Chief Minister: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-09-14T12:43:59+05:30 IST

వర్షాకాల సమయంలో అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో

Chief Minister: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

- ‘ఈశాన్యం’పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష 

- పాల్గొన్న అన్ని శాఖల కార్యదర్శులు 


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 13: వర్షాకాల సమయంలో అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు సహా అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి యేటా అక్టోబరులో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి మూడు నెలల పాటు కొనసాగుతాయి. అక్టోబరు ప్రారంభం కావడానికి మరో పక్షం రోజులే ఉంది. దీంతో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు, వాటివల్ల ఏర్పడే వరద ముప్పును ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇందుకోసం ముందుగా తీసుకోవాల్సిన చర్యలు? వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల సమయంలో చెన్నై నగరం(Chennai city) నీటిలో మునిగిపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకునేలా సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే, ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు తీరు, ప్రస్తుతం  ఏ దశలో ఉన్నాయి, శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, 110 నిబంధన కింద చేసిన ప్రకటనలు, కొత్త పనుల పనితీరు తదితర అంశాలను ఆయా శాఖల కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గత యేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. నీటి నిల్వ ప్రాంతాల్లో సీఎం స్వయంగా పర్యటించి వర్షపునీటిని తక్షణం తొలగించేలా అధికారులను ఆదేశించారు. 2022లో ఈశాన్య రుతుపవనాల సమయంలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

Updated Date - 2022-09-14T12:43:59+05:30 IST