విమానాశ్రయంలో కుప్పలు తెప్పలుగా బ్యాగేజీలు.. విమాన సర్వీసులు రద్దు చేయాలని వినతి!

ABN , First Publish Date - 2022-06-20T23:23:08+05:30 IST

కొండలా పేరుకుపోతున్న బ్యాగేజీలతో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

విమానాశ్రయంలో కుప్పలు తెప్పలుగా బ్యాగేజీలు.. విమాన సర్వీసులు రద్దు చేయాలని వినతి!

లండన్: కొండలా పేరుకుపోతున్న బ్యాగేజీలతో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేలాది బ్యాగులతో కిక్కిరిసిపోయిన విమానాశ్రయ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ముంచెత్తుత్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ఇబ్బందిగా మారడంతో మారో మార్గం లేక టెర్మినల్ 2, 3 నుంచి విమానాలు నడిపే సంస్థలు తమ సర్వీసుల్లో 10 శాతం విమానాలను రద్దు చేసుకోవాలని విమానయాన సంస్థలను కోరింది. ఫలితంగా 15 వేల మంది ప్రయాణికులు, 90 విమానాలపై ఆ ప్రభావం పడనుంది. 


విమానాశ్రయం విజ్ఞప్తితో స్పందించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ టెర్మినల్ 3, 5 నుంచి నడిపే సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేసింది. క్షమాపణలు చెప్పేందుకు, వినియోగదారుల హక్కుల గురించి వారికి సలహా ఇవ్వడంతోపాటు రీఫండ్ లేదంటే రీబుకింగ్ సహా ప్రత్యామ్నాయ మార్గాల కోసం రద్దు చేసిన విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల్లో ప్రయాణికులకు సంబంధించిన వేలాది బ్యాగులు టెర్మినల్ 2లో పేరుకుపోయాయి. సిస్టంలో లోపం కారణంగా ఎక్కడివక్కడే ఉండిపోయాయి. వాటి వద్ద విమానాశ్రయ సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. తమ బ్యాగుల కోసం ప్రయాణికుల్లో కొందరు గంటల తరబడి వేచి చూస్తుండగా మరికొందరు బ్యాగులు తీసుకోకుండానే విమానాశ్రయాన్ని వీడారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హీత్రూ విమనాశ్రయం క్షమాపణలు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ విమానాలను రద్దు చేసుకోవాలని కోరింది. కాగా, రద్దైన విమానాల్లో అహ్మదాబాద్ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఉందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.



Updated Date - 2022-06-20T23:23:08+05:30 IST