ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-11-20T05:46:47+05:30 IST

జిల్లాకు వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ దాని ప్రభావంతో కురిసిన వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ఇప్పటికే వారం నుంచి పట్టిన ముసురుకు తాజాగా తోడైన వానలతో జిల్లా తడిసిముద్దయ్యింది. ప్రత్యేకించి జిల్లాలోని దక్షిణప్రాంతంలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా పడింది. ఈనెలలో 143.7మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే దాదాపు 189.0 మి.మీ కురిసింది.

ముంచెత్తిన వాన
గుడ్లూరు మండలం చెమిడిదపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ఎలికేరు

దక్షిణప్రాంతంలో కుండపోత

మిగిలిన చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం

పొంగిన వాగులు,వంకలు

రాకపోకలకు ఆటంకం

వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

తెరిపిస్తే వెలుగులోకి మరింత నష్టం

యంత్రాంగం అప్రమత్తం

వరదనీటి ప్రవాహల వద్ద 

పోలీసుల గస్తీ

జన జీవనం అస్తవ్యస్తం

ఒంగోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) :

జిల్లాను వాన ముంచెత్తింది. దక్షిణప్రాంతంలో కుండపోత కురిసింది. మిగిలిన అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీగా పడింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలుప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కులు నీరు వస్తుండగా ఆ మొత్తాన్ని రెండు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వర్షాల వలన సుమారు 44,098 ఎక రాల్లో  పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేయగా అంతకు రెండు, మూడు రెట్లు విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాగులు పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. 


 జిల్లాకు వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ దాని ప్రభావంతో కురిసిన వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ఇప్పటికే వారం నుంచి పట్టిన ముసురుకు తాజాగా తోడైన వానలతో జిల్లా తడిసిముద్దయ్యింది. ప్రత్యేకించి జిల్లాలోని దక్షిణప్రాంతంలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా పడింది. ఈనెలలో 143.7మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే దాదాపు 189.0 మి.మీ కురిసింది. అందులో శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో 30.4మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా కందుకూరులో 113.0మి.మీ కురిసింది. ఉలవపాడులో 107.6, లింగసముద్రంలో 90.2మి.మీ పడింది. మరో 10కిపైగా మండలాల్లో 50నుంచి90 మి.మీ వర్షపాతం నమోదైంది.  


పొంగిన వాగులు, రాకపోకలకు అటంకం

దక్షిణ, పశ్చిమ ప్రాంతంలో కురిసిన వర్షాలతో పలు చోట్లవాగులు పొంగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అటంకం ఏర్పడింది. కందుకూరు నుంచి వలేటివారిపాలెం వెళ్లే మార్గంలో బడేవారిపాలెం వద్ద ఎర్రవాగు, గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం వద్ద ఉప్పుటేరు, లింగసముద్రం-పెద్దపవని మధ్య ఉన్న ఉప్పుటేరు, మార్కాపురం సమీపంలో గుండ్లకమ్మ, పామూరు మండలంలో మన్నేరు పొంగి ప్రవహించాయి. రాకపోకలకు ఆటంకం కలుగగా పోలీసు, రెవెన్యూ అధికారులు చేరుకొని నియంత్రణ చర్యలు చేపట్టారు. సి.ఎస్‌.పురం మండలంలోని భైరవకోన జలపాతం ఎగసిపడుతోంది. దీంతో ఆ మండలంలోని పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  ఉలవపాడు మండలం కరేడు చెరువు పొంగి ప్రవహించగా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మరో వైపు కందుకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు  అవస్థ పడుతున్నారు.


రాళ్లపాడు, గుండ్లకమ్మ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

 గుండ్లకమ్మకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కులు నీరు వస్తుండగా రెండు గేట్లు ఎత్తి అంతమేర దిగువకు వదులుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం 20.6 అడుగులు కాగా శుక్రవారం ఉదయానికి 19.10 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 15వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆ మొత్తాన్ని మూడు  గేట్లు ఎత్తి అంతా కిందకు వదులుతున్నారు. మోపాడు రిజర్వాయర్‌ నీటి మట్టం 20 అడుగులకు చేరగా మన్నేరు నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. 

