ఎత్తులు.. పైఎత్తులు

ABN , First Publish Date - 2021-11-12T05:55:44+05:30 IST

బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.

ఎత్తులు.. పైఎత్తులు

  1. గెలుపు కోసం టీడీపీ పావులు
  2. మొదలైన వైసీపీ బెదిరింపులు 


డోన్‌, నవంబరు 11: బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఎత్తులు.. పైఎత్తులతో అక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదపడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపుల పర్వానికి తెర లేపిందన్న విమర్శలు ఉన్నాయి. బేతంచెర్లలో స్థానిక ఎన్నికలు కొన్ని దశాబ్దాలుగా బుగ్గన కుటుంబానిదే ఆధిపత్యం సాగుతూ వస్తోంది. బేతంచెర్ల 1956లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి 1988 వరకు 32 ఏళ్ల పాటు సర్పంచుగా పని చేసిన బుగ్గన సుబ్బారెడ్డి ఒకసారి మినహా మిగతా 5 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బుగ్గన రామనాథ్‌ రెడ్డి సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 1995 నుంచి 2006 వరకు రెండుసార్లు సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత 2006, 2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఆయన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తన వ్యూహాలతో అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపడం ఆసక్తికరంగా మారింది. 


 ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వ్యూహాత్మకంగా సాగుతోంది. నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి జిల్లా పార్టీ నాయకత్వంతో కలిసి అభ్యర్థుల ను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బేతంచెర్లలో స్థానిక టీడీపీ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. దీంతో టీడీపీ నుంచి ఊహించని రీతిలో పోటీని అధికార పార్టీ ఎదుర్కొంటుందని చర్చ సాగుతోంది. 


అధికార పార్టీ బెదిరింపులు


అధికార పార్టీ బెదిరింపుల పర్వం అప్పుడే మొదలైంది. ఒక రైసు మిల్లులో పని చేసే కొంత మంది యువకులు టీడీపీ వైపు తిరుగుతున్నారు. ఆ యువకులకు వైసీపీ నుంచి బెదిరింపులు వచ్చినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రైసు మిల్లులో పనుల నుంచి తీసివేస్తామని వారికి అధికారపార్టీ నుంచి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వార్డుల్లో టీడీపీ వైపు తిరిగే పలువురు యువకులకు వైసీపీ నుంచి బెదిరింపులు తీవ్రమైనట్లు విమర్శలు ఉన్నాయి. 

Updated Date - 2021-11-12T05:55:44+05:30 IST