ప్రశ్నలు రాజేసి జవాబులివ్వని పోస్ట్‌మోడ్రన్‌ నవల

ABN , First Publish Date - 2022-05-16T06:31:18+05:30 IST

‘పెంపుడు జంతువులు’ పేరుతో కె.ఎన్‌.వై. పతంజలి వెలువరించిన నవలను చాలమంది చదివి ఉంటారు.

ప్రశ్నలు రాజేసి జవాబులివ్వని పోస్ట్‌మోడ్రన్‌ నవల

‘పెంపుడు జంతువులు’ పేరుతో కె.ఎన్‌.వై. పతంజలి వెలువరించిన నవలను చాలమంది చదివి ఉంటారు. నేనూ మరికొందరం చిరకాలంగా మాట్లాడుతున్న ‘ఉత్తరాధునిక’ వైఖరికి చక్కగా నప్పుతుంది ఈ నవల. అదెలాగో చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం. జర్నలిజం, జర్నలిస్టులు ఈ నవలకు వస్తువులు. జర్నలిజాన్ని పైపైన చూసినవాళ్లకుసైతం తెలిసిపోయే సంగతులే ఇందులో ఉన్నాయి. ఏదో జీవితం లోతుల్లోకి వెళ్లి వ్యాఖ్యానిస్తున్నట్టు రచయిత పోజుకొట్టడు. ఉత్తరాధునికులు ఇష్టపడే దైనందిన జీవితం (ఎవిరిడే లైఫ్‌) ఈ నవలకు ఒక నిరాడంబర సౌందర్యాన్ని కల్పిం చింది. నవలలోని పెంపుడు జంతువులు జర్నలిస్టులే. ఈ వ్యవస్థలోని అందరూ ఏదో మేరకు పెంపుడు జంతువులే. ఈ వ్యవస్థ పెంచుకుంటున్న జంతువులే. ఈ నవలలోని జర్నలిస్టులు ఒక ఉదాహరణ మాత్రమే.


నవలా రచయిత స్వయంగా జర్నలిస్టు. వారి బాధలు, గాథలు తెలిసిన వ్యక్తి. కథనం నుంచి, పాత్రల నుంచి ఉండాల్సినంత దూరంలో ఉండి రాసినప్పటికీ, రచయిత తనకు తెలిసిందే చెప్పారన్న స్ఫురణ చదువరికి అడుగడుగునా కలుగుతుంది. పాత్రలు, సంఘటనలు కల్పితమేమోగాని; స్థలకాలాలు కల్పితం కావు. పాత్రికేయ వృత్తితో పరిచయమున్నవాళ్ళు నవలలోని జీవితం ఎప్పటిదో, ఎక్కడిదో సులభంగా చెప్పగలుగుతారు. నేను ఇతర్లను అడిగిమరీ తెలుసుకున్న మేరకు పతంజలి ఈ నవలను 1982లో రాశారు. ఇది 1984లో సీరియలైజ్‌ అయ్యింది. ఒక మిత్రుడు చమత్కరించినట్లు... పతంజలి ‘న్యూస్‌ డెస్కులో సబ్‌ ఎడిటర్లకు వార్తలు రాసే పని అప్పజెప్పి, తను ఎంచక్కా నవల రాసేసిన’ మాట నిజమే అయ్యుంటుంది. ఆ వేడి, రణగొణ ధ్వని, అప్పుడప్పుడు డెస్కును ఆవరించే ఓ రకం నిశ్శబ్దం నవలలో కనిపిస్తాయి.


‘పెంపుడు జంతువులు’ని ఉత్తరాధునిక దృక్పథంలో పరామర్శించాలన్న నా ఉద్దేశాన్ని ఈ వ్యాసం మొదట్లోనే చెప్పాను. మార్క్సిజంలాగ, రేషనలిజంలాగ... ‘ఉత్తరాధునిక దృక్పథం’ అంటూ ఒక దృక్పథ చట్రం ఉన్నదని నేను అనుకోను. ఇటీవలి కాలంలో మానవ జీవితంలో వచ్చిన పెను మార్పులు కొన్ని ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రశ్నలు కొత్తవి కావు గాని, అవి ఇంత విస్పష్ట రూపం ధరించడం మాత్రం కొత్త పరిణామం. ఈ ప్రశ్నలలో అత్యధికం ఆధునికత (మోడర్నిజం) వైఫల్యాల నుంచి పుట్టుకొచ్చినవే. ఆ వైఫల్యాల లోంచీ, ‘ఇప్పటి’ అవసరాల లోంచీ పుట్టిన ఆలోచనలే ‘ఉత్తరాధునికత’.


