ముంచెత్తింది

ABN , First Publish Date - 2021-07-23T07:26:46+05:30 IST

భారీ వర్షాలకు జిల్లాలోని పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నారుమడులపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లావ్యాప్తంగా 248 హెక్టార్లలో ఖరీఫ్‌ వరి పంట ముంపునకు గురైంది.

ముంచెత్తింది

  • భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • జిల్లాలో 248 హెక్టార్లలో  వరి పంటకు నష్టం
  • 15 మండలాల్లో 423 హెక్టార్లలో నర్సరీలకు నష్టం
  • వాసాలతిప్ప డ్రెయిన్‌ పొంగడంతో ముంపులో వందలాది ఎకరాలు
  • వర్షాల తాకిడికి ఛిద్రమైన రహదారులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

భారీ వర్షాలకు జిల్లాలోని పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నారుమడులపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లావ్యాప్తంగా 248 హెక్టార్లలో ఖరీఫ్‌ వరి పంట ముంపునకు గురైంది. అత్యధికంగా పి.గన్నవరం, కడియం, అనపర్తి మండలాల్లో పంట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. 15 మండలాల పరిధిలో 423 హెక్టార్లలో నర్సరీలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పలు రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2940 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అమలాపురంలో 110.8 మి.మీ., అత్యల్పంగా కోటనందూరు మండలంలో 8.08 మి.మీ.వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురంలతో పాటు ఏజెన్సీ మండలాల్లో వర్షపాతం భారీగా నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులకు ఆదేశాలివ్వాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తతతో వ్యహరించాలని కోరారు. అన్ని పురపాలక సంఘాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ఎక్కడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. సముద్ర, గోదావరి తీరాల్లో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అధికారులు నిరోధిస్తున్నారు. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడిలో వాసాలతిప్ప మేజర్‌ డ్రెయిన్‌పై పంచాయతీరాజ్‌ అధికారులు వేసిన క్రాస్‌బండ్ల వల్ల వందల ఎకరాల్లో పంట చేలు తీవ్రస్థాయిలో ముంపునకు గురయ్యాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. అమలాపురం పట్టణంలో హౌసింగ్‌ బోర్డు కాలనీ సహా పలు కాలనీలు జలదిగ్బంధానికి గురై ప్రజలు పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా కోనసీమ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఫలితంగా వేల ఎకరాల్లో నారుమడులు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానమైన డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాలు మునిగాయి. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడిలో వాసాలతిప్ప మేజర్‌ డ్రెయిన్‌పై పంచాయతీరాజ్‌శాఖ అధికారులు వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికోసం డ్రెయిన్‌కు ఇరువైపులా క్రాస్‌బండ్లు వేశారు. ఫలితంగా రూరల్‌ మండల పరిధిలోని చిందాడగరువు, వన్నెచింతలపూడి, రోళ్లపాలెం, కామనగరువు, అమలాపురం తదితర గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాల ఆయకట్టు భూములు ముంపునకు గురయ్యాయి. నారుమడులు సైతం ధ్వంసమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ముంపు పెరగడం వల్ల నష్టాలు తీవ్రమవుతున్నాయన్న రైతుల ఆందోళనతో గురువారం మధ్యాహ్నం ఎట్టకేలకు పంచాయతీరాజ్‌ అధికారులు క్రాస్‌బండ్లను తొలగించడంతో ముంపునీరు వాసాలతిప్ప డ్రెయిన్‌లోకి పారుతోంది.  అమలాపురంతో పాటు కోనసీమలోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలన్నీ వెలవెలబోయాయి. జనసంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

Updated Date - 2021-07-23T07:26:46+05:30 IST