భారీగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Jun 16 2021 @ 12:24PM

గాంధీ, కోఠి ఈఎన్‌టీ, సరోజనీదేవి 

కంటి ఆస్పత్రుల్లో వందలాది సర్జరీలు 

ప్రస్తుతం చికిత్స పొందుతున్న 568 మంది

ముక్కు, దవడ, కంటి ఇన్ఫెక్షన్‌ బాధితులే ఎక్కువ 

గత రెండువారాల్లోనే ‘గాంధీ’లో 63 శస్త్రచికిత్సలు 


హైదరాబాద్‌సిటీ/అడ్డగుట్ట: హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల తాకిడి ఇంకా తగ్గడం లేదు. వీరిలో దాదాపు సగం మందికి సర్జరీలు చేయాల్సి వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో 400 మంది, కోఠి ఈఎన్‌టీలో 550 మంది, సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో 110 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చికిత్స పొందారు. ప్రస్తుతం ఈ మూడు ఆస్పత్రుల్లో కలిపి 565 బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్స కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ 200 నుంచి 300 మంది చికిత్స పొందారు. గాంధీలో కొవిడ్‌-19 వచ్చి బ్లాక్‌ఫంగ్‌సతో బాధపడుతున్న వారినే చేర్చుకుంటున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న వృద్ధులకు వెంటనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు నేతృత్వంలో ఈఎన్‌టీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శోభన్‌బాబు పర్యవేక్షణలో ఈఎన్‌టీ, అనస్తీషియా వైద్యులు సర్జరీలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం మీద 400 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చేరగా, 250 మందికి సర్జరీలు నిర్వహించారు. ఒక్క జూన్‌ నెలలోనే 63 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. ఎక్కువ శాతం మందికి దవడ, కంటికి సంబంధించిన సర్జరీలు జరిగాయి. చాలా తక్కువ మందికి మాత్రమే మెదడుకు సంబంధించి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 309 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. 


కోఠి ఈఎన్‌టీలో..

కోఠిలోని ఈఎన్‌టీఆస్పత్రికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు క్యూ కడుతున్నారు. కొన్నిసార్లు ఇక్కడ పడకలు కూడా సరిపోవడం లేదు. దీంతో ఈ ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న జీహెచ్‌ఎంసీ కాంప్లెక్స్‌లో మరో 60 పడకలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో 550 మందికిపైగా  రోగులు చికిత్స పొందినట్లు సమాచారం. అందులో 300 ఈఎన్‌టీ   సర్జరీలు ఉండటం గమనార్హం.  అధిక శాతం ముక్కు, దవడకు సంబంధించిన సర్జరీలే ఉన్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్న కొందరి దవడ భాగాలను పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈఎన్‌టీ ఆస్పత్రిలో ప్రస్తుతం దాదాపు 189 మంది చికిత్స పొందుతున్నారు. 


సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో.. 

బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో కంటికి ఇన్ఫెక్షన్‌ సోకిన దాదాపు 110 మంది సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇందులో 20 నుంచి 25 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో దాదాపు 13మందికి ఒక కన్నును తొలగించాల్సి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 70మంది చికిత్స పొందుతున్నారు. ఈఎన్‌టీతోపాటు కంటి ఇబ్బందులున్న వారిని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేర్పించి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అనంతరం వారిని సరోజనీదేవి కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అం దించారు. చాలామంది బ్లాక్‌ ఫంగ్‌సను గుర్తించకపోవడంలో కంటి వరకు వచ్చి ఫంగస్‌ వ్యాప్తిచెందిందని వైద్యులు పేర్కొన్నారు. 

Follow Us on: