ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-07-25T05:06:19+05:30 IST

జిల్లాను వాన ముంచెత్తుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరింది.

ముంచెత్తిన వాన
ధారూరు మండలం రుద్రారం-దోర్నాల గ్రామాల మధ్య కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

  • ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • అలుగెత్తుతున్న చెరువులు, ప్రాజెక్టులు
  • తెగిన రుద్రారం-నాగసమందర్‌ తాత్కాలిక వంతెన
  • నిలిచిపోయిన రాకపోకలు
  • మత్తడి దూకిన కోట్‌పల్లి ప్రాజెక్టు 


జిల్లాను వాన ముంచెత్తుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరింది.  చెరువులు అలుగు పారుతున్నాయి. వరద ఉధృతికి పలు చోట్ల వంతెనలు, రోడ్లు తెగిపోయాయి. రవాణా స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి/ధారూరు/ బషీరాబాద్‌/ పెద్దేముల్‌/వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలోని శివసాగర్‌ చెరువు అలుగెత్తి పారుతోంది. సర్పన్‌పల్లి, జుంటుపల్లి, అల్లాపూర్‌ ప్రాజెక్టులు నిండాయి. కోట్‌పల్లి, నందివాగు, లక్నాపూర్‌, కొంశెట్‌పల్లి ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 24 అడుగులు ఉండగా పూర్తిస్థాయికి చేరుకుంది. జిల్లాలో 1196 చెరువులు ఉండగా, వాటిలో ఇప్పటి వరకు 175 చెరువులు అలుగు పోస్తున్నాయి. 218 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీరు చేరుకోగా, 208 చెరువుల్లో 50 నుంచి 75 శాతం వరకు నీరు చేరింది. 208 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు నీరు ఉండగా, మిగతా 387 చెరువుల్లో 25 శాతం నీరు వచ్చింది.

జిల్లాలో వర్షపాతం

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లి పలు గ్రామాల్లో చెరువులు నిండు కుండను తలపించాయి. కాగా, శనివారం వికారాబాద్‌లో అత్యధికంగా 57.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మోమిన్‌పేటలో 4మి.మీ వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 19.6 మి.మీ, నవాబుపేటలో 20 మి.మీ, పూడూరులో 54.2మి.మీ, పరిగిలో 30.2మి.మీ, కుల్కచర్లలో 33.4మి.మీ, దోమలో 37మి.మీ, ధారూరులో 36.2మి.మీ, బంట్వారంలో 40మి.మీ, తాండూరులో 19.2మి.మీ, యాలాల్‌లో 21మి.మీ, పెద్దేముల్‌లో 31.4మి.మీ, బషీరాబాద్‌లో 6.6మి.మీ, బొంరా్‌సపేటలో 10.4మి.మీ, కొడంగల్‌లో 13.4 మి.మీ, దౌల్తాబాద్‌లో 10.8 మి.మీ వర్షం కురిసింది. 

తెగిన తాత్కాలిక వంతెన

ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు దూకింది. భారీ వర్షాలకు  శుక్రవారం రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పోటెత్తడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతికి రుద్రారం-నాగసమందర్‌ గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వంతెనకు ఉన్న పైపులతో పాటు మట్టి కొట్టుకుపోయింది. దీంతో ధారూరు నుంచి నాగసమందర్‌ వైపు రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ధారూరు స్టేషన్‌-దోర్నాల గ్రామాల మధ్య ఉన్న వాగుపై నుంచి వరదనీరు ప్రవహించటంతో వంతెన కొట్టుకుపోయింది. శనివారం సాయంత్రం వరకు వరధ ఉధృతి తగ్గకపోవటంతో దోర్నాల వైపు నుంచి ధారూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని, వంతెనల నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి ఏర్పడిదని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. 

పోటెత్తిన కాగ్నానది

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బషీరాబాద్‌ మండలంలోని జీవన్గి కాగ్నానది శనివారం వరద నీటితో పోటెత్తింది. ఉదయం నది ఒడ్డున ఉన్న శ్రీమహదేవలింగేశ్వరాలయం అడుగు భాగంలో వరదనీరు పారింది. కాగ్నానదిలో ఇటీవల రూ.7.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెక్‌డ్యాంకు ఆనుకుని ఉన్న పంట పొలాలు కొంత భాగం వరద నీటి ప్రవాహానికి కోతకు గురయ్యాయి.

తాండూరు-హైదరాబాద్‌ రాకపోకలు బంద్‌

భారీవర్షాలకు పెద్దేముల్‌ మండలంలోని తాత్కాలికరోడ్లు తెగిపోయాయి. కందనెల్లి మీదుగా తాండూరు-హైదరాబాద్‌ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే పరిగి మీదుగా సుమారు 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దేముల్‌ మండల ప్రజలు మోమిన్‌పేట్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-07-25T05:06:19+05:30 IST