మన్యంలో భారీ వర్షం.... రహదారులు జలమయం

ABN , First Publish Date - 2021-04-24T04:19:23+05:30 IST

ఏజెన్సీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ మండిపోయింది. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

మన్యంలో భారీ వర్షం.... రహదారులు జలమయం
పాడేరులో వర్షం కురుస్తున్న దృశ్యం

పాడేరు, ఏప్రిల్‌ 23: ఏజెన్సీలో శుక్రవారం మధ్యాహ్నం  భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ మండిపోయింది. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది.  పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం నీటితో పాడేరు మెయిన్‌రోడ్డు చెరువును తలపించింది. గత వారం రోజులుగా ఏజెన్సీలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది. ఉదయం వేళల్లో మంచు కురవడం, మధ్యాహ్నం వరకు ఎండ  కాయడం, ఆ తర్వాత వర్షం కురవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లో సుమారుగా గంటన్నర సమయం వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎండ కాసింది. తాజా వర్షాలు సాగుకు అనుకూలమని రైతులు చెబుతున్నారు. 


గూడెంకొత్తవీధిలో...

గూడెంకొత్తవీధి: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది.  ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 


ముంచంగిపుట్టులో ...

ముంచంగిపుట్టు: మండల వ్యాప్తంగా శుక్రవారం   భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి  ఏకధాటిగా  ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది.  దీంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు వరదనీటితో  నిండిపోయాయి.  మట్టిరోడ్లు బురదమయమై రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. 


పెదబయలులో చిరుజల్లులు 

పెదబయలు: మండలంలోని పెదబయలు, అరడకోట,గంప్పరాయి, తురకలవలస, ఇదులపుట్టు, తదితర గ్రామాల్లో శుక్రవారం చిరుజల్లులు కురిశాయి.  


Updated Date - 2021-04-24T04:19:23+05:30 IST