మణుగూరు ఓసీ 2లో భారీ వాటర్‌ స్ర్పింక్లర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-25T06:01:28+05:30 IST

సింగరేణి కాలరీస్‌ భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని ఓసీ-2 బేస్‌ వర్క్‌ షాపులో దేశంలోనే అతిపెద్ద నీటిని వెదచిమ్మే యంత్రం (బాహుబలి వాటర్‌ స్ర్పింక్లర్‌) శుక్రవారం అందుబాటులోకి వచ్చింది.

మణుగూరు ఓసీ 2లో భారీ వాటర్‌ స్ర్పింక్లర్‌ ప్రారంభం
వాటర్‌ స్ర్పింక్లర్‌

  సామర్థ్యం 80వేల లీటర్లు.. దేశంలోనే అతిపెద్ద యంత్రం

 సంపూర్ణంగా వినియోగించాలి: ఈఎండ్‌ఎం జీఎం గోపాలకృష్ణమూర్తి

మణుగూరు, జూన్‌ 24 : సింగరేణి కాలరీస్‌ భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని ఓసీ-2 బేస్‌ వర్క్‌ షాపులో దేశంలోనే అతిపెద్ద నీటిని వెదచిమ్మే యంత్రం (బాహుబలి వాటర్‌ స్ర్పింక్లర్‌) శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. జపాన్‌లోకు చెందిన కోమట్స్‌ కంపెనీ తయారు చేసిన ఈ యంత్రం విడిభాగాలను ఇక్కడికి తీసుకువచ్చి జపాన్‌ కంపెనీ ఇంజనీర్లు.. స్థానిక బేస్డ్‌వర్క్‌ షాపు కార్మికులతో కలిసి అమర్చారు. ఈ యంత్రం వాటర్‌ స్ర్పింక్లర్‌గానే కాకుండా అగ్నిమాపకయంత్రంగా కూడా ఉపయోగపడనుంది. ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యంత్రాన్ని ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ విభాగం జీఎం గోపాలకృష్ణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి భారీ యంత్రాల సామర్థ్యాన్ని పూర్తి స్ధాయిలో వినియోగించుకుని సింగరేణి సంస్థ నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు. ఏరియా జీఎం జక్కం రమేష్‌ మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటివరకు 28వేలలీటర్ల సామర్థ్యం గల వాటర్‌ స్ర్పింక్లర్‌లు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం 80వేల లీటర్ల సామర్థ్యం గల స్ర్పింక్లర్‌ అందుబాటులోకి తెచ్చారని, అదీ తొలిసారి మణుగూరు ఏరియాలోని ఓసీ-2 గనికి కేటాయించారన్నారు. 25 మీటర్ల పరిధిలో నీటిని వెదజల్లడమే కాకుండా ఎగిసే దుమ్ము ధూళిని అరకట్టొచ్చన్నారు. రక్షణ సూత్రాలను పాటిస్తూ వాహానాలను నడపాలని, ఆపరేటర్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. జపాన్‌ కోమట్స్‌ కంపెనీ ప్రతినిధి యూసునోరి పుజి మాట్లాడుతూ శతాధిక చరిత్ర గల సింగరేణికి తమ సంస్థ నుంచి యంత్రాలను సరఫరా చేయడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘ నాయకులు ప్రభాకర్‌, ఏరియా ఎస్వోటూ జీఎం లలిత్‌ కుమార్‌, ఏజెంట్‌ నాగేశ్వరరావు, ఫిజ్‌ గెరాల్డ్‌, డి వెంకటేశ్వర్లు,  కోమాట్స్‌ దక్షిణ భారత ప్రతినిధులు జి.జయకుమార్‌, కె శ్రావణ్‌ కుమార్‌, కేఆర్‌ బాలభాస్కర్‌,  ప్రాజెక్టు జె.వీరభద్రుడు, మాలోత్‌ రాములు, రాంబాబు, డీజీఎం ఈఅండ్‌ఎం నర్సిరెడ్డి, రక్షణ అధికారి లింగబాబు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:01:28+05:30 IST