భారీగా విద్యుత్‌ వినియోగం

ABN , First Publish Date - 2021-10-13T06:31:40+05:30 IST

కాలం మారిపోయింది. ఇంతకు ముందు వేసవికాలంలోనే ఎండలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు శీతాకాలంలో కూడా వేసవిని తలపించేలా ఉంటున్నాయి.

భారీగా విద్యుత్‌ వినియోగం

మండు వేసవిలో కంటే అధికంగా వాడకం

మారిన వాతావరణమే కారణం

సాధారణంగా నెలకు 700 మిలియన్‌ యూనిట్లు బిల్లింగ్‌

ఈ నెలలో 900 మిలియన్‌ యూనిట్ల వరకూ వెళ్లే అవకాశం

పరిశ్రమలకే అధిక శాతం సరఫరా జీవీఎంసీ పరిధిలో 300-330 మిలియన్‌ యూనిట్లు

సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకూ ఏసీలు వినియోగించవద్దంటున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కాలం మారిపోయింది. ఇంతకు ముందు వేసవికాలంలోనే ఎండలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు శీతాకాలంలో కూడా వేసవిని తలపించేలా ఉంటున్నాయి. దాంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. సాధారణంగా మే నెలలో అత్యధిక విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఈసారి అక్టోబరు నెలలో వేసవిని మించి నగరవాసులు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. బొగ్గు కొరత కారణంగా డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ సరఫరా లేని సమయంలో ఇలా వినియోగం పెరగడం అధికారులను కాసింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈపీడీసీఎల్‌ అధికారులు జిల్లా విద్యుత్‌ అవసరాలు, డిమాండ్‌, సరఫరాపై అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


భారీగా పెరుగుతున్న వినియోగం

జిల్లాలో రోజుకు సగటున 26 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. నెలకు 700 మి.యూ. వరకు బిల్లింగ్‌ జరుగుతోంది. అక్టోబరు నెలలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో వినియోగం భారీగా పెరగడంతో ఈసారి 900 మిలియన్‌ యూనిట్ల వరకు వెళుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పరిశ్రమలు వినియోగించేది అత్యధికం. ఈ నెలలో పరిశ్రమలు 470 మి.యూ. (55 శాతం) వరకు ఉపయోగించుకుంటాయని అంచనా. ఇకపోతే విశాఖ నగర ప్రజలు (జీవీఎంసీ పరిధి) వాడేది 300-330 మిలియన్‌ యూనిట్లు, జిల్లాలోని మండల కేంద్రాల్లో 80 మి.యూ, మిగిలింది గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగిస్తున్నారు. రూరల్‌ ప్రాంత వాసులు ఉపయోగించేది మొత్తం వినియోగంలో 10 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.


ప్రస్తుత కొరతను అధిగమించాలంటే...జీవీఎంసీ పరిధిలో వినియోగం 10 శాతం తగ్గించుకుంటే సరిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల లోపు ఇళ్లల్లో ఏసీలను వినియోగించకూడదని సూచిస్తున్నారు. ఆ తరువాత ఏసీలు వేసుకున్నా...రీడింగ్‌ 25 డిగ్రీలలో ఉంచుకోవాలని, చల్లదనం కోసం అంతకంటే తక్కువగా పెడితే...ప్రతి డిగ్రీకి అదనంగా ఐదు శాతం విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ విధంగా వినియోగదారులు సర్దుబాటు చేసుకొని సహకరిస్తే..విద్యుత్‌ కోతల అవసరం ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో సరఫరా ఆపుతున్నారని, అవి సర్దుబాటులో భాగమేనని, ప్రజల భాషలో అనధికార కోతలని ఓ అధికారి వ్యాఖ్యానించారు.


వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేదు

ప్రస్తుతం వ్యవసాయానికి పగటి పూటే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. సగటున నెలకు 10 మిలియన్‌ యూనిట్లు వినియోగమవుతోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో అయితే 12 మి.యూ. వరకు వెళుతుంది. ఇందులో 90 శాతం ఉచితమే.


పరిశ్రమల వినియోగం 20 శాతం పెరిగింది

సూర్యప్రతాప్‌, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్‌

కరోనా తరువాత అన్ని పరిశ్రమలు పుంజుకున్నాయి. సాధారణ వినియోగం కంటే 10 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో 10 శాతం వినియోగం తగ్గింది. ఇప్పుడు అదనంగా మరో 10 శాతం పెరిగింది. అంటే మొత్తం 20 శాతం పెరిగినట్టు లెక్క. ప్రస్తుతం సినిమా థియేటర్లు పూర్తిగా లేవు కాబట్టి ఇబ్బంది లేదు. అవి కూడా ప్రారంభమైతే వినియోగం రోజుకు మరో మిలియన్‌ యూనిట్లు పెరుగుతుంది. ఐటీ పరిశ్రమల్లో కేవలం ఏసీలకు మాత్రమే విద్యుత్‌ వినియోగిస్తున్నందున వాటి  భారం పెద్దగా లేదు. 


ఇది విద్యుత్‌ వినియోగం తీరు

నెల            వినియోగించిన విద్యుత్‌      

2021 ఏప్రిల్‌     702.551 మి.యూనిట్లు    

మే        727.230 మి.యూనిట్లు    

జూన్‌      703.012 మి.యూనిట్లు   

జూలై      693.013 మి.యూనిట్లు    

ఆగస్టు     751.482 మి.యూనిట్లు    

సెప్టెంబరు  691.450 మి.యూనిట్లు    

అక్టోబరు, 21   

11వ తేదీ వరకు)  274.022 మి.యూనిట్లు  

Updated Date - 2021-10-13T06:31:40+05:30 IST