ఆలోచన-నమూనా గురించి చెప్పాల్సి వస్తే, బహుశా, మార్క్సిజమే సరైన నమూనా అనుకుంటాను. ఆంటోనియో గ్రాంసీ, మావో జెడాంగ్‌ వంటి ఆలోచన పరుల దారిలో ఆలోచిస్తేనే ఎంతో కొంత వెలుగు. చిన్న వియత్నాం పెద్ద అమెరికాకు విజయవంతంగా విసిరిన సవాలు, యూనివర్సిటీ ఆధ్యాపకులతో పేడతట్టలు మోయించిన చైనా సాంస్కృతిక విప్లవం, 1968 జగద్వ్యాప్త యువజనోత్సాహం, అప్పటి మనుషులకు యవ్వనమిచ్చిన నక్సల్బరి... వీటి వెనుకనున్న ఆలోచన-పరికరాలు ఇప్పటికీ ఉపయోగకరం.


ప్రశ్నలను వెదజల్లడం ఉత్తరాధునిక వైఖరిలో అతిముఖ్య మైన విషయం. ప్రశ్నలు విత్తనాల వంటివి. ఇలా ప్రశ్నలను విత్తనాలుగా వాడుకునే ప్రక్రియను ‘సమస్యీకరణ’ (ప్రాబ్లెమైటై జేషన్‌) అనవచ్చు. సమాజంలో చాల విషయాలున్నాయి. వాటిలో ఇమిడివున్న ‘సమస్య’లేమిటో గుర్తించకుండా జీవించే స్తుంటాం. ఆలోచించకుండా జీవించేస్తుంటాం. విషయాలలో ఇమిడివున్న ‘సమస్యలను’ ముందుకు తెచ్చి, సమాజం ఆలో చించే విధంగా చేయడమే ‘సమస్యీకరణ ప్రక్రియ’. పతంజలి జర్నలిస్టుల్ని పెంపుడు జంతువులు అని దురుసుగా అనేసి జర్నలిజాన్ని సమస్యీకరించగలిగారు. నవల్లో మూడు ఉప-కథనా లున్నాయి. మూడింటిలోనూ పతంజలి దీన్ని సాధించగలిగారు.


ఉదాహరణకు, నవలలో గోపాలం ‘ఆంధ్రతేజం’ అనే ప్రసిద్ధ పత్రికలో  పెద్ద రిపోర్టరు. ఆయన అమితంగా ప్రేమించే చెల్లెలు రాధిక. ఆమె ‘ఆంధ్ర భారతి’ అనే మరో ప్రసిద్ధ పత్రిక రిపోర్టరు అవతారం భార్య. అవతారం తనకు తెలియ వచ్చిన ఒక వార్తను పత్రికలో వెలువరిస్తాడు. అతడికి బుద్ధి చెప్పడం కోసం పురుషోత్తం అనే పెత్తందారు గూండాలతో అవతారం భార్యను రేప్‌ చేయించి, చంపిస్తాడు. ఎవరు చేయించారో తెలిసి కూడా, సీనియర్‌ జర్నలిస్టు గోపాలం చెప్పిన తరువాత కూడా... పాత తరం సంపాదకుడు శేషశాయి ఆ వార్తను ప్రచు రించలేదు. ఈ సంఘటనల్ని, వీటి వల్ల గోపాలం, అవతారం మనస్సుల్లో రేగే తుపాన్లను, నొప్పిని, కసిని పతంజలి గొప్పగా చిత్రించాడు. ‘ఏదో చెయ్యాలని’ గోపాలం కసిగా సంకల్పించడాన్ని ఎస్టాబ్లిష్‌ చేశాడు. ఏంచెయ్యాలో, పరిష్కార మేమిటో చెప్పలేదు. ఇదొక నిష్ఫల క్రోధమని అనిపిస్తుంది. కాని, పాఠకుడి మనసులో పడిన విత్తనం నిష్ఫలంగా ఉండిపోదు.


