కుండపోత

ABN , First Publish Date - 2021-10-17T05:10:34+05:30 IST

కుండపోత

కుండపోత
చేవెళ్ల : నీట మునిగిన పత్తి పంట

  • ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు 
  • పత్తి, కూరగాయ, పూల తోటలకు నష్టం 
  • నీట మునిగిన పలు కాలనీలు  
  • అఽధికార యంత్రాంగం అప్రమత్తం
  • కేతిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు గొర్రెలు, మేకల మృతి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)/ ఇబ్రహీంపట్నం/ మొయినాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పలు చోట్ల కుంభవృష్టి కారణంగా రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షాలకు కూరగాయ పంటలతో పాటు పూలతోటలకు భారీగా నష్టం జరిగింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు  వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. జంట జలాశయాలకు భారీ వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీరు కిందకు వదులుతున్నారు. దీంతో మూసి పరివాహాక ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేశారు.  ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల్లో రెండు అడుగుల మేర నాలుగు గేట్లు ఎత్తి 2,800 క్యూసెక్కుల వరదనీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.  వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సరూర్‌నగర్‌ మండలం ఎల్‌బీనగర్‌లో 106.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌ జిల్లా మారుతీనగర్‌ మహిళా  సభ సెంటర్‌లో 102.5 మి.మీ వర్షం కురిసింది. షాబాద్‌లో 96 మి.మీ, ఘట్‌కేసర్‌లో 95మి.మీ, బాలానగర్‌లో 89.5 మి.మీ,  చేవెళ్లలో 87 మి.మీ, కాప్రాలో 81మి.మీ, మేడిపల్లిలో 76మి.మీ, ఆరుట్లలో 70మి.మీ, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 68 మి.మీ, షాద్‌నగర్‌లో 65 మి.మీ, వికారాబాద్‌లో 52 మి.మీ, వర్షపాతం నమోదైంది. నగర శివార్లలోని రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, గండిపేట, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలు నీటమునిగాయి.  మెయినాబాద్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో టమాట, కూరగాయ పంటలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వరి పంట కూడా నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో పత్తి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సమాచారం.   

పంటలకు నష్టం 

చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించారు. చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో  వందల ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పూలు, పత్తి పంటలు దెబ్బతినడంతో  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అయితే మండలంలో కురిసిన భారీ వర్షానికి ఇంటికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు వాగులో చిక్కుకుపోయారు. దీంతో గ్రామస్థులు విషయం తెలుసుకుని తాళ్ల సాయంతో వారిని వాగు దాటవేశారు. ఈసీ, మూసీ వాగుల్లో పుష్కలంగా నీరు చేరింది. 

పట్నంలో జోరు వాన

ఇబ్రహీంపట్నం టౌన్‌ సహా మండలంలో శనివారం మధ్యాహ్నం జోరు వాన కురిసింది. ఉరుములతో గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంతోష్‌ థియేటర్‌ ముందు కాలనీ రోడ్డులో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బృందావన్‌ కాలనీ బ్రిల్లియంట్‌ స్కూల్‌ వద్ద పెద్దఎత్తున నీరు నిలిచింది. మిషన్‌ భగీరథ పనులతో రోడ్లను తవ్వి కారణంగా గుంతలు ఏర్పడి చిత్తడిగా మారాయి. 

పిడుగుపాటుకు గొర్రెలు, మేకల మృత్యువాత

మొయినాబాద్‌ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో  పిడుగుపాటుకు ఏడు గొర్రెలు, రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. కేతిరెడ్డిపల్లికి చెందిన కొరెల కిష్టయ్య రోజూమాదిరిగా గొర్రెలను, మేకలను పొలం గట్టు వద్ద మేపుతున్నాడు. మధ్యాహ్నం భారీ వర్షం పడుతుండడంతో గొర్రెలు, మేకలు చెట్టుకిందకు వెళ్లాయి. ఈ క్రమంలో పిడుగుపడి ఏడు గొర్రెలు, రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని ఎంపీటీసీ రెడ్డిమోని అర్చనయాదయ్య కోరారు. 

Updated Date - 2021-10-17T05:10:34+05:30 IST