ఏజెన్సీలో భారీవర్షం

ABN , First Publish Date - 2022-05-26T06:09:44+05:30 IST

మండే ఎండలు, ఉక్కపోతలతో పగలంతా అల్లాడిపోయిన మన్యం వాసులకు అర్ధరాత్రి సమయంలో ఏజెన్సీలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీవర్షం కంటిమీద కునుకు లేకుండా చేసింది.

ఏజెన్సీలో భారీవర్షం
లంకపాకల–డోలుగండి వద్ద కొట్టుకుపోయిన మెటల్‌ రోడ్డు

విరిగిన కరెంట్‌ స్తంభాలు, తెగిన వైర్లు 

అంధకారంలో గిరిజన గ్రామాలు 

బుట్టాయగూడెం/కొయ్యలగూడెం, మే 25 : మండే ఎండలు, ఉక్కపోతలతో పగలంతా అల్లాడిపోయిన మన్యం వాసులకు అర్ధరాత్రి  సమయంలో ఏజెన్సీలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీవర్షం కంటిమీద కునుకు లేకుండా చేసింది. రాత్రిపూట ఎక్కడకు వెళ్లాలో తెలియక జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు వర్షం కురుస్తూనే ఉంది. బలమైన గాలులకు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లోని చెట్లు నేలకూలగా విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు పటుచోట్ల తెగిపడ్డాయి. విద్యుత్‌ నిలిచిపోవడంతో గిరిజన కొండరెడ్డి గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడు తున్నాయి. బుధవారం సాయంత్రానికి కూడా విద్యుత్‌ పునరుద్ధరించలేదు. భారీవర్షం కారణంగా లంకపాకల–డోలుగండి ప్రాంతాల మధ్య లక్షల రూపాయలతో నిర్మించిన బ్లాక్‌మెటల్‌ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. నిమ్మలగూడెం, పీఆర్‌ గూడెం, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో  తొమ్మిది విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయినట్టు ఏఈ డి.ఇందిరాకుమారి తెలిపారు. స్తంభాలు పాతుతూ, కొత్త వైర్లు ఏర్పాటు చేస్తూ విద్యుత్‌ను పునరుద్ధరించే పనుల్లో ఉన్నారని ఏఈ తెలిపారు. గిరిజన గ్రామాల్లో వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధికారులను ఆదేశించారు.

కొయ్యలగూడెం మండలంలో గాలివాన కారణంగా తీవ్రనష్టం వాటిల్లింది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. పెద్ద గాలి వీయడంతో అనేక చోట్ల స్తంభాలు, ట్రాన్స్‌పార్మర్లు పడిపోయాయి. తక్షణం అధికారులు స్పందించి కరెంటును పునరుద్ధరించారు. 

రూ.8 లక్షలు నష్టం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 33కేవీ స్తంభాలు 8, 11 కేవీ స్తంభాలు 19, ఎల్‌టీ లో 27 స్తంభాలు పడిపోయా యని, మూడు ట్రాన్స్‌ఫార్మర్లు గాలులకు పడిపోయాయని ఎస్‌ఈ శ్యాంబాబు తెలిపారు.  మొత్తం రూ.8 లక్షలు నష్టం వచ్చినటుట తెలిపారు. 

ఎండ, ఉక్కపోతకు 1300 కోళ్లు మృతి

ద్వారకాతిరుమల, మే 25: పెరిగిన ఉష్ణోగ్రతలకు బ్రాయిలర్‌ కోళ్లు అల్లాడుతున్నాయి. ఎండ, ఉక్కపోత కారణంగా జాగ్రత్తలు తీసుకున్నప్ప టికీ నిత్యం కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మండలంలోని ఐఎస్‌ రాఘవాపురంలో బుధవారం 1300 కోళ్లు మృత్యువాత పడినట్లు ఫారం యజమాని వంశీకృష్ణ తెలిపారు. మంగళ వారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్రమైన ఎండ, రాత్రంతా వర్షం, ఉక్కపోత కారణంగా కోళ్లు చనిపోయాయని ఆయన చెప్పారు. 

పిడుగుపాటుకు పాడిగేదె మృతి

వేలేరుపాడు, మే 25 : భారీ వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు పడడంతో మంగళవారం రాత్రి ఒక పాడిగేదె మృతి చెందింది. శివకాశీపురం గ్రామానికి చెందిన కోనూరు కాంతారావుకు చెందిన పాడిగేదెను సమీపంలోని పొలం వద్ద కట్టివేయగా పిడుగు పడడంతో గేదె మృతి చెందింది. గేదె విలువ రూ.50వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.

Updated Date - 2022-05-26T06:09:44+05:30 IST