తల్లడిల్లిన హృదయాలు

ABN , First Publish Date - 2022-06-29T05:49:24+05:30 IST

రోజూ మాట్లాడే కొడుకు, పది రోజులుగా మూగబోయాడు. మాటా లేదు; మనిషి లేడు.. చివరి చూపు కోసం ఆ తల్లిదండ్రులు పది రోజులుగా కళ్లు కాయలు

తల్లడిల్లిన హృదయాలు
నివాళులర్పిస్తున్న ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

 ఈ నెల 19న అమెరికాలో దారుణ హత్యకు గురైన నల్లగొండకు చెందిన సాయిచరణ్‌ 

 అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

నల్లగొండ, జూన్‌ 28 : రోజూ మాట్లాడే కొడుకు, పది రోజులుగా మూగబోయాడు. మాటా లేదు; మనిషి లేడు.. చివరి చూపు కోసం ఆ తల్లిదండ్రులు పది రోజులుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం నిర్జీవంగా వచ్చిన కొడుకును చూసి వారి హృదయాలు తల్లడిల్లాయి. ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ బోరున ఏడవటంతో అక్కడున్న వారి అందరి కళ్లు చెమర్చాయి. 

అశ్రునయనాల నడుమ నక్కా సాయిచరణ్‌ అంత్యక్రియలు మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. అమెరికాలో ఈ నెల 19వ తేదీన హత్యకు గురైన నక్కా సాయిచరణ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. సాయిచరణ్‌ హత్యకు గురైన 10 రోజులకు ఆయన మృతదేహం మంగళవారం ఉదయం ఏడు గంటలకు నల్లగొండకు చేరుకుంది. పట్టణంలోని వివేకానందనగర్‌ కాలనీలోని ఆయన స్వగృహంలో రెండు గంటల పాటు మృతదేహాన్ని ఉంచారు. బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిదులు పెద్దఎత్తున తరలివచ్చి సాయిచరణ్‌ మృతదేహంపై పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సాయిచరణ్‌ మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 10 రోజులుగా వారు సాయిచరణ్‌ మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. సాయిచరణ్‌ మృతదేహాన్ని చూడగానే గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. అమెరికా నుంచి నేరుగా విమానం లేకపోవడంతో వివిధ దేశాల మీదుగా రావడంతో సాయిచరణ్‌ మృతదేహం నల్లగొండకు చేరుకోవడానికి ఆలస్యమైంది. మంగళవారం తెల్లవారుజామున సాయికుమార్‌ మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక అంబులెన్స్‌లో ఉదయం ఏడు గంటలకు నల్లగొండకు చేరవేశారు. సాయిచరణ్‌ కుటుంబాన్ని మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సాయిచరణ్‌ పాడెను మోశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగిగా స్థిరపడ్డ సాయిచరణ్‌ హత్యకు గురికావడం బాధాకరమని అన్నారు. సాయిచరణ్‌ మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంత్యక్రియల్లో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, గుమ్ముల మోహన్‌రెడ్డి, పున్న కైలాష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌, వార్డు కౌన్సిలర్‌ బండారు ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, సత్యనారాయణ, వెంకటేశం, కర్నాటి యాదగిరి, శరబయ్య, వెంకటేశం, చంద్రశేఖర్‌, సైదులు, వంగూరి లక్ష్మయ్య, శ్రావణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, బొజ్జ నాగరాజు ఉన్నారు. 



Updated Date - 2022-06-29T05:49:24+05:30 IST