ఆగమాగం..

ABN , First Publish Date - 2021-10-18T04:32:22+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరి, పత్తి పంటలు నీటమునిగాయి.

ఆగమాగం..
చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌లో నీట మునిగిన వరిపంట

 మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం!

 నీటమునిగిన వరి, పత్తి పంటలు  

 వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి  పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కోతకు వచ్చిన  పంటలు వర్షానికి దెబ్బతినడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలిగింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల కల్లాల వద్ద ఆరబోసిన వరి కుప్పలు తడిశాయి. కొల్చారం, నర్సాపూర్‌, టేక్మాల్‌, అల్లాదుర్గం, శివ్వంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్‌ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్‌ జిల్లాలోనే వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే శనివారం కురిసిన వర్షానికి పంట నష్టం జరగలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 


మెదక్‌ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు


మెదక్‌ జిల్లాలో శనివారం కురిసిన వర్షాలకు అత్యధికంగా చిల్‌పచెడ్‌ మండలంలో 102.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పాపన్నపేట మండలంలో 10 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కొల్చారంలో 78.3 మి.మీ., నర్సాపూర్‌లో 75.8 మి.మీ., టేక్మాల్‌లో 73.2 మి.మీ., అల్లాదుర్గంలో 58.6 మి.మీ., శివ్వంపేటలో 58.4 మి.మీ., చిన్నశంకరంపేటలో 57.2 మి.మీ., చేగుంటలో 56.8 మి.మీ., పెద్దశంకరంపేటలో 53.6మి.మీ., మనోహరబాద్‌లో 53.3మి.మీ., వెల్దుర్తిలో 38.4మి.మీ., హవేళీఘనపూర్‌లో 38.2 మి.మీ., మాసాయిపేటలో 36.5 మి.మీ., కౌడిపల్లిలో 34.2 మి.మీ., మెదక్‌లో 30.4 మి.మీ., రేగోడ్‌లో 30.0మి.మీ., తూప్రాన్‌లో 27.8 మి.మీ., నార్సింగిలో 26.8 మి.మీ., రామాయంపేటలో 12.6 మి.మీ., నిజాంపేటలో 12.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 




పలు మండలాల్లో


కొల్చారం: అకాల వర్షంతో కొల్చారం మండలంలో వరి, పత్తి పంటలు నేలకొరిగాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. యనగండ్ల మాందాపూర్‌, పైతర, తుక్కాపూర్‌, కోనాపూర్‌, రంగంపేట, సంగయ్యపేట గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. 

 తూప్రాన్‌రూరల్‌: తూప్రాన్‌ మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి కిష్టాపూర్‌, నర్సంపల్లి, నాగులపల్లి గ్రామాల్లో రైతులు రోడ్లపైన ఆరబెట్టుకున్న మక్కలు, ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కూరగాయల తోటల్లో నీళ్లు నిలిచాయి. వరిపంటలకు ఎలాంటి నష్టం జరగలేదు. 

పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట పాత గ్రామపంచాయతీ వీధిలో మురుగు కాలువల నీరు రహదారిపై ప్రవహించింది. పలు అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి. 

 చిన్నశంకరంపేట: మండలంలో రోడ్లు, పంటలు జలమయమయ్యాయి. 

 వెల్దుర్తి: మండలంలో గంట పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం రైతన్నలకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మాణెపల్లి గ్రామంలో వరిపంట నేలకొరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఉదయాన్నే పొగమంచు వెల్దుర్తి పట్టణాన్ని ముంచేసింది. ఓ వైపు వర్షం, మరోవైపు పొగమంచుతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

 చిల్‌పచెడ్‌: మెదక్‌ జిల్లాలో చిల్‌పచెడ్‌ మండలంలోనే అధిక వర్షం కురవడంతో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. 

 శివ్వంపేట: చేతికొచ్చిన వరిపంట అకాలవర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలో కౌలు రైతు అరిగే వెంకటేశ్‌  పండిస్తున్న వరి అకాలవర్షంతో నేలకొరిగింది. 




సిద్దిపేట జిల్లాలో కుండపోత వర్షం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్‌ మండలంలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెజ్జంకి, కోహెడ, తొగుట, రాయపోల్‌, దౌల్తాబాద్‌, గజ్వేల్‌, కొండపాక, చేర్యాల మండలాల్లోనూ 30 మి.మీ.లకుపైగా వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా 23.9 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ వర్షకాలంలో 661 మి.మీ.ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 1201.8మి.మీ.ల వర్షపాతం నమోదు కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే 200మి.మీ.ల వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యాములలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 


వరి కోతలకు బ్రేక్‌


వర్షాల ప్రభావంతో జిల్లాలో వరికోతలపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 3.14 లక్షల ఎకరాల్లో ఈసారి వరిసాగు చేశారు. జూన్‌ ఆరంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు వరినాట్లు వేశారు. మొదట్లో నాటు వేసిన వరిపంట ప్రస్తుతం కోతకు వచ్చింది. ప్రస్తుత వర్షాలు వరికోతలకు ప్రతికూలంగా మారాయి. దీంతో వారం పాటు బాగా వర్షం కురిసిన చోట కోతల దిశగా ఆలోచన చేయకుండా ఉంటేనే మంచిదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 


తొగుట మండలంలో


తొగుట: తొగుట మండలంలో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికందే దశలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


 


Updated Date - 2021-10-18T04:32:22+05:30 IST