భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-07-17T17:15:43+05:30 IST

రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఉడుపి, దక్షిణకన్నడ,

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

- ఇంకా వణుకు పుట్టిస్తున్న భారీ వర్షాలు 

- కొడగులో అయ్యప్పకొండకు పగుళ్లు 

 - సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది తరలింపు 


బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఉడుపి, దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ జిల్లాల్లో ఇంకా వానలు కురుస్తూనే ఉన్నాయి. దక్షిణకన్నడ జిల్లాలోని బోళూరు, కాపికాడ్‌ ప్రాంతాల్లో చెట్లు కూలడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. మలవంతగి గ్రామం బల్లరాయనదుర్గ ప్రాంతంలో భూమి కుంచించుకుపోవడంతో అక్కడ నివసించే 16 కుటుంబాలు భయభ్రాంతులకు గురయ్యాయి. దీంతో వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. 30కు పైగా విద్యుత్‌లైన్లు కూలాయి. సుబ్రహ్మణ్య, సుళ్య, బంట్వాళ ప్రాంతాల్లో రోడ్లపై సంచారం కూడా సాధ్యం కావడం లేదు. తీరప్రాంత జిల్లాల్లో మరో నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈనెల 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాఖ సూచించిన మేరకు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణకన్నడ జిల్లా అధికారి మూల్కి గ్రామంలో బస చేసి సమీప ప్రాంతాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకాలో 4, కార్కళ 1, బైందూరు 3, ఉడుపిలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆగుంబె ఘాట్‌ 3వ మలుపు వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై తొలగింపు చర్యలు చేపట్టారు. కొడగు జిల్లాలో ఓవైపు ఎడతెరిపినివ్వని వర్షాలు, మరోవైపు మట్టిచరియలు విరిగిపడుతున్న కారణంగా 174 కుటుంబాలకు చెందిన 556 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి సౌలభ్యాలు అందిస్తున్నట్టు జిల్లా అధికారి డాక్టర్‌ బీసీ సతీశ్‌ తెలిపారు. కేరళ, కర్ణాటక సరిహద్దు రహదారి విరాజ్‌పేట - మాకుట్ట రోడ్డు పడవుంబాడి వద్ద చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఉడుపిలో సాధారణంగా ఏటా 1860 మి.మీ. వర్షం కురుస్తుంది. ఈసారి జూలై నాటికే 2,460 మి.మీ. వర్షం కురిసినట్టు అధికారులు ప్రకటించారు. సాధారణం కంటే ఇది 32 శాతం అధికమని, దక్షిణకన్నడలో 1646 మి.మీ. వర్షం సాధారణం కాగా ఇప్పటి వరకు 2,161 మి.మీ. వర్షం నమోదు కాగా 31శాతం అధికమని తెలిపారు. చిక్కమగళూరు జిల్లా చార్మాడిఘాట్‌లో కొండ చరియలు విరిగిపడ్డంతో వాహనాల రాకపోకలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. దావణగెరె, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కర్ణాటక జిల్లాల్లోనూ వర్షాల హోరు సాగుతోంది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన భవాని అనే మహిళ మృతి చెందడంతో అంత్యక్రియలకు శ్మశానవాటికకు వెళ్లారు. వర్షం హోరు సాగుతుండడంతో టార్పాల్‌ అడ్డుగా ఉంచి చితికి నిప్పు పెట్టారు. బెళగావి జిల్లాలో వర్షాలధాటికి విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. సవదత్తి తాలూకా హిరూరు గ్రామంలోని చెరుకుతోటలో విద్యుత్‌తీగలు తెగిపడ్డాయి. గమనించని రైతులు పకీరప్ప చందరగి (54), మహదేవ మేత్రి (40) విద్యుత్‌షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. చిక్కమగళూరు జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే మంత్రి బైరతి బసవరాజ్‌ శనివారం పలు గ్రామాలను సందర్శించారు. మూడిగెరె నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వర్షంతో నష్టపోయిన రైతులను, ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. కాగా బీదర్‌ జిల్లా ఔరాద్‌, కమలనగర్‌ తాలూకాలో మంత్రి ప్రభు చౌహాన్‌ పలు గ్రామాలను సందర్శించారు. ఇంటిగోడలు కూలిన బాధితులకు రూ.10వేల పరిహారాన్ని అప్పటికప్పుడు అందించారు. 

Updated Date - 2022-07-17T17:15:43+05:30 IST