హెలికాప్టర్‌ శకలాల తరలింపులో ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-12-20T14:39:43+05:30 IST

కున్నూర్‌ నంజప్పసత్రంలో రోడ్డు వసతి లేకపోవడంతో, ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ శకలాలు సంఘటనాస్థలం నుంచి బయటకు తీసుకురావడంలో ఇబ్బందులు తలెత్తాయి. నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపం

హెలికాప్టర్‌ శకలాల తరలింపులో ఇక్కట్లు

పెరంబూర్‌(చెన్నై): కున్నూర్‌ నంజప్పసత్రంలో రోడ్డు వసతి లేకపోవడంతో, ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ శకలాలు సంఘటనాస్థలం నుంచి బయటకు తీసుకురావడంలో ఇబ్బందులు తలెత్తాయి. నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపం నంజప్పసత్రం వద్ద ఈనెల 8వ తేదీ త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలిపాప్టర్‌ ప్రమాదానికి గురికాగా, ప్రయాణిస్తున్న అందరూ మృత్యు వాతపడ్డారు. ప్రమాదంలో విడిపోయిన హెలికాప్టర్‌ భాగాలను వైమానిక దళం సేకరించి అదే ప్రాంతంలో భద్రపరచారు. నంజప్పసత్రంలో రోడ్డు వసతి లేకపోవడంతో వాటిని ఎలా తీసుకురావాలి అనే ప్రశ్న తలెత్తింది. హెలికాప్టర్‌ శకలాలు అధిక బరువు కలిగి ఉండడంతో మనుషుల ద్వారా తీసుకొచ్చేందుకు వీలు లేకుండా ఉంది. క్రేన్‌ లాంటి భారీ యంత్రాల ద్వారానే వీటిని తీసుకొచ్చేందుకు వీలువుతుంది. కానీ, ఆ ప్రాంతంలో రోడ్డు వసతి లేకపోవడంతో యంత్రాలు సంఘటనాస్థలానికి వెళ్లలేవు. ఇందుకోసం ఆ ప్రాంతంలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటుచేయాలంటే ఆ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండడంతో పాటు రోడ్డు ఏర్పాటుకు చెట్లు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు అటవీశాఖ అనుమతులు పొందడం కష్టతరమైన పని. నంజప్పసత్రం నుంచి పరప్పాలం ప్రాంతానికి గిరిజనులు వెళ్లేందుకు ఓ బాట ఉంది. ఈ బాటలో వింజ్‌ అమర్చి, పరప్పాలం ప్రాంతానికి భారీ యంత్రాల సాయంతో హెలికాప్టర్‌ శకలాలు తీసుకెళ్లాలని  నిర్ణయించిన వైమానిక దళం, ఇందుకోసం బెంగుళూరుకు చెందిన ఓ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ సంస్థ ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి వింజ్‌ ఏర్పాటు సాధ్యమని తెలిపితే, అప్పుడు హెలికాప్టర్‌ శకలాలు బయటకు తీసుకొచ్చే వీలుంటుంది.

Updated Date - 2021-12-20T14:39:43+05:30 IST