మరో వాయు‘గండం’

ABN , First Publish Date - 2021-11-15T06:54:41+05:30 IST

జిల్లాను భారీవర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు.

మరో వాయు‘గండం’

18న తీరందాటే అవకాశం

కోస్తాతీరానికి 17, 18 తేదీల్లో భారీవర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలతో రైతుల్లో వణుకు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాను భారీవర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు.   వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నాలుగైదు రోజులుగా భారీవర్షాలు కురిశాయి. ప్రస్తుతం వరిపైరు ఈత, కోత దశలో ఉంది. ఇప్పటి వరకూ కురిసిన వర్షాల నుంచి రైతులు కొంత వరకూ బయటపడ్డారు. అయితే సోమవారం మరో వాయుగుండం ఏర్పడుతుందని, అది ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోనే తీరాన్ని తాకుతుందనే వాతావరణ హెచ్చరికలు జిల్లా రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. వాతావర ణశాఖ హెచ్చరికలతో 1977 నవంబరు 19న సంభవించిన తుఫాన్‌ను జిల్లా ప్రజలు తలచుకుని భయపడుతున్నారు. 


వరి కోతలకు రైతులు సమాయత్తం 

జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్‌ వరి సాగు జరిగింది. ఇప్పటివరకు సుమారు 20వేల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉంటే వరికోతలు కోసేందుకు రైతులు సమాయాత్తమవుతున్నారు. మరో వాయుగుండం హెచ్చరికలతో వరికోతలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


భారీవర్ష సూచన 

 సోమవారం ఏర్పడే వాయుగుండం కారణంగా కోస్తా తీరం వెంబడి  రెండు మూడు రోజులపాటు ఒక మోస్తరు నుంచి, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. గూడూరులో అత్యధికంగా 38.8మిల్లీమీటర్లు, అత్యల్పంగా నందివాడలో 1.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 7.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.  ప్రస్తుత వర్షాలకు జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరి పొలాల్లో నీరు నిలిచింది. ఈ దశలో ఉబలమైన గాలులువీస్తే పైరు నేలకొరిగిపోతుందని, నీటిలో వరిపైరు రోజులతరబడి ఉంటే కంకులు మొలకెత్తుతాయని రైతులు భయపడుతున్నారు. 


అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్‌ 

వన్‌టౌన్‌, నవంబరు 14 : భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అధికారులు, సిబ్బంది ఈ నెల 18, 19 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ ఒక ప్రకటనలో సూచించారు. ఇదే సందర్భంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఎవరికీ సెలవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే సెలవులు పెట్టి ఉంటే రద్దు చేసుకుని విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయా లని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 


నేడు స్పందన రద్దు 

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే స్పందనను రద్దు చేస్తున్నట్టు ప్రక టించారు. 

Updated Date - 2021-11-15T06:54:41+05:30 IST