పొంగిన వాగులు, వంకలు

ABN , First Publish Date - 2021-10-25T06:31:58+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లాయి.

పొంగిన వాగులు, వంకలు
యాడికి మండలం భోగాలకట్టలో నీటమునిగిన పప్పుశనగ పంటను చూపుతున్న రైతు లక్ష్మిరెడ్డి

దంచి కొట్టిన వాన

నీటమునిగిన పప్పుశనగ

 రైతులకు భారీ నష్టం 

పిడుగుపాటుకు ఇద్దరు మృతి 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 24  : జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లాయి. కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు దిగువకు వస్తుండటంతో జిల్లాలోని హిందూపురం ప్రాంతం లో పెన్నానది, తనకల్లు సమీపంలోని పాపాఘ్ని నది నీటితో పరవళ్లు తొక్కాయి. తనకల్లు వద్ద పా పాఘ్ని నది నీటి ప్రవాహానికి ఓ ట్రాక్టర్‌ నదిలో ప డిపోయింది. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రబీ సీజనలో సా గు చేసిన పప్పుశనగ పంట వర్షపు నీటితో మునిగింది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తనం వేసిన తర్వా త వర్షాలు పడటంతో మొలకెత్తని దుస్థితి నెలకొంది. భూమిలో ఎక్కువ శాతం తేమ ఉంటే పం ట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాడికి మండలం భోగాలకట్టలో 200 ఎకరాల్లో పప్పుశనగ పంట నీటమునిగింది. తద్వారా రూ.20 లక్షల దాకా పంట నష్టం జరిగింది. అదే మండలంలో 500 ఎకరాల్లో పప్పుశనగ పంట అధిక వర్షాలకు నల్లగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 15 వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. ప్రస్తుతం పంటంతా మొలక దశలో ఉంది. వరుసగా పడుతున్న వర్షాలకు వేరుకుళ్లు సోకి పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  


58 మండలాల్లో వర్షం..

శనివారం రాత్రి  58 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా హిందూపురంలో 77.6  మి.మీ వర్షపాతం నమోదైంది. యల్లనూరు 71.2, యాడికి 65.4, గుమ్మఘట్ట, లేపాక్షి 58.8, మడకశిర 49.2, శింగనమల 40.2, సోమందేపల్లి 37.8, పరిగి 36.6, బ్రహ్మసముద్రం 33.2, బెళుగుప్ప 31.8, ఉరవకొండ 31.6, చిలమత్తూరు 31.2, విడనపకల్లు 27.6, అమరాపురం 26.8, రొళ్ల 22.0, నార్పల 21.6,  పెనుకొండ 20.4, పుట్లూరు 20.2, తాడిపత్రి 20.0, మిగతా ప్రాంతాల్లో 19.2 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. ఆదివారం బెళుగుప్ప, గుం తకల్లు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అనంతపురం,  అమరాపురం, ముదిగుబ్బ, తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం, గుత్తి, కూడేరు, శెట్టూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, తాడిపత్రి, బొమ్మనహాళ్‌ తదితర మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. 


పిడుగుపాటుతో ఇద్దరు గొర్రెల కాపరుల మృతి 

బ్రహ్మసముద్రం : మండలంలోని బొమ్మగానిపల్లికి చెందిన బోయ తిమ్మన్న (65), మోహననాయక్‌ (42)లు ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ... బొమ్మగానిపల్లి గ్రా మానికి చెం దిన తిమ్మన్న, మోహననాయక్‌ గొర్రె లు మేపేందుకు వెళ్లారు. వర్షం రావడంతో చింతచెట్టు కింద కు వెళ్లారు. అదే సమయంలో వారిపై పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గొర్రెలు పక్క పొలంలోకి వెళ్లడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. 






