Chennai నగరాన్ని ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2021-11-19T13:56:16+05:30 IST

రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైని వర్షం మళ్లీ ముంచెత్తింది. ఓ వైపు తీవ్రరూపం దాల్చిన ఈశాన్య రుతుపవనాలు, మరో వైపు తీరం వైపు దూసుకొస్తున్న తాజా వాయుగుండం కారణంగా గురువారం ఉదయం

Chennai నగరాన్ని ముంచెత్తిన వర్షం

                - డెల్టా జిల్లాల్లోనూ భారీ వర్షం.. మునిగిన పంటలు

                - 6 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు


చెన్నై: రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైని వర్షం మళ్లీ ముంచెత్తింది. ఓ వైపు తీవ్రరూపం దాల్చిన ఈశాన్య రుతుపవనాలు, మరో వైపు తీరం వైపు దూసుకొస్తున్న తాజా వాయుగుండం కారణంగా గురువారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మళ్ళీ స్తంభించింది. రహదారుల్లో వర్షపు నీరంతా వెల్లువలా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈనెల 7వ తేదీ కురిసిన కుంభవృష్టికి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వర్షబాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన నివారణ చర్యల కారణంగా గత మూడు రోజులుగా నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ లోపున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీరం వైపు కదలుతుండటంతో మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గురువారం వేకువ జామున చిరుజల్లులతో ప్రారంభమైన ఈ వర్షం ఉదయం తొమ్మిది కల్లా జడివానగా మారింది. రహాదారులు, పల్లపు ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయి. గురువారం నుంచి భారీగా వర్షాలు కురుస్తా యని వాతావరణ పరిశోధన కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడంతో యాభై శాతానికి పైగా నగరవాసులు ఇంటిపట్టునే గడిపారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు ఈ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో గమ్యస్థానం చేరుకోలేకపోయారు. రహదారుల్లో అడగులోతున వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. పలుచోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. సెంట్రల్‌స్టేషన్‌ ప్రాంతం, ఎగ్మూరు, పురుషవాక్కం, అన్నానగర్‌, ప్యారీస్‌ కార్నర్‌, మైలాపూరు, అన్నానగర్‌, కోడంబాక్కం, వడపళని, కోయం బేడు, సైదాపేట, తేనాంపేట, మాధవరం, పెరంబూరు తదితర ప్రాంతాల్లో వర్షపునీరు వరదలా ప్రవహించాయి. పూందమల్లి, మధురవాయల్‌, తాంబరం, సేలయూరు, వేళచ్చేరి, పులుదివాక్కం, పల్లావరం తదితర ప్రాంతంలో ఉదయం నుంచే భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా నగరంలో విద్యుత్‌ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సిటీ బస్సులన్నీ తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులతోనే నడిచాయి. పలు రహదారుల్లో ద్విచక్రవాహనాలు వాననీటిలో కదలకుండా మొరాయిం చాయి. గురువారం మధ్యాహ్నం కాస్త తెరపి ఇచ్చిన వర్షం సాయంత్రానికి మళ్ళీ జడివానగా మారింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరమంతటా చీకట్లు అలముకున్నాయి. పగటిపూటే లైట్లు వేసుకుని కార్లు, మోటారు బైకులు నడపాల్సి వచ్చింది.



 విద్యాసంస్థలకు నేడు సెలవు

వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో చెన్నై సహా ఐదు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వు జారీ చేశారు.


24 జిల్లాల్లో వర్షం

ఈశాన్య రుతుపవనాల ప్రభావం, వాయుగుండం కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తిరుప్పూరు, తెన్‌కాశి, దిండుగల్‌, తేని, తిరుచ్చి, కడలూరు, కన్నియాకుమారి సహా 24 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన తిరుప్పూరులో కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరదనీటిలో చిక్కుకున్న 11 మందిని అగ్నిమాపకదళం సభ్యులు కాపాడారు. తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు భారీగా వర్షాలు కురిశాయి. తూత్తుకుడిలో పిడుగుపడటంతో శక్తి సెల్వం (18), మారి సెల్వం (43), సుబ్రమణియన్‌, సుశీల్‌, ముత్తువేల్‌ (18), గణేశ్‌ (28) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుప్పూరులో కురిసిన వర్షాలకు పలు ఆలయాల్లో వర్షపు నీరు చొరబడింది. అరియలూరు జిల్లాల్లో జయంకొండం, సెందురై, ఆండిమఠం తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వర్షాలు కురిశాయి. లక్ష ఎకరాలకు పైగా వరిపంటలు నీట మునిగాయి. వేలూరు జిల్లాలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గురువారం ఉదయం వరకూ చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. రాణిపేట, తిరుపత్తూరు జిల్లాల్లో గురువారం ఉదయం కుండపోతగా వర్షాలు కురిశాయి. అరక్కోణం, కావేరిపాక్కం, వాలాజాబాద్‌, షోళింగర్‌, ఆర్కాడు తదితర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి.


పాలారు వరదలో కూలీ గల్లంతు

కాంచీపురం సమీపం పాలారు వరద నీటిలో ఓ కూలీ కార్మికుడి గల్లంతయ్యాడు. పెరుంబాక్కంకు చెందిన పచ్చయప్పన్‌ (40) అనే కూలీ కార్మికుడు బుధవారం సాయంత్రం పాలారు కల్వర్టుపై నడిచివెళుతుండగా వరదనీటి ప్రవాహంలో జారిపడ్డాడు. కాసేపటికి వెల్లువలో కొట్టుకుపోయాడు. అగ్నిమాపకదళం సభ్యులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


నీట మునిగిన 70 వేల ఎకరాల వరిపంట

డెల్టా జిల్లాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు కురిసిన వర్షాలకు 70 వేల ఎకరాలకు పైగా వరిపంటలు నీట మునిగాయి. తంజావూరు, పట్టుకోట, ఒరత్తనాడు ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న 50 వేల ఎకరాల వరిపంటలు వర్షపునీటిలో మునిగినట్టు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా తిరువారూరు జిల్లా నన్నిలం, వలంగైమాన్‌ తదితర ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల వరిపంట వాననీటిలో మునిగింది.



Updated Date - 2021-11-19T13:56:16+05:30 IST