వైద్య ,ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పోస్టుల్లో భారీ అవకతవకలు

ABN , First Publish Date - 2020-08-08T10:09:29+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీలో పలు ..

వైద్య ,ఆరోగ్యశాఖ   కాంట్రాక్టు పోస్టుల్లో భారీ అవకతవకలు

జాబితాలో అనర్హులకు చోటు

డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట

 పేర్లులేని మెరిట్‌ అభ్యర్థుల  ఆందోళన

నేటి నుంచి జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా


ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 7: కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, రేడియోగ్రాఫర్లు, చైల్డ్‌ సైకాలజిస్టు, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌, ఆపరేషన్‌ ఽథియేటర్‌ అసిస్టెంట్‌, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయా పోస్టులను భర్తీ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రకటించాల్సి ఉంది.


అయితే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెరిట్‌ జాబితా తయారుచేయాల్సి ఉండగా ఆ బాధ్యతను డీఈఓకు అప్పగించారు. మెరిట్‌ జాబితా అనంతరం డీ ఎంహెచ్‌ఓ పద్మావతి శని, ఆదివారాల్లో ఒంగోలులో జరిగే సర్టిఫికెట్‌ పరిశీలనకు రావాలని ప్రకటించడంతో ఆ జాబితాలో పేర్లు లేని అభ్యర్థులు రోడ్డెక్కారు. మెరిట్‌ జాబితాలో 80శాతానికిపైగా మార్కులు వచ్చిన వారి పేర్లు లేకపోగా, అంతకంటే తక్కువ వచ్చిన  వారి పేర్లు  ఉండటంతో అభ్యర్థులు శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.అవకతవకలపై దళిత సంఘాల నాయకులు జేసీ-2 టీఎస్‌ చేతన్‌, డీఎంహెచ్‌ఓ పద్మావతి, డీఈఓ సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేశారు. 


సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా

మెరిట్‌ జాబితాలో పలు అవకతవకలు జరగడంతో శని, ఆదివారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదావేశారు. ఒకవైపు అభ్యర్థులు ఆందోళన, మరోవైపు నాయకులు కూడా ఫోన్‌ ద్వారా అధికారులను ప్రశ్నించడంతో పరిశీలనను వాయిదా వేసినట్లు తెలిసింది.


ఆన్‌లైన్‌ దరఖాస్తులు గల్లంతు

ఆన్‌లైన్‌లో అభ్యర్థుల దరఖాస్తులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. వైద్యారోగ్యశాఖ అధికారులు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ జాబితాను రూపొందించాల్సి ఉంది. అయితే జాబితా తయారీని జిల్లా విద్యాశాఖకు అప్పగించారు. ఆ శాఖ అధికారులు జాబితాను రూపొందించి డీఎంహెచ్‌ఓకు అప్పగించడంతో ఆమె ఆమోదించారు. ఆ జాబితాను పరిశీలించిన అభ్యర్థులు తమకు అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

Updated Date - 2020-08-08T10:09:29+05:30 IST