వేలాది ఎకరాల్లో పంటలకు దెబ్బ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. దాదాపు 80నుంచి 90వేల ఎకరాల్లో ఇలా నీరు నిలిచినట్లు సమాచారం. అందులో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు నష్టం  వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, అద్దంకి, పర్చూరు, చీరాల, కనిగిరి, మార్టూరు తదితర సబ్‌ డివిజన్లలో మిర్చి, మినుము ఇప్పటికే అధికంగా దెబ్బతినగా.. పలుచోట్ల పొగాకు, వరి, మొక్కజొన్న, శనగ  ఇతరత్రా చోట్ల దాదాపు 20వేల ఎకరాల్లో మినము, ముదురు పంట తుడిచి పెట్టుకుపోయింది. పర్చూరు, చీరాల, కందుకూరు సబ్‌ డివిజన్లలోని దాదాపు 30వేల ఎకరాల్లో మిర్చి పొలాల్లో నీరు నిలిచింది. చాలాచోట్ల పలు రకాల పంటలు ఉరకెత్తిపోతున్నాయి. ప్రస్తుత వాతావరణం కుదుటపడి ఎండలు వస్తే నష్టాలు మరింతగా  వెలుగు చూస్తాయని రైతులు చెప్తున్నారు. ఈనెలలో వేసిన శనగ, పొగాకు, మిర్చి వంటి వాటిని మళ్లీ దున్ని కొత్తగా వేసుకోక తప్పదని వాపోతున్నారు.  


యంత్రాంగం అప్రమత్తం

వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంతోపాటు, దక్షిణాన మండల, గ్రామస్థాయి రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సిబ్బంది, అధికారులు శుక్రవారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు సంభవించే  పరిస్థితి  ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎస్పీ మల్లికగర్గ్‌ అప్రమత్తం చేయడంతో వారు వాగులు పొంగిన ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు. మొత్తం మీద జిల్లాకు వాయుగుండం ముప్పు తప్పడంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. 

44,098 ఎకరాల్లో పంట నష్టం

 జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 44,098 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో ఖరీఫ్‌కు సంబంధించి 16,348 ఎకరాలు, రబీలో సాగు చేసిన 27,750 ఎకరాలు ఉన్నాయి. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మొత్తం 15 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వారు పేర్కొన్నారు. అందులో గిద్దలూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలో ఐదు, మార్కాపురం డివిజన్‌లో 3, కనిగిరి పరిధిలో 3, కందుకూరు డివిజన్‌లో 2, ఒంగోలు డివిజన్‌లో 2 మండలాలు ఉన్నాయి. పంటల వారీగా చూస్తే అత్యధికంగా శనగ 12,750 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు నివేదికలో పేర్కొన్నారు. పత్తి 8,721, వరి 4,500 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.  దెబ్బతిన్న ఇతర పంటల్లో మొక్కజొన్న, మినుము, పొగాకు, రాగి, నువ్వులు, జొన్న ఉన్నాయి. శనగ సాగు చేసిన రైతులకు మళ్లీ రాయితీపై విత్తనాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. 


నాలుగు పునరావాస కేంద్రాల ఏర్పాటు

 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను అధికారులు చేపట్టారు. వర్షప్రభావం అధికంగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలంలో మూడు, లింగసముద్రం మండలంలో ఒక పునరాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.   

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ  మలికగర్గ్‌ కోరారు. అత్యవసరమైతే పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతారని   చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నదన్నారు. సహాయక చర్యల కోసం సుశిక్షితులైన సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల వద్ద గస్తీ ఉంచామన్నారు. అత్యవసర  పరిస్థితుల్లో ప్రజలు డయల్‌ 100, సెల్‌నెంబర్‌ 91211 02266కు సమాచారం ఇవ్వాలని  కోరారు. 

 





Updated Date - 2021-11-20T05:46:47+05:30 IST