భారీగా పంట నష్టం

ABN , First Publish Date - 2021-10-30T05:13:52+05:30 IST

ఖరీఫ్‌లో ఆగస్టు నుంచి అక్టోబరు నెలాఖరు దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

భారీగా పంట నష్టం

  1. 36 మండలాల్లో కరువు ప్రభావం 
  2. మూడు లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
  3. ప్రభుత్వానికి నివేదిక: జేడీఏ వరలక్ష్మి


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 29: ఖరీఫ్‌లో ఆగస్టు నుంచి అక్టోబరు నెలాఖరు దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన మండలాల్లో సర్వే నిర్వహించామని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. దాదాపు మూడు లక్షల హెక్టార్లలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు నష్టం జరిగిందని వెల్లడించారు. వర్షాభావం కారణంగా దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. జరిగిన నష్టంపై నివేదికను తయారు చేశారు. పంట స్థితిగతులు, పంట కోత ప్రయోగాలు, భూగర్భ జలాల పరిస్థితులను పరిశీలించిన అనంతరం 36 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించారు. 


ప్రభుత్వానికి నివేదిక


జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 6.38 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది రూ.6.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారని జేడీఏ నివేదికలో పేర్కొన్నారు. పత్తి 2.55 లక్షల హెక్టార్లు, వేరుశనగ 88,143 హెక్టార్లు, వరి 79,243 హెక్టార్లు, మొక్కజొన్న 55,543 హెక్టార్లు, కంది 59,564 హెక్టార్లు, మిరప 23,169 హెక్టార్లు, ఉల్లి 15,229 హెక్టార్లలో సాగు అయినట్లు పేర్కొన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటలు 2,23,424 హెక్టార్లలో సాగు చేసినట్లు జేడీఏ వెల్లడించారు. 


జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు దాకా సాధారణ వర్షపాతం 455.1 మి.మీ. కాగా, 439.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఆగస్టులో 43, సెప్టెంబరు 44 శాతం లోటు వర్షపాతం నమోదైందని నివేదికలో పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట కోతకు వచ్చే సమయంలో.. అంటే అక్టోబరులో వర్షం పూర్తిగా రాలేదని, అక్టోబరు నెల సగటు వర్షపాతం 125 మి.మీ. కాగా, కేవలం 57 మి.మీ. వర్షపాతం నమోదైందని జేడీఏ తెలిపారు. 


ఆలూరు, ఆస్పరి, బేతంచెర్ల, దేవనకొండ, డోన్‌, హాలహర్వి, జూపాడుబంగ్లా, గోనెగండ్ల, కోసిగి, కర్నూలు, మంత్రాలయం, కృష్ణగిరి, ఓర్వకల్లు, మిడ్తూరు, నందికొట్కూరు, పాణ్యం, తుగ్గలి, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, వెల్దుర్తి మండలాలలో పంటలను తీవ్రంగా నష్టపోయినట్లు గుర్తించామని తెలిపారు. 


గడివేముల, మద్దికెర, కొలిమిగుండ్ల, కౌతాళం మండలాలు మధ్యస్థంగా, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, మహానంది, కోవెలకుంట్ల, సంజామల, బనగానపల్లె, గోస్పాడు, దొర్నిపాడు, చాగలమర్రి, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ మండలాలలో పాక్షికంగా పంట నష్టం జరిగినట్లు గుర్తించామని జేడీఏ తెలిపారు. 


కల్లూరు మండల పరిధిలో జూన్‌లో 21 రోజులు, జూలైలో 21 రోజులు, ఆగస్టులో 21 రోజులు చినుకు జాడ పూర్తిగా లేదని, కర్నూలు రూరల్‌లో ఆగస్టులో 21 రోజులు, జూలైలో 28 రోజులు, జూన్‌లో 21 రోజులు వర్షాలు నమోదు కాలేదని నివేదికలో పేర్కొన్నారు. కొలిమిగుండ్ల మండలంలో జూన్‌లో 23, జూలైలో 30 రోజులు, ఆగస్టులో 24 రోజులు వర్షం కురవలేదని, దీని వల్ల పంటలు దెబ్బతిన్నాయని జేడీఏ తెలిపారు. నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపించామని ఆమె తెలిపారు.


ఉసురు తీసిన అప్పు


  1. చికిత్స పొందుతూ శిరివెళ్ల రైతు మృతి


శిరివెళ్ల, అక్టోబరు 29: ఆత్మహత్యకు యత్నించిన శిరివెళ్లలోని ఎస్సీ కాలనీకి చెందిన కందూరి చిన్న ఓబన్న(52) నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అప్పుల బాధతో ఈ నెల 27న చిన్న ఓబన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందించినా రైతు కోలుకోలేకపోయాడని ఎస్‌ఐ శరత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఓబన్నకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రైతు కుమారుడు కందూరి రాజేష్‌ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-30T05:13:52+05:30 IST