ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-10-07T05:42:24+05:30 IST

జిల్లాను మరోసారి వానలు ముంచెత్తాయి. దసరా పండుగ సమయంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి జల్లులు ప్రారంభం కాగా రాత్రికి అత్యధిక చోట్ల భారీవర్షమే కురిసింది. పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. తిరిగి గురువారం పగటిపూట కూడా చాలాప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీవర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు పట్టణాల్లో ప్రధాన రహదారులు చెరువులు, కాలువలను తలపించాయి. లోతట్టు కాలనీలు నీటమునగడంతో పాటు కొన్నిచోట్ల ఇళ్ళలోకి నీరు చేరింది. భారీవర్షాల వల్ల కొన్ని పంటలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

ముంచెత్తిన వాన
తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద నీట మునిగిన మిర్చి చేలు కంభంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

జనజీవనం అస్తవ్యస్తం

జిల్లావ్యాప్తంగా మరోసారి భారీవర్షం

కనిగిరి ప్రాంతంలో కుంభవృష్టి

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

పొంగిన వాగులు, వంకలు, రవాణాకు తీవ్ర అంతరాయం

పలు పట్టణాల్లో లోతట్టు కాలనీలు జలమయం

అక్కడక్కడ పంటలకు దెబ్బ, రైతుల్లో ఆందోళన

ఒంగోలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): 


జిల్లాను మరోసారి వానలు ముంచెత్తాయి. దసరా పండుగ సమయంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి జల్లులు ప్రారంభం కాగా రాత్రికి అత్యధిక చోట్ల భారీవర్షమే కురిసింది. పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. తిరిగి గురువారం పగటిపూట కూడా చాలాప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీవర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు పట్టణాల్లో ప్రధాన రహదారులు చెరువులు, కాలువలను తలపించాయి. లోతట్టు కాలనీలు నీటమునగడంతో పాటు కొన్నిచోట్ల ఇళ్ళలోకి నీరు చేరింది. భారీవర్షాల వల్ల కొన్ని పంటలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.


ఎడతెరపిలోని వానతో జిల్లా తడిసిముద్దయ్యింది ప్రస్తుత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై చూపుతుండగా దీని వల్ల జిల్లాలో మరోసారి వర్షాలు కురిశాయి. గత నెలలో జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొనగా ఈనెల ఆరంభంలో రెండు, మూడు రోజులు ముసురు పట్టి విస్తారంగా జల్లులు పడటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. ఈశాన్య రుతపవనాల ప్రభావంతో ఆ వర్షాలు కురిశాయి. బుధవారం మద్యాహ్నం నుంచి చాలాప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాన ప్రారంభం కాగా రాత్రికి భారీవర్షమే కురిసింది. జిల్లాలో గురువారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో సగటున 48.50 మి.మీ వర్షపాతం  నమోదైంది. అత్యధికంగా కనిగిరిలో 142.4మి.మీ వర్షపాతం నమోదు కాగా కొనకనమిట్లలో 105.4, కంభంలో 102.40, బేస్తవారపేట 98.40, మర్రిపూడిలో 90.2, మి.మీ కురవగా మరో 15 మండలాల్లో 50 నుంచి 90 మి.మీ మేర కురిసింది. ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వర్షం అధికంగా ఉంది. 


ఉధృతంగా వాగులు, వంకలు

తిరిగి గురువారం పగటిపూట కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అలా గురువారం సాయంత్రం ఐదు గంటల సమయానికి సగటున 13.90 మి.మీ  వర్షపాతం నమోదైంది. కాగా గరిష్ఠంగా చీమకుర్తిలో 55.0 మి.మీ, కొండపిలో 46.50, పొదిలిలో 45.0, మర్రిపూడిలో 44.0 మి.మీ కురియగా మరో పది పన్నెండు మండలాల్లో 25 నుంచి 40 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇలా భారీవర్షాలు పడటంతో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుండ్లకమ్మకు నల్లమల నుంచి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి గురువారం ఉదయానికి 2,500 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తుండగా రెండు గేట్లను ఎత్తి మూడు వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గిద్దలూరు, కనిగిరి, పొదిలి, చీమకుర్తి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని పలు వాగులు, వంకలు ఉధృతంగా పారుతుండటంతో ఆ మార్గాల్లో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 


లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీవర్షాలతో ఒంగోలు, కనిగిరి, పొదిలి తదితర పట్టణాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్ళలోకి కూడా నీరు చేరి జనం ఇక్కట్లు పడ్డారు. పట్టణంలోని ప్రధాన  రహదారుల్లో మోకాలి లోతు నీరు ప్రవహిస్తూ చెరువులు, కాలువలను తలపించగా వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పట్టణాల్లో సాధారణ జనజీవనానికి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఒంగోలు నగరంలో ఈ పరిస్థితి మరింత అధికంగా కనిపించింది. నగరంలోని పదికిపైగా శివారు కాలనీలు మునిగాయి. పేదల ఇళ్ళలోకి నీరు చేరగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆదేశాలతో ఆ పార్టీ నగర నాయకులు పలు కాలనీల్లో బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. 


దెబ్బతిన్న పంటలు

మరోవైపు గత నెల అంతా తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొని నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలతో జీవం పోసుకున్న ఖరీఫ్‌ పైర్లు ప్రస్తుతం కురిసిన భారీవర్షాలతో దెబ్బతింటున్నాయి. ప్రధానంగా పలు ప్రాంతాల్లో మిర్చి, పత్తి పంట పొలాల్లో చాలాచోట్ల వర్షపు నీరు చేరగా దర్శి ప్రాంతంలో కోతలు కోసి ఉన్న సజ్జ పంట తడిచి దెబ్బతింది. వర్షం మరింత అధికమైతే కంది ఇతర పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, భారీవర్షం సమయంలో పిడుగులు పడటంతో దర్శి ప్రాంతంలో బుధవారం ఇద్దరు మృతిచెందారు. అలాగే పలుప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి జనం అవస్థలు పడ్డారు. 


1,951 ఎకరాల్లో పంటల నష్టం

  జిల్లాలో కురిసిన భారీవర్షాలకు మూడు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 20 గ్రామాల్లో 1,951 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చీమకుర్తి మండలంలో 11 గ్రామాల్లో మినుము 5 ఎకరాలు, పెసర 10, సజ్జ 286 ఎకరాల్లో, కొనకనమిట్ల మండలంలో సజ్జ 650 ఎకరాలు, హెచ్‌ఎంపాడు మండలంలో ఎనిమది గ్రామాల్లో 700 ఎకరాల్లో మినుము పంట, సజ్జ 300 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఆ మేరకు  ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-10-07T05:42:24+05:30 IST