సూచించారు. 

పాఠశాలలకు రెండు రోజులు సెలవు

జవాద్‌ తుఫాన కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో పాఠశాలలు తెరవవద్దని చెప్పారు.  ఎవరూ బయటకు వెళ్లకుండా పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు.

ప్రత్యేక బృందాలు రాక

తుఫాన్‌ రక్షణ చర్యల కోసం రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 16 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఒక మెరైన్‌ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాలి వేగం 50 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని కలెక్టర్‌ సూచించారు. కోస్తా ప్రాంతాల్లో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో 8 బృందాలను ప్రత్యేకంగా నియమించారు. 3 పోల్‌ డ్రిల్లింగ్‌ పరికరాలు, 420 ట్రాన్స్‌ ఫార్మర్లు, 5వేల విద్యుత్‌ స్తంభాలను సిద్ధం చేశారు. రహదారుల మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బి నుంచి 54  బృందాలు, 60 టిప్పర్లను, 30 పవర్‌సాలను, 26 జేసీబీలను, 479 మంది కార్మికులను, 1572 ఇసుక సంచులను సిద్ధంగా ఉంచారు. నీటి సరఫరాకు ఇబ్బందిలేకుండా 60 డీజిల్‌ జనరేటర్లు, 25 వాటర్‌ట్యాంక్‌లను కూడా ప్రత్యేకంగా సమకూర్చారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల కోసం 18 మంది మెరైన్‌ పోలీస్‌ సిబ్బందిని కేటాయించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్లి తుఫాన్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్‌ సహాయక చర్యల పర్యవేక్షణకు జిల్లాకు కాంతిలాల్‌దండేను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం జిల్లాలోనే ఉన్నారు. 

 వ్యవసాయ శాఖ సలహాలిలా..

 వరి కోతలు వాయిదా వేసుకోవాలి

 కోసిన పంటను సురక్షిత ప్రదేశాల్లో కుప్పలుగా వేయాలి. వాటిపై టార్పాలిన్లు వేయాలి

 పంట పొలాల్లో నీరు నిలవకుండా చూడాలి

 చెరకుతోట పడిపోకుండా జడ చుట్లు వేసుకోవాలి

 పురుగుల మందు పిచికారీని వాయిదా వేసుకోవాలి

 అపరాల విత్తనాలు వేయడం వాయిదా వేసుకోవాలి

 కూరగాయలకు ఎరువులు, పురుగుల మందులను చల్లడం వాయిదా వేయాలి.

 అరటి, బొప్పాయి పంట పక్వానికి వస్తే వెంటనే కోసేయాలి. తుఫాన గాలి తాకిడికి పడిపోకుండా వెదురు కర్రలను ఊతమియ్యాలి. 

 పశువులు, కోళ్లను సురక్షత ప్రాంతాలకు తరలించాలి


Updated Date - 2021-12-03T04:43:46+05:30 IST