Heavy rains: కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం

ABN , First Publish Date - 2022-08-07T17:28:06+05:30 IST

నైరుతి రుతుపవనాలకు అల్పపీడన(low pressure) ప్రభావం కూడా తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రళయాన్ని తలపించేలా కుంభవృష్టి కురుస్తోంది. 19

Heavy rains: కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం

- 19 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం

- వారాంతపు ప్రయాణాలు మానుకోవాలని అధికారుల హెచ్చరిక

- కోవిడ్ లోనూ వరద పరిస్థితిపై అధికారులతో సీఖం సమీక్ష

- భారీ వర్షాలకు నెలలో 64 మంది బలి

- రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ 


బెంగళూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలకు అల్పపీడన(low pressure) ప్రభావం కూడా తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రళయాన్ని తలపించేలా కుంభవృష్టి కురుస్తోంది. 19 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. నదులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. మలెనాడు, కరావళి ప్రాంతాలతోపాటు బయలుసీమ, కల్యాణ కర్ణాటక ప్రాంతాలలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది. భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్న అనేక జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. మండ్య, చామరాజనగర జిల్లాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఉడుపి, దక్షిణకన్నడ, కొడగు జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిందని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ నగరంలో శనివారం మీడియాకు తెలిపారు. కాగా జలపాతాల వీక్షణకు ప్రస్తుతం వెళ్లొద్దని, వీకెండ్‌ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని మంత్రి అశోక్‌(Minister Ashok) ప్రజలకు సూచించారు. అనేక జలపాతాలు, రిజర్వాయర్‌(Reservoir)ల వద్ద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడం వల్ల అప్రమత్తత పాటించాలని ఇప్పటికే చేరుకున్న పర్యాటకులకు సూచించారు. కాగా రాజధాని బెంగళూరులోనూ శనివారం పలు ప్రాంతాల లో భారీ వర్షం కురిసింది. 


వరద పరిస్థితిపై సీఎం సమీక్ష

కొవిడ్‌ బారిన పడిన సీఎం బసవరాజ్‌ బొమ్మై హోం క్వారంటైన్‌లో ఉంటూనే శనివారం భారీ వర్షాలతో అట్టుడికిపోతున్న ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించారు. ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, కొడగు, శివమొగ్గ, హాసన్‌, మండ్య, మైసూరు, దావణగెరె, తుమకూరు, రామనగర, యాదగిరి, కొప్పళ, హావేరి, బీదర్‌, కలబురగి, గదగ్‌, చిక్కమగళూరు జిల్లా అధికారులతో సీఎం వీడియో సదస్సు ద్వారా చర్చలు జరిపారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరిన్నిరోజులు పూర్తిస్థాయి అప్రమత్తత పాటించాలన్నారు. కొవిడ్‌ కారణంగా తాను స్వయంగా ప్రజలను కలవలేకపోతున్నానన్నారు. ప్రత్యేకించి ఉన్నతాధికారులను వర్షపీడిత ప్రాంతాలలో మకాం వేసేలా చూడాలని సూచించారు. భారీ వర్షాలతో అట్టుడికిపోతున్న కర్ణాటక(Karnataka)లోని జిల్లాల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్‌లో శనివారం సీఎంను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని కూడా ఇదే సందర్భంగా పరామర్శించారు. 

Updated Date - 2022-08-07T17:28:06+05:30 IST