‘ఆంధ్రభారతి’ సంపాదకుడు శేషశాయి త్వరలో రిటైర్‌ కాబోతున్నవాడు. జర్నలిస్టులు కొంత స్వేచ్ఛ అనుభవించిన కాలం నుంచి 1980 దశకానికి మిగిలిన అవశేషం. తన సంపాదకీయం తానే రాసుకోవాలని, పత్రికలో జర్నలిస్టుల నియామకాలు తొలగింపులు తన మాట మీద జరగాలనే ‘చాదస్తాలు’ ఉన్న వాడు. పత్రికాధిపతి ఉన్నట్టుండి సంపాదకీయం ఏ అంశంమీద ఎలా రాయాలో చెప్పడమేగాక, రాశాక తన ఆమోదం పొందాలని ‘చూపుడు వేలును తుపాకిలా చూపి’ చెప్పేసరికి చాల ఇబ్బందిపడిపోతాడు. అతడిలో ఈ వ్యథ చివరికంటా ఉండిపోతుంది. చివరికి తన దగ్గర పని చేసే రిపోర్టరు (అవతారం) భార్యను రేప్‌ చేయించి, చంపించిందెవరో తెలిసీ ఆ వార్తను ప్రచురించలేని దురవస్థకు చాల వాపోతాడు. ఈయనకు తోచే ముగింపు పత్రికనుంచి వైదొలగడమొక్కటే.


‘పెంపుడు జంతువులు’ నవల మొదట్లో లేవనెత్తిన ప్రశ్నలను రాను రాను బలపరుస్తుంది. నొప్పిని రాను రాను తీవ్రతరం చేస్తుంది. జవాబులు మాత్రం చెప్పదు. గోపాలం రిపోర్టరుగా కాకుండా మరో విధంగా (జర్నలిజం నుంచి బయటపడి) కసి తీర్చుకోవాలని అనుకుంటాడు. సంపాదకుడు శేషశాయి నిశ్శబ్దంగా తప్పుకోవాలనుకుంటాడు. తీవ్ర వాది అనిపించే ఒక సొంత చిరుపత్రిక సంపాదకుడు సుబ్రమణ్యంది మరో కథ. ఈయన వేడి పుట్టించినంతగా వెలుగును పుట్టించడు. కాస్త ఆవేశ భాషలో అదే నిష్ఫల క్రోథం. మొత్తం మీద నవల లేవనెత్తే ప్రశ్నలకు జవాబులు ‘జర్నలిజం’ అనే చట్రం పరిధిలో లేవు. దానికి పరిమితమైతే దొరకవు అనే స్ఫురణ కలుగుతుంది.


బహుశా; పురుషోత్తం అనే గుండా పెట్టుబడిదారుడు విసిరే సవాలులో ఈ ప్రశ్నలకు జవాబులు వెదుక్కోవాల్సి ఉంటుంది. ‘లంపెన్‌- పెట్టుబడి’ పునాదిపై పని చేసే సాంఘిక వ్యవస్థలో పత్రికా రంగమనే ఉప-వ్యవస్థ ఎలా ‘సమస్యా త్మకం’ అవుతుందో నవల శక్తిమంతంగా చెప్పగలిగింది.


ఏదైనా ఒక విషయాన్ని సమస్యీకరించాలంటే, దాని గురించి వాస్తవికంగా ఆలోచింపజేయాలంటే, ఆ విషయం చుట్టూ తయారైన ‘కాతి వలయాన్ని’ తొలగించాలి. అదొక పవిత్ర విషయం, దాన్ని ప్రశ్నించకూడదు అనే భావనను తొలగించాలి. పతంజలి తన నవలకు ‘పెంపుడు జంతువులు’ అని పేరు పెట్టడంతోనే ఆ పని కొంత జరిగిపోయింది. దాదాపుగా నవల ప్రారంభంలోనే సుబ్రమణ్యం చర్య ద్వారా ఆ పని మరింత బలంగా జరిగింది. సుబ్రమణ్యం ‘ఆంధ్ర భారతి’ మీద తన అభిప్రాయం చెప్పడానికి ఆ పత్రిక ఆఫీసుకు వెళ్తాడు. సెక్యూరిటీ సిబ్బందితో అతడి మాటల్లో జర్నలిజం చుట్టూ ఉన్న కాంతి వలయం (ఆరా, గ్లామర్‌ లేదా వేలర్‌) వెలవెలబోతుంది. ఆ సంభాషణ చివర పత్రిక మీద ఇదే తన అభిప్రాయమంటూ సుబ్రమణ్యం సెక్యూరిటీ ఆఫీసరు మొహం మీద ఖాండ్రించి ఉమ్మేయడంతో కాంతి వలయం భళ్లున పగిలిపోతుంది. 


