వర్షాలతో జిల్లాకు భారీ నష్టం

ABN , First Publish Date - 2021-11-30T06:48:00+05:30 IST

వర్షాలతో జిల్లాకు భారీగా నష్టం జరిగిందని సీఎం జగన్‌కు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలియజేశారు.

వర్షాలతో జిల్లాకు భారీ నష్టం

సీఎంకు వివరించిన కలెక్టర్‌


చిత్తూరు(సెంట్రల్‌), నవంబరు 29: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాకు భారీగా నష్టం జరిగిందని సీఎం జగన్‌కు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలియజేశారు. సోమవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ జిల్లాలోని వరద పరిస్థితులను వివరించారు. ‘పంటలకు, రోడ్లకు తీవ్రనష్టం వాటిల్లింది. నిరాశ్రయులైన వారిలో 34,682 మందికి నిత్యావసరాలతోపాటు రూ.2వేలను పంపిణీ చేశాం. 11 పునరావాస కేంద్రాల్లో రెండువేల మందికి ఆశ్రయం కల్పించగా, రాయలచెరువు ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితులు ఉండటంతో 1,300 మందికి మరో 15 రోజులపాటు కేంద్రాలను కొనసాగిస్తాం. 1,862 మంది గృహాలు దెబ్బతినగా, ఇందులో 237 మంది తమ ఇళ్లను పూర్తిగా నష్టపోయారు. వీరికి రూ.2.25 కోట్ల పరిహారంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చాం. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన 194 ఫిర్యాదులను పరిష్కరించగా, రోడ్ల పునఃనిర్మాణాలు డిసెంబరు 10లోపు పూర్తి చేస్తాం. ఆదివారం మూడు మండలాల్లో వంద మి.మీ, 9 మండలాల్లో 50 మి.మీలకు పైగా వర్షపాతం నమోదైంది. 7,600 చెరువులుండగా, 3700 పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరో 1,500 చెరువులు నిండిపోనున్నాయి. ఇప్పటి వరకు 60 చెరువులు దెబ్బతినగా, తాగునీటికి సంబంధించిన 206 పనులకుగాను 201 పనులు పూర్తిచేశాం. ఆర్‌అండ్‌బీకి చెందిన 60 నిర్మాణాలు నష్టపోగా 44 పనులు పూర్తి చేశాం. పంట నష్టం వివరాలు సేకరించి, రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురిస్తాం’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-30T06:48:00+05:30 IST