కుంభవృష్టి

Sep 28 2021 @ 00:46AM
విజయవాడలో జలమయమైన పాలీక్లినిక్‌ రోడ్డు

జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం

పొంగి ప్రవహిస్తున్న వాగులు.. వంకలు

15,849 ఎకరాల్లో పంటలు నీటమునక

జిల్లా సగటు వర్షపాతం 44.4 మిల్లీ మీటర్లు 

అత్యధికంగా జి.కొండూరులో 178 మిల్లీ మీటర్లు

అత్యల్పంగా ఘంటసాలలో 5.2 మిల్లీ మీటర్లు

16 మండలాల్లో 50 మి.మీటర్లకు పైనే వర్షపాతం


గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం జిల్లానూ తాకింది. ఆదివారం అర్థరాత్రి మొదలైన వర్షం సోమవారం తెల్లవారుజాముకు మరింత పెరిగి, మధ్యాహ్నం వరకూ కుండపోతగా కురిసింది.ఈ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగాయి. అనేక రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రోడ్డు, రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లా అంతటా జనజీవనం స్తంభించింది. మంగళవారం కూడా కోస్తా తీరం వెంబడి భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / మచిలీపట్నం) : జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ, దీనికి భిన్నంగా సోమవారం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలోని 50 మండలాల పరిధిలో 2,219 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 44.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ వర్షం కారణంగా జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వరి, ఉద్యానపంటలు,  కూరగాయల తోటలు నీటిలో మునిగి తేలియాడుతున్నాయి. రైల్వే ట్రాక్‌లపైనా వర్షం నీరు పారింది. ఫలితంగా రోడ్డు, రైలు రవాణాలకు కూడా అవాంతరం ఏర్పడింది. బంద్‌ కారణంగా బస్సులు నిలిచిపోగా, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం కావటం విశేషం. కాగా మంగళవారం కూడా కోస్తా తీరం వెంబడి భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  


పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

భారీ వర్షాల తాకిడికి కైకలూరులో ఆటపాక వద్ద జాతీయ రహదారిపై చెట్లు నేలకూలాయి. మైలవరం-నూజివీడు మధ్య జాతీయ రహదారి వాగును తలపించింది. వత్సవాయి మండలంలో వేమవరం రహదారిపై వర్షపునీరు ప్రవహిస్తుండటంతో ఈ దారి వెంట రాకపోకలను అధికారులు నిలిపివేశారు.  విజయవాడ-విస్సన్నపేట రహదారిపై కొత్తూరు తాడేపల్లి వద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది. తిరువూరు మండలం చింత లపాడు వద్ద గుర్రపువాగు పొంగి ప్రవహిస్తోంది. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో భారీ వర్షానికి రహదారికి గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. గంపలగూడెం మండలంలో తోటమూల - వినగడప రహదారిలో గల కట్లేరు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండవాగు పోటెత్తి, అనుమల్లంక గ్రామాన్ని ముంచెత్తింది. అనుమల్లంకలోని కొత్త చెరువుకు గండి పడి, పంట పొలాలు నీట మునిగిపోయాయి. రాళ్ల చెరువుకు గండి పడి పొలాలను ముంచెత్తింది. మచిలీపట్నంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


15,849 ఎకరాల్లో పంటలు నీటమునక 

జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,  వత్సవాయి, ఆగిరిపల్లి, మైలవరం, నూజివీడు, ముసునూరు, మండవల్లి, మచిలీపట్నం, విస్సన్నపేట, గన్నవరం, రెడ్డిగూడెం, గంపలగూడెం మండలాల్లోని 145 గ్రామాల్లో 15,849 ఎకరాల్లో వివిధపంటలు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. పిలకలుతొడిగే దశలో ఉన్న వరి, పూత, పిందె, కాయదశలో ఉన్న పత్తి, కోతకు సిద్ధంగా ఉన్న మినుము, పెసర, మొక్కజొన్న, ఏపుగా ఎదిగిన మిర్చి, పూత దశలో ఉన్న వేరుశెనగ పైర్లు నీటమునిగినట్టు జిల్లా వ్యవపాయశాఖ అఽధికారులు ప్రాథమిక అంచనాను తయారు చేశారు. సోమవారం ప్రభుత్వానికి ఈ నివేదికను పంపారు. వర్షాలు తగ్గిన తరువాత జిల్లాలో పంటల నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.


అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు ఇవీ..

జిల్లాలోని 16 మండలాల్లో సగటున 50 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జికొండూరు మండలంలో 178 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బాపులపాడు మండలంలో 103.2, వీరులపాడులో 92.6, గంపలగూడెంలో 83.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నూజివీడులో 78.6, ఇబ్రహీంపట్నంలో 78.4, వత్సవాయిలో 78.4, రెడ్డిగూడెంలో 72.6, మండవల్లిలో 72.4, కైకలూరులో 67.2, ఆగిరిపల్లిలో 63.6, ముసునూరులో 60.6, నందిగామలో 58.4, కలిదిండిలో 56.8, నందివాడలో 56.4, ఎ.కొండూరు మండలంలో 55.4 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. 


50 మిల్లీ మీటర్ల కంటే తక్కువ ఇక్కడే

విస్సన్నపేట మండలంలో 47.2 మిల్లీ మీటర్లు, ముదినేపల్లి మండలంలో 45.4, పెనుగంచిప్రోలులో 45.2, గన్నవరంలో 44.6, గుడివాడలో 43.2, చాట్రాయి మండలంలో 42.2, గుడ్లవల్లేరులో 39.2, పెదపారుపూడిలో 37.6, ఉంగుటూరులో 36.8, విజయవాడ రూరల్‌ మండలంలో 35.4, విజయవాడ అర్బన్‌లో 35.4, మచిలీపట్నంలో 32.6, మైలవరంలో 32.4, బంటుమిల్లిలో 32.2, మొవ్వ మండలంలో 31.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కంచికచర్ల మండలంలో 29.6, పమిడిముక్కలలో 29.2, కృత్తివెన్నులో 28.4, పామర్రులో 27.8, చందర్లపాడులో 26.8, పెనమలూరులో 26.2, తిరువూరులో 25.6, ఉయ్యూరులో 25.6, జగ్గయ్యపేటలో 24.6, పెడనలో 24.4, గూడూరులో 23.4, కంకిపాడులో 20.2, చల్లపల్లిలో 16.2, కోడూరులో 11.4, అవనిగడ్డలో 11.2, తోట్ల వల్లూరు మండలంలో 10.4 మిల్లీమీటర్లు నమోదైంది. అతి తక్కువ వర్షపాతం ఘంటసాలలో 5.2, మోపిదేవిలో 8.0, నాగాయలంకలో 8.4 నమోదైంది.


వర్షంలోనే ‘స్పందన’

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని బంద్‌ కారణంగా రద్దు చేస్తున్నట్టు పోలీసు యంత్రాంగం ప్రకటించగా, జిల్లా యంత్రాంగం మాత్రం కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనకు భారీ వర్షంలోనూ ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అన్ని మండల కార్యాలయాల్లోనూ స్పందన కార్యక్రమాలు జరిగాయి.


సీఎంకు వర్షం వివరాలు  

 జిల్లాలో 44 మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందని సీఎం జగన్‌కు కలెక్టర్‌ నివాస్‌ వివరించారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి నివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి.కొండూరు మండలంలో ఒక రోడ్డు కోతకు గురైందని, మిగిలిన అన్నిచోట్లా సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులను అప్రమత్తం చేసినట్టు ముఖ్యమంత్రికి వివరించారు.

విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లిలో చెరువును తలపిస్తున్న వరిచేను


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.