కన్నీటి వాన

ABN , First Publish Date - 2021-11-20T06:50:38+05:30 IST

వాయుగుండం రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది.

కన్నీటి వాన
హంసలదీవి ప్రాంతంలో నీట మునిగిన పొలాలు

అన్నదాతలకు వరుస కష్టాలు

భారీవర్షాలతో నేలకొరిగిన వరి

2.38 లక్షల హెక్టార్లలో వరి సాగు

2,500 హెక్టార్లలో మాత్రమే కోతలు పూర్తి

సముద్రతీర ప్రాంతాల్లో నీట మునిగిన పైరు


వాయుగుండం రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. భారీ వర్షాలకు బలమైన గాలులు తోడవడంతో చేతికొచ్చిన వరి పైరు నేలకొరిగింది. తీర ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షం కారణంగా పంట చేలు అత్యధిక శాతం నీట మునిగాయి. పశ్చిమ కృష్ణాలో రెండో తీత దశలో ఉన్న పత్తిని వర్షం దెబ్బ తీసింది. చెరుకు క్రషింగ్‌కూ వర్షం ఆటంకంగా మారింది. మామిడి తోటలకు మినహా అన్ని పంటలకూ ఈ అకాల వర్షాలు నష్టాన్నే మిగిల్చనున్నాయి.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగయింది. ఇందులో కొంత భాగం పాలు పోసుకునే దశలో ఉండగా, మరికొంత పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచే వరికోతలు ప్రారంభం కావాల్సి ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతులు అత్యధికులు కోతలు వాయిదా వేశారు. దీంతో ఇప్పటివరకు 2,500 హెక్టార్లలోనే వరికోతలు పూర్తయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముసునూరు, గన్నవరం, కంకిపాడు, పెడన, మచిలీపట్నం, పామర్రు, ఉంగుటూరు, తదితర మండలాల్లో వరి పైరు నేలకొరిగింది. పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయింది. డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండటంతో పొలాల్లోని నీరు వేగంగా బయటకు మళ్లడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నీట మునిగిన వరి కంకుల నుంచి మొలక వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత జిల్లాలో పంటనష్టం అంచనాల నివేదికలను తయారు చేసి, ప్రభుత్వానికి పంపుతామని  వ్యవసాయశాఖ  జేడీ టి.మోహనరావు తెలిపారు. 


చెరుకు క్రషింగ్‌లో జాప్యం

జిల్లాలో 4,834 హెక్టార్లలో ఈ ఏడాది చెరుకు సాగు జరగ్గా, వర్షాల కారణంగా క్రషింగ్‌ ప్రారంభానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నరికిన చెరుకును పొలం నుంచి బయటకు తీసుకురావాలంటే నేల పూర్తిగా ఆరాలని, ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందని రైతులు చెబుతున్నారు. 


అవనిగడ్డలో 74.2 మిల్లీ మీటర్ల వర్షపాతం 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటే సమయంలోనూ, దాటిన తరువాత కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతంలో వర్షం కుండపోతగా కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు అవనిగడ్డలో 74.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, నందిగామలో అత్యల్పంగా 1.0 మిల్లీమీటర్లు నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 11.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. నాగాయలంకలో 46.8,  మచిలీపట్నంలో 40.8, కోడూరులో 39.2, పామర్రులో 32.4, మోపిదేవిలో 27, చల్లపల్లిలో 26.8, ఘంటసాలలో 25.4, గూడూరులో 18.4, బంటుమిల్లిలో 18.2, మిగిలిన ప్రాంతాల్లో 18 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.


పత్తి రైతులకూ వర్షం దెబ్బ

పశ్చిమ కృష్ణా ప్రాతంలో ఈ ఏడాది  37,376 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మొదటిదశ పత్తి తీత పూర్తయింది. రెండో దశ తీత మొదలవుతోంది. ఈ దశలోనే నాణ్యమైన పత్తి, అధిక దిగుబడి వస్తుంది. ఇంతలోనే భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి రంగుమారే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


తీరంలో నీట మునిగిన పంట

కోడూరు : వాయుగుండం ప్రభావంతో గురువారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం వరిని ముంచేసింది. కోడూరు మండలంలోని ఎగువ ప్రాంతంలో పైరు నేలకొరిగిపోగా, దిగువ ప్రాంతమైన దింటిమెరక, హంసలదీవి, పాలకాయితిప్ప ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వరుసగా రెండో సంవత్సరం కూడా చేతికొచ్చిందనుకున్న పైరును వర్షం పొట్టనపెట్టుకోవడంతో అన్నదాతలు నష్టాల ఊబిలో కురుకుపోతున్నారు. 



Updated Date - 2021-11-20T06:50:38+05:30 IST