మణిపూర్‌లో భారీ పోలింగ్...

ABN , First Publish Date - 2022-03-06T02:02:34+05:30 IST

చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి..

మణిపూర్‌లో భారీ పోలింగ్...

ఇంఫాల్: చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి (రెండో) విడత పోలింగ్ శనివారం పూర్తయింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 76.04 పోలింగ్ శాతం నమోదైంది. చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌కు ముందు, ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోందని అధికారులు వివరించారు. ఛందేల్ జిల్లాలో 76.71 శాతం, జిరిబామ్‌లో 75.02 శాతం, తౌబల్‌లో 78 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.


కాగా, సేనాపతి జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వెలుపల జరిగిన కాల్పుల్లో  ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. కరాంగ్‌లో ఒక పోలీస్ స్టేషన్‌ నుంచి ఈవీఎం ఎత్తుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించడంతో పాటు సిబ్బందిపై దాడికి దిగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తౌబల్ జిల్లాలో శుక్రవారం రాత్రి కొందరు బీజేపీ కార్యకర్తలు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త కాల్పులు జరపడంలో గాయపడిన బీజేపీ కార్యకర్త ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు.

Updated Date - 2022-03-06T02:02:34+05:30 IST