హెల్‌ టవర్స్‌

ABN , First Publish Date - 2021-05-09T05:29:34+05:30 IST

హెల్‌ టవర్స్‌

హెల్‌ టవర్స్‌
పరిగిలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌

  • జనావాసాల మధ్య సెల్‌టవర్ల ఏర్పాటు
  • రేడియేషన్‌తో అనారోగ్యాలు  
  • పట్టించుకోని అధికారులు 
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం 


పరిగి: పరిగి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల  మధ్యే సెల్‌ టవర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సెల్‌ టవర్ల ద్వారా వచ్చే రేడియేషన్‌తో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. సెల్‌టవర్లు తీసివేయాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదని జనం విమర్శిస్తున్నారు. వీటిని తీసివేసేందుకు పురపాలక సంఘం, పంచాయతీలు ముందుకు రావాలని వారు కోరుతున్నారు. పరిగి పట్టణంలో పదిచోట్ల సెల్‌టవర్లు ఉన్నాయి. అలాగే మండలంలోని సయ్యద్‌పల్లి, రాపోల్‌, మాదారం, నస్కల్‌, గడిసింగాపూర్‌ తదితర గ్రామాల్లో వివిధ కంపెనీలకు చెందిన 30కి పైగా సెల్‌టవర్లు ఏర్పాటు చేశారు. ఏ గ్రామంలో సెల్‌టవర్‌ నిర్మించినా ముందుగా గ్రామ పంచాయతీకి రూ.10 వేలు అనుమతి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. కానీ ఏర్పాటు సమయంలో సెల్‌టవర్‌ యజమానులు పన్నులు చెల్లించిన దాఖలాలు లేవు. అలాగే ప్రతి ఏటా గ్రామ పంచాయతీలకు సెల్‌టవర్‌ నిర్వాహకులు టవర్‌ నిర్మాణాన్ని బట్టి పన్ను చెల్లించాలి. దీనికి తోడు టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌తో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉన్నందున టవర్లను ఇళ్ల మధ్య ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పరిగి పట్టణంలోని 9వ వార్డులో కూడా ప్రజలు ఆందోళనకు దిగారు. అయినా టవర్‌ నిర్వాహకులు టవర్‌కు రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ నుంచి అనుమతి తీసుకొని టవర్‌ ఏర్పాటు చేశారు.

పన్నుల వసూలు లేదు

గ్రామాల్లో సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో సెల్‌టవర్ల యజమానుల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. సెల్‌టవర్‌ ఏర్పాటు చేసే సమయంలో టవర్‌ సామర్థ్యం బట్టి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రతి ఏటా ఇంటిపన్నుతో పాటు టవర్‌కు సంబంధించిన పన్నులను పంచాయతీకి చెల్లించాలి. కానీ, ఈ పన్నులు వసూలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది : డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, పరిగి ప్రభుత్వ అస్పత్రి 

 ఇళ్ల మధ్యలో సెల్‌టవర్లు ఉండడం వల్ల రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. సెల్‌ఫోన్‌లు నిరంతరంగా వినియోగిస్తే దానిద్వారా అనేక దుష్ఫలితాలు ఉంటాయి. ఇక సెల్‌టవర్‌ వైబ్రేషన్‌ తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ రేడియేషన్‌ ప్రభావం మనిషి చర్మంపై కూడా పడే అవకాశం లేకపోలేదు. అందువల్ల ఇళ్లమధ్య సెల్‌టవర్లు ఉండకపోవడమే మంచిది.


Updated Date - 2021-05-09T05:29:34+05:30 IST