Rains: వేకువజామున వర్షాలు.. నగరవాసులకు కష్టాలు

ABN , First Publish Date - 2022-08-30T15:33:27+05:30 IST

నగరంలో గత మూడు రోజులుగా వేకువజామున కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. సోమవారం వేకువజాము నాలుగు

Rains: వేకువజామున వర్షాలు.. నగరవాసులకు కష్టాలు

                                   - కావేరిలో తగ్గని నీటి ఉధృతి


చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో గత మూడు రోజులుగా వేకువజామున కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. సోమవారం వేకువజాము నాలుగు గంటలకు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది.  ఉదయం 8.30 గంటల వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాన కురవటంతో నగరవాసులు అవస్థలపాలయ్యారు. వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహన చోధకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు సకాలంలో వాహన సదుపాయం లేక ఇబ్బందులు పడ్డారు. ఇదే విధంగా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు(Tiruvallur, Kanchipuram, Chengalpattu) జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మహాబలిపురంలో వేకువజాము ఐదు నుంచి ఉదయం ఏడు గంటల వరకూ కుండపోత వర్షం కురిసింది. దీంతో చేపలవేటకు వెళ్ళి జాలర్లు తిరుగుముఖంపట్టారు. వర్షం కారణంగా మహాబలిపురంలోని స్థలశయన పెరుమాళ్‌ ఆలయంలోకి వర్షపు నీరు  ప్రవేసించింది. 


జలదిగ్బంధంలో వందల ఇళ్లు...

మేట్టూరు డ్యాం నుంచి 1.,20లక్షల ఘనపుటడుగుల చొప్పున అదనపు జలాలు విడుదల చేస్తుండటంతో కావేరి వాగులో నీటి ఉదృతి అధికమైంది. ప్రస్తుతం ఆ డ్యామ్‌ నీటిమట్టం 120 అడుగులకు చేరువలో ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా డ్యాంలో నీరు అధికంగా ప్రవేశిస్తుండటంతో అదనపు జలాలను విడుదల చేస్తున్నామన్నారు. మేట్టూరు డ్యాం(Mettur Dam) జలాల కారణంగా కావేరి వాగులో వరద నెలకొంది. సేలం, ఈరోడ్‌, నామక్కల్‌, కరూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. కావేరి(Kaveri) వరద కారణంగా నామక్కల్‌ జిల్లా కుమారపాళయం సమీపంలోని మనిమేఘలై వీధి, ఇందిరానగర్‌ ప్రాంతాల్లోని 50 ఇళ్లు నీటమునిగాయి. ఇదేరీతిలో పళ్ళిపాళయంలోనూ 50 ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


రాశిపురంలో కుండపోత...

నామక్కల్‌ జిల్లా రాశిపురం పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సుమారు మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రాశిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చొరబడింది. దీంతో ఆ వార్డుల్లో ఉన్న రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఇదే విధంగా రాశిపురం కొత్త బస్టాండు ప్రాంతం కూడా జలమయమైంది. ఇక కోయంబత్తూరు, నీలగిరి(Nilgiris) జిల్లాల్లోనూ ఆదివారం అర్ధరాత్రి, సోమవారం వేకువజామున వర్షం కురిసింది.  నీలగిరి జిల్లా ఊటీ తదితర ప్రాంతాల్లో రహదారులపై మట్టి పెళ్ళలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయంబత్తూరులోని గాంధీపురం, ఉక్కడం, పాప్పనాయకన్‌పాళయం, రామనాథపురం, గాంధీ నగర్‌(Gandhi Nagar) ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. తిరుప్పూరు, తిరునల్వేలి, మైలాడుదురై, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలోనూ సోమవారం వేకువజామున చెదురుముదురుగా వర్షాలు కురిశాయి.

Updated Date - 2022-08-30T15:33:27+05:30 IST