Heavy rains: మళ్లీ ‘ఉగ్ర కావేరి’

ABN , First Publish Date - 2022-08-09T14:48:31+05:30 IST

కావేరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటకలో

Heavy rains: మళ్లీ ‘ఉగ్ర కావేరి’

- జలదిగ్బంధంలో గ్రామాలు

- నీటమునిగిన తోటలు

- మరో నాలుగు రోజులు వర్షాలు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 8: కావేరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల(Heavy rains) కారణంగా ఆ రాష్ట్రంలోని కబిని, కృష్ణరాజసాగర్‌ డ్యాంల నుంచి కావేరి నదిలోకి అదనపు జలాలు విడుదల చేస్తున్నారు. అలాగే, నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నాలుగు రోజుల కిత్రం సేలం జిల్లా మేట్టూరు డ్యాం 2.10 లక్షల ఘనపుటడుగులుగా వస్తున్న నీరు ఆదివారం 1.10 లక్షల ఘనపుటడుగులకు తగ్గింది. మేట్టూరు డ్యాం(Mettur Dam) గత 20 రోజులుగా పూర్తి సామర్ధ్యం 120 అడుగులకు చేరుకోవడంతో డ్యాంలోకి వస్తున్న నీటిని అలాగే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, కావేరి నదితీరంలోని 8 జిల్లాల్లో వరదలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం మేట్టూరు డ్యాంలోకి నీటి రాక క్రమక్రమంగా పెరిగి 1.60 లక్షల ఘనపుటడుగులకు నీటి చేరుతుండడంతో ఆ నీటిని అలాగే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.


నీలగిరి జిల్లాలో కొనసాగుతున్న కుండపోత...

నీలగిరి జిల్లాలో భారీవర్షాలు(Heavy rains) కొనసాగుతున్నాయి. కూడలూరు, పందలూరు, ఊటీ, కుంద పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని నాలుగు తాలూకాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కూడలూరు సమీపంలోని పురమనవయల్‌ ఆదివాసీ గ్రామంలో నీరు చేరడంతో అక్కడి 66 కుటుంబాలను అధికారులు ప్రత్యేక శిబిరాలకు తరలించారు. అలాగే, పందలూరు పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. జిల్లాలో గడచిన 24 గంటల్లో దేవాలలో 19 సెం.మీ, కూడలూరులో 18, పందలూరులో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పేచ్చిపారై, పెరుంజాణి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని నదులను 24 గంటలు పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


11వరకు మోస్తరు వర్షాలు...

రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూర్‌, తేని, దిండుగల్‌, తిరుప్పూర్‌, తెన్‌కాశి, తిరునల్వేలి, విరుదునగర్‌, కన్నియాకుమారి, ఈరోడ్‌, కరూర్‌, మదురై సహా ఉత్తరాది జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈ నెల 11వ తేది వరకు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.


నీటిలో తీరప్రాంత గ్రామాలు..

మేట్టూరు డ్యాం నుంచి భారీగా విడుదల చేస్తున్న నీటిలో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొల్లిడం నదిలో కూడా భారీగా నీరు చేరుతుండడంతో అదనపు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. అరియలూరు సహా పలు తీరప్రాంత గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక, వరి సహా అరటి, మిర్చి, వంగ తదితర కూరగాయల తోటల్లో నీరు చేరింది. పంట కోల్పోయిన ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.



Updated Date - 2022-08-09T14:48:31+05:30 IST