ఆధునిక యుగంలో అన్ని వృత్తులకు ఉన్నట్లే పాత్రికేయ వృత్తికీ దాని చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. పత్రికా రంగానికి కొన్ని సూత్రాలు, విలువలతో (ఎతిక్స్‌) కూడిన అంతర్గత చట్రం ఉంటుందని అందరం అనుకుంటాం. అందులో పాత సూత్రాలు, విలువలు ‘ఇప్పుడు’ తగ్గిపోయాయని బాధపడతాం. ఒకప్పుడు ఉండేవని ఇష్టంగా ఆవేశంగా గుర్తు చేసుకుంటాం. ‘ఇప్పుడేదో తాత్కాలికంగా కాస్త ఇబ్బంది వచ్చిందిగాని అవి ఇప్పటికీ ఉంటాయ’ని అనుకుంటూ ఉంటాం. ఇదంతా ఒక సోషల్‌ మెకానిజం. మన మెదళ్ళను పాలించే భావజాలం (ఐడియాలజీ). ఇది పత్రికలకు పరిమితమైనది కాదు. సాంఘిక వ్యవస్థలను, ఆలోచన వ్యవస్థలను అవి చాల స్యయం-సంపూర్ణం, స్వతంత్రం అయినట్లుగా సంస్థీకరించడం (ఇన్‌స్టిట్యూషనలైజేషన్‌), అవి అనుల్లంఘనీయమైనట్లు పవిత్రీ కరించడం (క్యాననైజేషన్‌) ఆధునిక యుగ లక్షణం. యథాతథ స్థితి పరిరక్షణకు అదొక పట్టుగొమ్మ. వృత్తులను, ఆలోచనలను ‘వ్యవస్థలు’గా రూపొందించడం, కాపాడడమే ‘కాంతి వలయం’ ప్రయోజనం. ఎతిక్స్‌ అనబడేవి దానిలో భాగం. సమాజంలో భిన్న వ్యవస్థలమధ్య పేచీలు ఉంటాయి. ఒకే ‘వ్యవస్థ’లోని మనుషుల మధ్య పేచీలు ఉంటాయి. పేచీలకు మూలం ప్రయోజనాలు. స్వ-ప్రయోజనాలు. ఎవరికివారు వివాదాల్ని అనుకూలంగా మలచుకోడానికి ‘ఎతిక్సు’ని వాడుకుం టారు. బలవంతులు ఎతిక్సులో తమకు అడ్డమైనవాటిని గడ్డిపోచల్లా తన్నేస్తారు. వ్యవస్థ మనుగడ తమకు అవసరం కాబట్టి, పూర్తిగా తన్నేయరు. ఎతిక్సుతో కూడిన చట్రాన్ని, అస్థిపంజరంగానయినా, ఉండనిస్తారు. బలహీనులు సరే. వారు చివరికంటా ఎతిక్స్‌ను పట్టుకుని వేలాడుతుంటారు. సూత్రాలు, విలువలతో కూడిన ‘నిర్మాణ’మే వ్యవస్థను నడిపిస్తున్నదని భ్రమపడుతుంటారు.


నవలలో కాస్త క్రియాశీలంగా, అదే సమయంలో పాత ఎతిక్సు మీద గౌర వంతో నడిచే పాత్ర గోపాలం. ఇతడు సుమారు యాభై ఏళ్ల వాడై ఉండడం కాకతాళీయం కాదు. రచయిత ఉద్దేశించినదే. తాను అమితంగా ప్రేమించే చెల్లిని గూండాలు రేప్‌ చేసి, చంపితే అతడు పడే బాధ హృదయవిదారకం. ఆ పని చేయించిందెవ్వడో తెలిసీ, ఆ వార్తను రుజువులతో వెలువరించడం కోసం అన్ని ప్రయత్నాలు చేసి విఫలుడవుతాడు. అతడు నమ్మిన ఎతిక్సు అతడి ముఖం మీద వికటహాసం చేస్తాయి. ఎతిక్సు, విలువలు, సూత్రాలు ఏమీ లేవు. అవన్నీ బలవంతుడి, ధనవంతుడి పనిముట్లు అనే విషయాన్ని నవల వైలెంట్‌గా ప్రత్రిపాదిస్తుంది. ‘వ్యవస్థ’కు ఆపాదించబడిన ఔన్నత్యాన్ని, పవిత్రతను, ధీరత్వాన్ని (వేలర్‌ని) పగలగొట్టి లోపలి టెంకను... అదెలా ఉందో అలాగే చూపిస్తుందీ నవల.