సీబీఆర్‌ డ్యాం నుంచి దిగువకు నీటి విడుదల 

తాడిమర్రి, అక్టోబరు24: మండల సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. రెండు గేట్లు ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వైవీఆర్‌ డ్యాం నుంచి నీరు వస్తుండటంతో పాటు ఎగువ ప్రాంతా ల నుంచి కురిసిన వర్షాల వల్ల ధర్మ వరం చెరువు నుంచి, చిత్రావతి నుంచి నీరు డ్యాంకు చేరుతోంది. ఇప్పటికే డ్యాంలో 9.8టీఎంసీల నీటి సామర్థ్యం కంటే ఎక్కువ ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఆ నీరు ఇప్పటికే యాల్లనూరు మండలం గొడ్డుమర్రి  రిజర్వాయర్‌కు చేరినట్లు సమీప గ్రామాల ప్రజలు తెలిపారు. 


పాపాఘ్నిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ 

తనకల్లు: మండలంలోని టీ సదుం గ్రామసమీపంలో పాపాఘ్ని నదిలో ఆదివారం ఓ ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా... టీ సదుం గ్రామానికి చెందిన దస్తగిరిఖాన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఖరీమ్‌ ఆదివారం పాపాఘ్నినదికి ఆవలివైపు ఉన్న బంగారువాండ్లపల్లికి వేరుశనగ కాయలు తీసుకురావడానికి బయల్దేరాడు. నది దాటుతుండగా, కర్ణాటకలో పడిన వర్షాలకు పాపాఘ్ని ఉప్పొంగుతుండటంతో సీజీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో ఉన్నట్లుండి నీళ్లు వేగంగా రావడం, అంతకు మునుపే నీటి ప్రవాహానికి రోడ్డు పాచిపట్టి ఉండటంతో ట్రాక్టర్‌ నదిలో పడిపోయింది. డ్రైవర్‌ పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నా డు. విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున గ్రామస్థులు గుమికూడి, మోకు సహాయంతో డ్రైవర్‌ను నదిలో నుంచి పైకి లాగారు. ట్రా క్టర్‌ కొట్టుకుపోకుండా మోకులు వేసి పక్కకు కట్టి వేశారు. పాపాఘ్నిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ 



పెన్నా పరవళ్లు

హిందూపురం, అక్టోబరు 24 : రెండు దశాబ్థాల తర్వాత పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజూము వరకు కర్ణాటకలోని పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నందికొండల నుంచి తొండేబావి, మంచేపల్లి, గౌరిబిదనూరు, విదురాశ్వర్థం ప్రాంతాల్లో పెన్నాపై ఉన్న డ్యాంలు, చెరువులు దాటుకుని ఆదివారం ఉదయం హిందూపురం మండలం చౌళూరు వద్ద జిల్లాలోకి వరద ప్రవహించింది. చౌళూరు వంతనపై భారీగా ప్రవహించి సాయంత్రానికి హిందూపురం పెన్నా కుముద్వతి ప్రాజెక్టు వద్దకు తాకింది. దీంతో పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలు, హిందూపురం పట్టణ వాసులు  నదికి గంగపూజలు నిర్వహించారు. సంతోషంగా కేరింతలు కొట్టారు. అదే విధంగా చిత్రావతి ఉపనది కుషావతి నది కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. కర్ణాటకలోని నంది కొండల, మంచేపల్లి, గుడిబండ ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లి కుషావతి జిల్లాలోకి ప్రవహిస్తూ చిలమత్తూరు మండలం కోడూరు సమీపంలో చిత్రావతిలోకి కలిసిపోయింది. ఒకే రోజు పెన్నా, కుషావతి ప్రవాహంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలోనూ శనివారం రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ వర్షానికి హిందూపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సివచ్చింది. చౌళూరు వద్ద మధ్యాహ్నం వంతెనపై భారీ ప్రవాహంతో కాసేపు రాకపోకలకు అంతరాయం కల్గింది. 




Updated Date - 2021-10-25T06:31:58+05:30 IST