కుమ్మరుల కుల వృత్తికి చేయూత

ABN , First Publish Date - 2022-08-11T06:03:27+05:30 IST

కుమ్మరుల కులవృత్తికి చేయూతనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

కుమ్మరుల కుల వృత్తికి చేయూత
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావుకు మట్టి గణపతి విగ్రహాన్ని అందజేస్తున్న కుమ్మరులు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 10: కుమ్మరుల కులవృత్తికి చేయూతనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కుమ్మరి వృత్తి చేసే 8 మందికి యంత్ర పరికరాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై కుమ్మరులకు అధునాతన పనిముట్లు, యంత్రాలు, ముడి సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో మట్టి పాత్రలకు డిమాండ్‌ పెరిగిందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్‌ కార్డులను అందజేస్తున్నామని, పేదలైన లేబర్‌ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నంగునూరు మండలంలోని 61 మంది లబ్ధిదారులకు రూ.1.95 లక్షలు, చిన్నకోడూరు మండలంలోని 45 మంది లబ్ధిదారులకు రూ.1.44 లక్షలు, నారాయణరావుపేట మండలంలోని 22 మంది లబ్ధిదారులకు రూ.70,400 చొప్పున మొత్తం రూ.4.09 లక్షలను అందజేస్తున్నట్లు తెలిపారు. 

సామాజిక సేవలో ముందుండాలి

కొండపాక, ఆగస్టు 10: సామాజిక సేవలో యువజన సంఘాలు ముందుండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో  చైతన్య యూత్‌ వారు గ్రామ ప్రజల అవసరాల కోసం సొంత నిధులతో తయారు చేయించిన వైకుంఠరథాన్ని హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించి పాలకవర్గానికి అందజేశారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ దుద్దెడ చైతన్య యూత్‌ అసోసియేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలను యువజన సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామపంచాయితీ భవనంలో చైతన్య యూత్‌ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్‌, యూత్‌ సభ్యులు సర్పంచ్‌ ఆరెపల్లి మహాదేవు కు వైకుంఠ రథం వాహనాన్ని అప్పగించారు. అనంతరం ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కొండపాక 108 సిబ్బంది బైండ్ల మహేందర్‌, పంజాల రమే్‌షను మంత్రి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆరెపల్లి మహదేవ్‌గౌడ్‌, ఎంపీటీసీ బాలాజీ, ఉపసర్పంచ్‌ గుండెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:03:27+05:30 IST