నవల చాల నిరాశగా ముగుస్తున్నట్లు అనిపిస్తుంది. కథా కథనం మేరకు అది నిజం కూడా. వ్యవస్థ ఎంత పకడ్బందీగా నిర్మితమై ఉన్నా, దానిలో కొన్ని పగుళ్లు ఉంటాయి. నిరంకుశత్వాన్ని ఎదిరించి బతకదలచినవాళ్ళు అలా బతకడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలను ‘పెంపుడు జంతువులు’ నవల చూపించలేకపోయింది. నవలలో సుబ్రమణ్యం పాత్ర పలు రకాలుగా ఆసక్తి కలిగిస్తుంది. నక్సలైట్ల గురించి పాపులర్‌గా ఉన్న అభిప్రాయాలకు ఇదొక ప్రతీక అనవచ్చు. ఇతడూ ‘జర్నలిస్టే’. ‘చెవిలో జోరీగ’ అనే ఎప్పుడూ వెలువడని... పత్రిక సంపాదకుడు. అతడి పత్రికకు ‘న్యూసెన్స్‌’ అని అర్థం వచ్చే పేరును పతంజలి ఎందుకు పెట్టాడో చెప్పలేం. సుబ్రమణ్యం చాల తీవ్రంగా, లోతైన అవగాహనతో మాట్లాడుతాడు. కాని, ఈ పాత్ర న్యూసెన్సు సృష్టించినంతగా పనికొచ్చే పనులేమీ చేయదు. వీర ఉపన్యాసాలిస్తుందిగాని కార్యాచరణకు దిగదు. సమాంతర పత్రికలను నడిపించడం అసాధ్యమని పతంజలి చెప్పదలిచాడా? వాటిని నడిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పకడ్బందీగా నిర్మితమైన వ్యవస్థ నిర్మాణంలోని పగుళ్ళను వాడుకోడమంటే అదే. ఏదేమైనా హింసాత్మక విషాదానికి, కసికి దొరికిన ప్రాధాన్యం నవలలో ఆశకు, క్రియకు దొరకలేదు.


ఉత్తరాధునిక ఆలోచనలు అంటే ఉత్తరాధునిక సాంఘిక స్థితి (పోస్ట్‌ మోడర్న్‌ కండిషన్‌)ని వివరించే ప్రయత్నాలు. వ్యవస్థలకు ఆధునిక యుగం ఆపాదించిన పవిత్రీకరణ, ధీరత్వాల బండారాన్ని బయటపెట్టకుండా ఈ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఉన్నదాన్ని ఉన్నట్టు సెలబ్రేట్‌ చేసుకోవాలంటే ఈ మాత్రం డీవేలరైజేషన్‌ తప్పని సరి. ‘పెంపుడు జంతువులు’ నవల ఈ పనిని చాల బలంగా చేయగలిగింది. అదే సమయంలో మనుషుల మధ్య ప్రేమాను రాగాల్ని, స్నేహం, ఆప్యాయతల్ని శ్రుతి మించని రీతిలో హృద్యంగా వర్ణించడం వల్ల కథకు రక్తమాంసాలు చేకూరాయి. ఇదీ బతుకు. బతుకులో చాల అందాలున్నాయి. చాల మంచితనం ఉంది. వాటి కన్న బలంగా దుర్మార్గం ఉంది, దుస్వార్థం ఉంది. వీటి నుంచి బతుకును కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఆలోచించాలి. రచయిత మనకు బదులుగా ఆలోచించడు. మనకు మనం ఆలోచించుకోడానికి రచయిత ఒక ఫెసిలిటేటర్‌ మాత్రమే.


హెచ్చార్కె


Updated Date - 2022-05-16T06:31:18+05:30 IST