కురిసింది వాన

ABN , First Publish Date - 2021-05-15T04:51:10+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఓ మోస్తరు నుంచి, భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది.

కురిసింది వాన
వేపాడ మండలం అరిగిపాలెంలో నిలిచిన వర్షపునీరు

  జిల్లావ్యాప్తంగా భారీ వర్షం   

 పలుచోట్ల తేలికపాటి జల్లులు 

  లోతట్టు ప్రాంతాలు జలమయం 

చల్లబడిన వాతావరణం

   ఎండ వేడి నుంచి కాస్త  ఊరట చెందిన ప్రజలు 

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ వేపాడ/ పార్వతీపురం టౌన్‌/ పార్వతీపురం రూరల్‌ : జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఓ మోస్తరు నుంచి, భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమైంది. చల్లని గాలులతో సాయంత్రం 5 గంటల వరకూ వర్షం కురిసింది. దీంతో  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లు, రహదారులపై వర్షపునీరు నిలిచింది. ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌.కోట, బొబ్బిలి, సాలూరు, సీతానగరం, మక్కువ, పార్వతీపురం పట్టణం, మండలాల్లో జోరుగా వర్షం కురవగా, గంట్యాడ, గజపతినగరం, బొండపల్లి, మెంటాడ, భోగాపురం తదితర చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. వేపాడ మండలంలో గుడివాడ, అరిగిపాలెం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలు ముంపునకు గరయ్యాయి. బానాదిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మొత్తంగా గత రెండు రోజులుగా అధిక వేడి, ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఊరట చెందారు. ఈదురు గాలులకు అనేక గ్రామాల్లో మామిడి పంట నేల పాలైంది. ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. 


 

Updated Date - 2021-05-15T04:51:10+05:30 IST