ముంచేనా? తేల్చేనా?

ABN , First Publish Date - 2021-07-26T06:19:29+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో ఆదిలోనే అధిక వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ముంచేనా? తేల్చేనా?
గుడివాడ మండలం బొమ్ములూరు ప్రాంతంలో నీటమునిగిన వరి

ఆదిలోనే అధిక వర్షాలు

కృష్ణా డెల్టాకు ముంపు ముప్పు

3,776 హెక్టార్లలో పైర్లు మునక

సాగైన విస్తీర్ణం 1.18 లక్షల హెక్టార్లు


ఖరీఫ్‌ సీజన్‌లో ఆదిలోనే అధిక వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కృష్ణాడెల్టాలో ఈ ఏడాది ఇప్పటికే భారీ వర్షాలు వేల హెక్టార్లలో పైర్లను ముంచేశాయి. మరిన్ని పంటలు దెబ్బతినే ప్రమాదం  ఉందని భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది వర్షాలు ఖరీఫ్‌ను గట్టెక్కిస్తాయో లేదోనని రైతులు కలవరపడుతున్నారు.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : కృష్ణాడెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే పంటల సాగుపై అధిక వర్షాల ప్రభావం పడింది. ఈ ఏడాది 3,21,661 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతుందని అంచనా కాగా, ఇప్పటివరకు 1,18,106 హెక్టార్లలో సాగు జరిగింది. వారం క్రితం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 80 గ్రామాల్లోని 3,776 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పైర్లు దె బ్బతిన్నట్లు ప్రాథమిక నివేదికను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. నీటమునిగిన పంటల విస్త్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల ఐదో తేదీన కాలువలకు అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఆలస్యంగా నారుమడులు పోయడం ప్రారంభించారు. ఈ నెలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో వెదజల్లే పద్ధతిన వరినాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు నీట మునిగింది.


3,776 హెక్టార్లలో పైరు నీటమునక 

 జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెడన, పెదపారుపూడి, బాపులపాడు, ఉంగుటూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి,  ముదినేపల్లి, గన్నవరం మండలాల్లోని 69 గ్రామాల్లో పది నుంచి 25 రోజుల వయసున్న వరిపైరు, వీరులపాడు, వత్సవాయి మండలాల్లోని 11 గ్రామాల్లో రెండో ఆకు తొడిగే దశలో ఉన్న పత్తి, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న పైర్లు నీట మునిగాయి. గుడివాడ మండలం బొమ్ములూరు ఆయకట్టులో సుమారు 225 ఎకరాల్లో వరినాట్లు మునిగిపోయాయి


అధిక వర్షపాతంతో ఇక్కట్లు 

జిల్లాలో జూన్‌ నెలలో 97.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 107.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 24వ తేదీ నాటికి 156.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 291.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ నెలలో ఇప్పటికే 86.7మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు 254.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 399.3  మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తం మీదా ఈ రెండు నెలలకు కలిపి 57.2 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల కారణంగా వెదజల్లే పద్ధతిలో వరినాట్లు పూర్తయిన చోట పైరు నీట మునిగిందని రైతులు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-26T06:19:29+05:30 IST