భారీ భద్రత గుప్పిట హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-06-30T10:16:36+05:30 IST

సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల

భారీ భద్రత గుప్పిట హైదరాబాద్‌

పరేడ్‌గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ వద్ద ఎస్పీజీ భద్రత.. 10 వేలకు పైగా పోలీసులు

ఎక్కడికక్కడ తనిఖీ.. ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు ఆందోళనలపై నజర్‌

144 సెక్షన్‌.. మోదీ కార్యక్రమాల వద్ద డ్రోన్‌ కెమెరాలపై నిషేధం

ఎస్పీజీ భద్రత వలయంలోకి పరేడ్‌గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ

10 వేల పోలీసులతో సిటీ కాప్స్‌ బందోబస్తు

ఎక్కడికక్కడ తనిఖీలు.. బహుళ అంచెల నిఘా

ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు 

ఆందోళనలపైనా నజర్‌

144 సెక్షన్‌.. డ్రోన్‌ కెమెరాలపై నిషేధం

సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మోదీ పాల్గొనే వేదికల వద్ద భద్రత పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలోని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) గుప్పిట్లోకి వెళ్లగా.. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో.. ఆయన బస చేసే రాజ్‌భవన్‌ వద్ద.. వేదికల సమీపంలో భారీ బందోబస్తు కోసం 10 వేల మంది పోలీసులను నియమించనున్నారు. ఇప్పటికే ఎస్పీజీ ఉన్నతాధికారి నవీన్‌ మెహతా నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌, మాదాపూర్‌ సమీపంలోని హెచ్‌ఐసీసీలకు చేరుకుని, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో ప్రధాని కార్యాలయం(పీఎంవో) తాత్కాలికంగా కొలువుదీరేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు, ఆర్మీ, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. అటు ఎస్పీజీ, ఎన్‌ఎస్జీ దళాలు పరేడ్‌గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ ప్రాంతాల్లో మోహరించాయి. వారికి అనుబంధంగా సీఆర్పీఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ బలగాలు.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పోలీసులు ఉంటారు. బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో నిరంతర తనిఖీలు జరుపుతున్నారు. మోదీ కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు, రాజ్‌భవన్‌ సమీపంలోని ఎత్తైన భవనాల పైనుంచి కూడా ‘రూఫ్‌టాప్‌’ నిఘాను ఏర్పాటు చేశారు.

పాసులు.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి

ప్రధాని సభల్లో పాల్గొనేందుకు వచ్చేవారికి పాసులు ఉండాలని అని ఎస్పీజీ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానిని కలిసే వారికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. పార్టీ తరఫున ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులు, కార్యకర్తల పేర్లతో కూడిన జాబితా ఇప్పటికే పోలీసులకు చేరింది. ఆ జాబితాలో ఉన్నవారిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌(ఎ్‌సబీ) పోలీసుల క్లీన్‌చిట్‌ ఉండాలని అధికారులు వెల్లడించారు.

డ్రోన్లకు అనుమతి లేదు.. 144 సెక్షన్‌

ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాల కవరేజీకి డ్రోన్‌ కెమెరాలకు అనుమతి లేదని ఎస్పీజీ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. దాంతో పాటు.. 144 సెక్షన్‌ను విధించారు. ఇవి శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఆందోళనలపైనే నజర్‌..!

ప్రధాని మోదీ రాక సందర్భంగా పలు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ఆయా వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఎమ్మార్పీఎస్‌ చీఫ్‌ మందకృష్ణ మాదిగ జూలై 2న సడక్‌బంద్‌, 3న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ఆందోళనల్లో హింసాత్మక ఘటనల చరిత్ర ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కూడా 2వ తేదీన బీజేపీ కార్యాలయ ముట్టడి, 3న ఇందిరాపార్క్‌ వద్ద మాలల మహాధర్నాకు పిలుపునిచ్చారు. వీటికితోడు.. ఈ నెల 17న అగ్నిపథ్‌ నిరసనలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అట్టుడకడం.. కాంగ్రెస్‌ పార్టీ తన కార్యాచరణను ప్రకటించనుండడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

మెట్రో రైల్‌ బంద్‌?

పరేడ్‌గ్రౌండ్‌ను ఆనుకుని ఉన్న ప్రధాన మార్గంలో మెట్రో రైలు రాకపోకలు సాగిస్తున్నందున.. ప్రధాని సభ ముగిసే వరకు వాటిరి బంద్‌ చేయాలని ఎస్పీజీ అధికారులు భావిస్తున్నారు. బుధవారం స్థానిక అధికారులతో సమీక్ష సందర్భంలో.. పలుమార్లు మెట్రోరైలు వెళ్లడాన్ని గమనించిన నవీన్‌ మెహతా.. ఈ ప్రతిపాదన చేశారు. అయితే.. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

====================

Updated Date - 2022-06-30T10:16:36+05:30 IST